ప్రతిసారీ డైవర్షన్ పనిచేయదు. మనం ఒక మోసం చేద్దామనుకుంటే అసలు నిజం దానివెంటే పరుగులిడుతూ వస్తుంది.. అది కాలమహిమ!
గురువారం ఈ విచిత్రమే జరిగింది. శుక్రవారం ఢిల్లీలో ఏపీ-తెలంగాణ జలకమిటీ సమావేశం ఉన్నది. కృష్ణా జలాలను ఆంధ్రా పొలాలకు అప్పజెప్పడానికి బాబుగారి తెలంగాణ తాబేదార్లు రంగమంతా సిద్ధం చేశారు. ఈ గుట్టు ఎక్కడ బయటపడుతుందోనని అలవాటైన డైవర్షన్ డ్రామా మొదలుపెట్టారు. అందులో భాగంగానే, పసలేని ట్యాపింగ్ కేసులో తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌కు సిట్ నోటీసు.
నోటీసు వార్త బయటకు పొక్కిన కొద్దిసేపటికే పార్లమెంటుకు కేంద్ర ప్రభుత్వం సమర్పించిన ఆర్థిక సర్వే వివరాలూ బయటకు వచ్చాయి. తెలంగాణలో కేసీఆర్ పదేండ్ల పరిపాలన ప్రగతి మయంగా సాగిందని, అద్భుతాలు సృష్టించిందని ఆర్థిక సర్వే కుండబద్ధలు కొట్టింది. వ్యవసాయం మొదలుకొని, పరిశ్రమల దాకా, నీళ్లు మొదలుకొని నియామకాల దాకా కేసీఆర్ తెలంగాణ గణనీయ పురోగతి సాధించిందని ఆర్థిక సర్వే ప్రశంసించింది. కాంగ్రెస్, బీజేపీలు పనికిరాదని నిందలువేస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ జీవనాడి అని ఉద్ఘాటించింది. ఆ ప్రాజెక్టు వల్ల తెలంగాణలో జలసిరి పెరగడమే కాదు, ఏకంగా 89 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు అవతరించిందని, తెలంగాణ సాగు విస్తీర్ణం 2.2 కోట్ల ఎకరాలకు చేరిందని ఆర్థిక సర్వే కండ్లకు కట్టింది.
అదే సమయంలో రేవంత్‌రెడ్డి రెండేండ్ల పాలనలో వడ్ల ఉత్పత్తి పడిపోయిందని, ప్రజల కొనుగోలు శక్తి దారుణంగా దెబ్బతిన్నదని ఆర్థిక సర్వే పేర్కొన్నది.
నోటీసులు, కేసులు, విచారణలు అంటూ రోజుకో సినిమా సీన్‌ను సృష్టిస్తూ కాలక్షేపం చేస్తున్న కాంగ్రెస్ పాలకుల కండ్లకు ఈ నిజాలు కనపడుతాయా? రెండు కండ్ల బాబు కోసం కష్టపడి ఆడుతున్న డ్రామాలను ఇప్పటికైనా ఆపుతారా? కేసీఆర్‌ను బద్నాం చేయాలనే విఫలయత్నాలు మానుకొని తెలంగాణ ప్రయోజనాలను ఇకనైనా కాపాడుతారా?
ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్ పదేండ్ల పాలనలో తెలంగాణ సర్వోన్నతాభివృద్ధి సాధించింది. కేసీఆర్ నిర్మించిన ప్రాజెక్టులు, తీసుకొచ్చిన విప్లవాత్మక పథకాలు రాష్ర్టాన్ని అభివృద్ధి బాట పట్టించాయి. సమైక్య ఏలుబడిలో పడావుపడిన తెలంగాణ.. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో దేశానికే అన్నపూర్ణగా ఎదిగింది. ధాన్యం ఉత్పత్తిలో కొత్త రికార్డులను సృష్టించింది. కొలువుల కోసం కొట్లాడిన యువతకు స్వరాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో లక్షలాది ఉద్యోగాలు లభించాయి. కేసీఆర్ సర్కార్ తీసుకున్న వినూత్న నిర్ణయాలతో మహిళలకు ఆర్థిక భరోసా లభించింది. తయారీ, సేవారంగం రాకెట్ వేగంతో దూసుకుపోయి ఆర్థికాభివృద్ధి పరుగులు పెట్టింది. మొత్తంగా కేసీఆర్ హయాంలో తెలంగాణ దేశానికే రోల్ మాడల్‌గా నిలిచింది. ఈ మేరకు పార్లమెంట్లో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ గురువారం విడుదల చేసిన ఆర్థిక సర్వే 2025-26ను బట్టి అర్థమవుతున్నది. తెలంగాణను జలసిరులతో నింపి సాగును పండుగగా మార్చాలన్న ఉద్దేశంతో కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయ పథకాలను ఆర్థిక సర్వే ప్రత్యేకంగా ప్రశంసించడం విశేషం.
(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ): అర చేతితో సూర్యకాంతిని ఆపలేరని అంటారు. దీనికి తగ్గట్టే కేసీఆర్ పదేండ్ల పాలనలో జరిగిన అభివృద్ధిని దాచిపెట్టాలని రేవంత్ బృందం ఎన్ని దుష్టపన్నాగాలు పన్నినప్పటికీ కుదరట్లేదు. ఆర్బీఐ, నీతిఆయోగ్ వంటి మేధో సంస్థలు, ‘ది ఎకానమిస్ట్’ వంటి అంతర్జాతీయ పత్రికలు, నిపుణులు కేసీఆర్ పాలనను ఇప్పటికే వేనోళ్ల పొగిడారు. తాజాగా ఈ జాబితాలో కేంద్రప్రభుత్వం వెలువరించిన ఆర్థిక సర్వే 2025-26 కూడా చేరింది. కేసీఆర్ పాలనలో తెలంగాణలో జరిగిన వ్యవసాయాభివృద్ధి, ఉద్యోగ కల్పన, మహిళలకు ఆర్థిక స్వావలంబన ఇత్యాది అంశాలను సర్వే ప్రశంసించింది.
ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించినప్పుడు అంటే 2014లో సాగు విస్తీర్ణం 1.31 కోట్ల ఎకరాలుగా ఉన్నట్టు ఆర్థిక సర్వే తెలిపింది. అయితే, 2023 ఆర్థిక సంవత్సరానికి ఇది 2.2 కోట్ల ఎకరాలకు పెరిగినట్టు వెల్లడించింది. కేసీఆర్ సర్కారు నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీస్టేజ్, మల్టీ పర్పస్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం, చెరువుల పునరుజ్జీవనానికి ఉద్దేశించిన మిషన్ కాకతీయ పథకాలతోనే రాష్ట్రంలో సాగు విప్లవం సాధ్యమైందని ఆర్థిక సర్వే నొక్కి చెప్పింది. అలా తొమ్మిదేండ్ల వ్యవధిలోనే 89 లక్షల ఎకరాలకు కొత్తగా సాగునీరు అందించడంలో కేసీఆర్ సర్కారు విజయం సాధించినట్టు ప్రశంసించింది.
అలా కేసీఆర్ పాలనలో సాగు విస్తీర్ణం పెరుగడంతో తెలంగాణ ధాన్యాగారంగా మారిందని ఆర్థిక సర్వే కొనియాడింది. కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయ పథకాలతో నీటి పారుదల సౌకర్యాలు మెరుగయ్యాయని, సహజనీటి వనరులకు కొత్త జీవం వచ్చిందని తెలిపింది. అంతేకాకుండా మారుతున్న వాతావరణ పరిస్థితులకు తగినట్టు కొత్త వ్యవసాయ వంగడాలను అభివృద్ధి చేయడంతో ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ గణనీయమైన ప్రగతి సాధించినట్టు ఆర్థిక సర్వే కొనియాడింది. మొత్తంగా తొమ్మిదేండ్లలో తెలంగాణ దేశానికి అన్నపూర్ణగా మారిందన్న నిపుణుల వ్యాఖ్యలను ఆర్థిక సర్వే గణాంకాలు ధ్రువపరిచినట్టయింది.
కేసీఆర్‌పాలనలో తీసుకొచ్చిన టీఎస్ఐపాస్ వంటి విప్లవాత్మకమైన పాలసీలతో సేవారంగం రాకెట్ వేగంతో దూసుకుపోయింది. ఐటీ, ఐటీ ఆధారిత సేవల ఎగుమతుల్లో రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. దీన్ని రుజువుచేస్తూ.. సేవారంగంలో టాప్-4 రాష్ర్టాల్లో తెలంగాణ కూడా నిలిచిందని ఆర్థిక సర్వే కొనియాడింది. ఐటీ, ఫైనాన్స్. ప్రొఫెషనల్ వంటి సేవల్లో తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ర్టాలు మొత్తంగా 40 శాతం వాటాను కలిగి ఉన్నట్టు ఆర్థిక సర్వే వెల్లడించింది.
తెలంగాణ రాష్ట్రం సేవా రంగంలో గత పదేండ్లలో అద్భుతమైన ప్రగతి సాధించింది. ముఖ్యంగా ఐటీ, ఫైనాన్స్, ప్రొఫెషనల్ సర్వీసెస్ వంటి రంగాల్లో తెలంగాణ సాధించిన వృద్ధి జాతీయ సగటును మించిపోయింది.
హైదరాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ):బీఆర్ఎస్ ప్రభుత్వంలో నాటి ఐటీ మంత్రి కేటీఆర్ నాటిన ఐటీ పరిశ్రమల బీజాలు నేడు ఫలాలను అందిస్తున్నాయి. అధిక నగరీకరణ కారణంగా ఈ సేవలు తెలంగాణలో కేంద్రీకృతమై, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచాయి. పరోక్షంగానూ ఉద్యోగాలు తెలంగాణ సేవా రంగం ప్రధానంగా హై-ప్రొడక్టివిటీ సేవలపై ఆధారపడి ఉన్నది.
గూగు ల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి ప్రపంచ ప్ర ఖ్యాత గ్లోబల్ ఐటీ దిగ్గజాలు తమ అతిపెద్ద కార్యాలయాలను హైదరాబాద్‌లో స్థాపించాయి. ఫలితంగా ఐటీ రంగంలో ఉద్యోగ కల్పన గడిచిన పదేండ్లలో గణనీయంగా పెరిగింది. ప్రతి ప్రత్యక్ష ఉద్యోగం మరో 3 నుంచి 4 పరోక్ష ఉద్యోగాలను (ట్రాన్స్పోర్ట్, హౌస్ కీపిం గ్, క్యాటరింగ్) సృష్టిస్తున్నది. గత పదేండ్లలో ప ర్యాటక రంగం ద్వారా వచ్చే ఆదాయం గణనీయంగా పెరిగింది. యాదాద్రి ఆలయ పునర్నిర్మా ణం, రామప్ప దేవాలయానికి యునెసో గుర్తిం పు వంటి అంశాలు పర్యాటకుల సంఖ్యను పెంచా యి.
ఐటీ, బిజినెస్ ట్రావెల్ పెరగడంతో హైదరాబాద్‌లో స్టార్ హోటళ్ల ఆక్యుపెన్సీ 75 శాతం దాటింది. హోటల్ మేనేజ్మెంట్ పూర్తి చేసిన యువతకు డిమాండ్ భారీగా పెరిగింది. గత బీఆర్ఎస్ సర్కారు వివిధ నోటిఫికేషన్ల ద్వారా సుమారు 1.7 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసింది. సుమారు 7 లక్షల వరకు ప్రైవేటు ఉద్యోగాలను సృష్టించింది. పట్టణీకరణ చెందిన తెలంగాణ రాష్ట్రంలో సేవా రంగం కేవలం ఐటీకే పరిమితం కాకుండా, రియల్ ఎస్టేట్, ఫైనాన్స్, ప్రొఫెషనల్ సర్వీసెస్‌లో వినూత్నంగా దూసుకుపోతున్నది.
ఉమ్మడి రాష్ట్రంలో ప్రాజెక్టులను నిర్మించకపోవడం, అంతకుముందు నిజాంలు నిర్మించిన ప్రాజెక్టుల నీటినిల్వ సామర్థ్యం పడిపోవడం తో తెలంగాణ రైతాంగం తాగు, సాగు నీటికి తండ్లాడింది. ఈ నేపథ్యంలోనే సుదీర్ఘ మేధోమధనం సాగించి కేసీఆర్ సృష్టించిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ఉమ్మడిపాలకులు సృష్టించిన సమస్యలకు పరిష్కారం చూపింది.
పాత ప్రాజెక్టుల ఆయకట్టుకు భరోసానివ్వడమేగాక కొత్త ఆయకట్టుకు కాళేశ్వరం పురుడుపోస్తున్నది. ఒక్క కాళేశ్వరం అందుబాటులోకి రావడం వల్ల తెలంగాణలోని గోదావరి ముఖచిత్రం మారిపోయింది. ఈ ఒక్క ప్రాజెక్టు ద్వారానే గోదావరిలో 954టీఎంసీల్లో 750టీఎంసీలకు పైగా వినియోగించుకునేందుకు మార్గం సుగమమైంది. కాళేశ్వరం నిర్మించడం, కాలువలను చెరువులతో అనుసంధానించడం ఫలితంగా సాగువిస్తీర్ణం గణనీయం పెరిగింది.
ఎస్సారెస్పీ ఆయకట్టు ఒక్కటే అందుకు సజీవ సాక్ష్యంగా కనిపిస్తుంది. ఒకనాడుకు స్టేజీ1కే సాగునీరు దిక్కులేని దుస్థితి నుంచి స్టేజీ2లోని సూర్యాపేట, తుంగతుర్తిలో చిట్టచివరి ఆయకట్టుకు నీరందించింది. ఎగువ నుంచి వరద వచ్చినా, రాకున్నా ఎల్లంపల్లికి ఢోకా లేకుండా పోయింది. దైవాధీనంగా మానేరుపై నిర్మించిన ఎగువ, మధ్య, దిగువ మానేరుకు కాళేశ్వర గంగ శాశ్వత భరోసా కల్పించింది. మంజీరా ముఖం చాటేసినా, సింగూరుకు కాళేశ్వరం ఊపిరిలూదింది. ఒక్కమాటలో చెప్పాలంటే తెలంగాణ ప్రగతి కాళేశ్వరానికి ముందు, ఆ తరువాత అనే నిర్వచించవచ్చు.

స్వరాష్ట్ర ఏర్పాటు అనంతరం కేసీఆర్ మిషన్ కాకతీయ పథకానికి శ్రీకారం చుట్టారు. ఉద్యమం తరహాలో చెరువుల పునరుద్ధరణ చేపట్టారు. మిషన్ కాకతీయ పథకం నాలుగు దశల్లో మొత్తంగా 27,625 చెరువులను పునరుద్ధరించగా, ఆ చెరువుల కింద 20.78 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది.
పూడికతీత ద్వారా 8.50 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం పెరగగా, ఏకంగా 15.05 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ సాధ్యమైంది. అయినప్పటికీ ఉమ్మడి పాలకులు దశాబ్దాల నిర్లక్ష్యం మూలంగా చాలా చెరువులకు వరదవచ్చే మార్గాలే లేకుండా పోయాయి. ఈ నేపథ్యంలో మిషన్ కాకతీయ ఆశయాన్ని నెరవేర్చేందుకు కేసీఆర్ మరో బృహత్తర ఆలోచన చేశారు. చెరువులకు శాశ్వత జలకళను తీసుకువచ్చేందుకు.. ప్రాజెక్టులకు చెరువులను అనుసంధానించాలని నిర్ణయించారు.
మొత్తంగా ప్రాజెక్టుల కమాండ్ ఏరియాలోని 20వేలకుపైగా చెరువులను ప్రాజెక్టులతో లింక్ చేయాలని లక్ష్యం పెట్టుకోగా, ఇప్పటికే అందులో 10వేలకు పైగా చెరువులను ప్రాజెక్టులకు ముడిపెట్టడంతోపాటు నదీ జలాలతో నింపుతూ వచ్చారు. ఇక చెరువులను నింపడంలోనూ కాళేశ్వరం కీలకభూమికను పోషిస్తున్నది. చెరువుల పునరుద్ధరణతో 5.36 మీటర్ల మేర భూగర్భజలాలు పెరిగాయి. ఉచిత కరెంటు ఫలితంగానూ బోరుబావుల కింద వ్యవసాయం కూడా పండుగలా మారింది. దాదాపు 45లక్షల ఎకరాలు 30లక్షల బోర్లు కిందనే సాగయిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించిన ‘వీ-హబ్’ కార్యక్రమాన్ని ఆర్థిక సర్వే ప్రత్యేకంగా ప్రశంసించింది. శ్రామికరంగంలో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచడానికి ‘వీ-హబ్’ దోహదపడినట్టు వివరించింది.
వీ-హబ్ ద్వారా ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలకు ఎంతో ప్రయోజనం చేకూరిందని వెల్లడించింది. పెట్టుబడిదారులకు, మహిళా పారిశ్రామికవేత్తలు స్థాపించిన స్టార్టప్‌లకు వీ-హబ్ ఓ వారధిగా నిలిచిందని కొనియాడింది. అంతేకాదు.. పరిశ్రమలు, వాణిజ్య సముదాయాల్లో పనిచేసే మహిళలకు భద్రతను కల్పిస్తూనే అప్పటివరకూ వారిపై ఉన్న ఆంక్షలను అప్పటి కేసీఆర్ సర్కారు ఎత్తేసింది. దీంతో మహిళా కార్మికులకు పనిచేసే వెసులుబాటు లభించిందని ఆర్థిక సర్వే పేర్కొంది.
మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం అందించేందుకు నాటి కేసీఆర్ ప్రభుత్వం 2018లో వీ-హబ్‌ను ప్రారంభించారు. ఇది దేశంలోనే తొలి రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని మహిళా ఇంక్యుబేటర్. మహిళా భాగస్వామ్యం ద్వారా ఆర్థిక పరివర్తన తీసుకురావడమే దీని ప్రధాన లక్ష్యం. మహిళా పారిశ్రామికవేత్తలను ఇన్వెస్టర్లతో అనుసంధానించడం, మహిళలకు మారెట్ అవకాశాలను పెంచడం, వారి ఉత్పత్తులకు సరైన గుర్తింపు వచ్చేలా చేయడం వీ-హబ్ లక్ష్యాలు. వీ-హబ్ ఇప్పటి వరకు మహిళలు నిర్వహించే 4,527 స్టార్టప్‌లకు సపోర్టు ఇచ్చింది. ఐదు ముఖ్యమైన రంగాలలో 50 మహిళా ఎంట్రప్రెన్యూర్లకు ఇంక్యుబేట్ చేస్తున్నది.
‘నీళ్లు, నిధులు, నియామకాలు’ లక్ష్యంతో ఆవిర్భవించిన తెలంగాణ.. కేసీఆర్‌పాలనలో కాళేశ్వరం జలసిరులతో జలభాండాగారంగానే కాదు కొలువుల ఖిల్లాగానూ మారింది. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో యువతకు లక్షలాది కొలువులను కల్పించింది. జనాభాపరంగా దేశంలో 3 శాతం వాటా కూడా లేని తెలంగాణ.. యువతకు ఉద్యోగాలు కల్పించడంలో ఏకంగా 5 శాతం వాటాను కలిగిఉన్నట్టు తాజాగా తేలింది. తయారీరంగ ఉద్యోగాల్లో ఏడు రాష్ర్టాలు 60 శాతం వాటా కలిగి ఉండగా.. అందులో తెలంగాణ 5 శాతం వాటాతో టాప్ ప్లేస్‌లో ఒకటిగా నిలిచినట్టు ఆర్థిక సర్వే తెలిపింది. జనాభా-కొలువులు ప్రాతిపదికన చూసుకొంటే ఈ జాబితాలో తెలంగాణే అగ్రస్థానంలో నిలిచింది.
బీఆర్ఎస్ హయాంలో ఇప్పటి వరకు పారిశ్రామిక, సేవా రంగాల్లో ఉద్యోగాల కల్పన దాదాపు రెట్టింపు అయ్యింది. కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన టీఎస్-ఐపాస్ వంటి విధానాలు దీనికి ప్రధాన కారణం. గత పదేండ్లలో తయారీ రంగంలో సుమారు 15 లక్షల నుంచి 18 లక్షల వరకు ప్రత్యక్ష ఉద్యోగాలు లభించాయి. పదేండ్లలో ఐటీ రంగంలో ఉద్యోగాల సంఖ్య దాదాపు 3 రెట్లు పెరిగింది. పరోక్షంగా మరో 20-25 లక్షల మందికి ఉపాధి లభించింది. 20,000పైగా కొత్త ఎంఎస్ఎంఈ యూనిట్లు ప్రారంభమయ్యాయి. వీటి ద్వారా 4.5 దేశంలోని మొత్తం ఫార్మా ఉద్యోగాల్లో తెలంగాణ వాటా 30శాతం ఉన్నది. ఈ రంగంలో సుమారు 4 లక్షల మందికి కొత్తగా ఉపాధి లభించింది.
ఆర్థిక సర్వేలో ప్రస్తావించిన అంశాలు తొమ్మిదేండ్ల కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధిని ప్రతిబింబిస్తున్నాయి. కేసీఆర్ దీర్ఘదృష్టి, కృషి ఫలితంగానే రాష్ట్రంలో వ్యవసాయ విప్లవం సాకారమైంది. ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. యువతకు ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయి. ఐటీ ఎగుమతులు పెరిగాయి. మొత్తంగా తెలంగాణ దేశానికి రోల్ మాడల్‌గా మారింది.
– మాజీ ఐఏఎస్ కే రామ్మోహన్రావు
ఐటీ, ఐటీ ఆధారిత సేవారంగంలో తెలంగాణ రాకెట్ వేగంతో దూసుకుపోతున్నది. ముఖ్యంగా కేసీఆర్‌పాలనలో తీసుకొచ్చిన సంస్కరణలతో హైదరాబాద్ దేశానికే ఐటీహబ్‌గా మారింది. ఎన్నో విషయాల్లో బెంగళూరుకు హైదరాబాద్ గట్టి పోటీ ఇచ్చింది.
– ప్రశాంత్ జోషి, ఇన్నోవేటివ్ థాట్ ఫౌండర్, బెంగళూరు
కేసీఆర్ పాలనలో కాళేశ్వరం, మిషన్ కాకతీయ ద్వారా సాగునీటి సౌకర్యం కల్పించారు. రైతులకు రైతుబంధు, నిరంతర విద్యుత్తు, సరిపడా యూరియా అందించారు. రైతు పండించిన పంటకు మార్కెట్లో భరోసా కల్పించారు. గ్రామాల్లోనే ధాన్యం సేకరించడం ద్వారా రైతులకు పెద్ద ఊరట కలిగింది. సాగు బాగు పడటంతో, గతంలో వలస వెళ్లిపోయిన రైతులంతా సొంత గ్రామాల బాటపట్టారు. తెలంగాణను బంగారు తెలంగాణ చేస్తానని 2014లో కేసీఆర్ అన్నారు. వినూత్న పథకాలతో చేసి చూపించారు. తాజా ఆర్థిక సర్వే ఇందుకు నిదర్శనం.
-చంద్రి రాఘవరెడ్డి, హెచ్‌సీయూ ప్రొఫెసర్
కేసీఆర్ దార్శనికతతో కూడిన ప్రణాళికలతోనే రైతులకు మేలు జరిగింది. రాజకీయ కారణాలతో ప్రజలకు అన్యాయం చేయొద్దు. ‘తల్లిని చంపి బిడ్డకు జన్మనిచ్చారు’ అంటూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి ప్రధాని మోదీ గతంలో చేసిన వ్యాఖ్యలు అబద్ధమని ఆర్థిక సర్వేతో తేలిపోయింది.
-వనపట్ల సుబ్బయ్య, సామాజిక విశ్లేషకుడు
కేసీఆర్‌పాలనలో సాగు, పారిశ్రామిక అభివృద్ధి, మహిళా పారిశ్రామిక వృద్ధిలో తెలంగాణ అగ్రగామి అనే సత్యం నిరూపితమైంది. అయితే, కోటి ఎకరాల మాగాణం కలకు చేరువవుతున్న క్రమంలో కాలం దిష్టిపెట్టింది. కేసీఆర్ కలను దుష్ప్రచారం భగ్నం చేసింది. జాతి గర్వించదగ్గ కాళేశ్వరం పట్ల విష ప్రచారం కొనసాగుతూనే ఉన్నది. కుట్రలకు తెలంగాణ బలికాక ముందే ప్రజలు చైతన్యవంతులై ప్రజాకంటక పాలనకు బుద్ధి చెప్పాలి.
-కోట్ల వెంకటేశ్వర్‌రెడ్డి, సామాజిక విశ్లేషకుడు
రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి పదేండ్లలో తెలంగాణ అద్భుతమైన ప్రగతి సాధించింది. కరోనా కాలంలో ప్రతికూల పరిస్థితులను అధిగమించి కూడా ఊహించని అభివృద్ధిని నమోదు చేసింది. ఇప్పటికే కాగ్ రిపోర్ట్, నీతి ఆయోగ్‌తోపాటు అంతర్జాతీయ సంస్థలు కూడా తెలంగాణలో జరిగిన అభివృద్ధిని గుర్తించాయి. ఇప్పుడు తాజాగా ఆర్థిక సర్వేలోనూ మరోసారి స్పష్టమైంది.
-ప్రొఫెసర్ సీతారామారావు, సామాజిక విశ్లేషకుడు
నిజం నిప్పులాంటిది, అబద్ధాలతో కప్పివేయాలని చూస్తే దాగదు. పదేండ్లలో కేసీఆర్ సాధించిన ప్రగతి, కేంద్రం ప్రకటించిన ఆర్థిక సర్వే నివేదికతో మరోసారి స్పష్టమైంది. కేసీఆర్ పాలనపై దుష్ప్రచారం చేసే రాజకీయ నేతలు ఇప్పటికైనా తమ వైఖరి మార్చుకోవాలి.
-దేవభక్తుని పాపారావు, ఆర్థిక నిపుణుడు
తెలంగాణలో భూగర్భ జలాలు రోజురోజుకూ తగ్గిపోతున్నాయి. ఈ క్రమంలో కాళేశ్వరం, మిషన్ కాకతీయ వంటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఇలాంటి ప్రాజెక్టులను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది. తద్వారా భూగర్భ జలాలతోపాటు, సాగు విస్తీర్ణం పెరుగుతుంది. కేంద్రం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే నివేదికలో కూడా ఇదే విషయం స్పష్టంచేసింది. 2014లో 1.31 కోట్ల ఎకరాలు ఉన్న సాగు విస్తీర్ణం, 2023 నాటికి 2.2 కోట్ల ఎకరాలకు పెరగడం అంటే అది కాళేశ్వరం సాధించిన ఘనత.
-వెంకట్ పర్స, రచయిత