KTR | కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారుకు తెలంగాణ అంటే ఎంత చిన్నచూపో మరోసారి పార్లమెంట్ సాక్షిగా ఈ బడ్జెట్ రుజువుచేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పేర్కొన్నారు. గత బడ్జెట్ మాదిరిగానే ఈ సారి కూడా కనీసం తెలంగాణ అనే పదమే ఉచ్ఛరించలేదని.. ఈ బడ్జెట్ లోనైనా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ వైపు కన్నెత్తైనా చూస్తుందేమో అని నాలుగు కోట్ల ప్రజలు ఎదురుచూశారన్నారు. కానీ అందరి ఆశలపై కేంద్ర ప్రభుత్వం మళ్లీ నీళ్లు చల్లిందన్నారు. రానున్న ఎన్నికల కోసం బీహార్ కు బంగారుపల్లెంలో వడ్డించి.. తెలంగాణకు మాత్రం అన్యాయం చేసిందన్నారు. తెలంగాణకు ఐఐటీ, ఐఐఎం, ఐసర్, ఎన్ఐడీ, ట్రిపుల్ ఐటీ వంటి ఉన్నత విద్యాసంస్థల్లో ఏదీ ఇవ్వకపోవడం ఇక్కడి విద్యార్థులకు, యువతకు, వారి తల్లిదండ్రులకు తీవ్ర అన్యాయం చేయడమే అన్నారు.
దేశ అత్యున్నత చట్టసభలో హామీ ఇచ్చిన విభజన హక్కులను కూడా కేంద్ర ప్రభుత్వం నెరవేర్చకపోవడం అత్యంత దుర్మార్గమన్నారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ఐటీఐఆర్ పునరుద్ధరణ, సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా వంటి హామీలు ఇన్నాళ్లయినా అమలు చేయని బీజేపీని ఇకపై రాష్ట్ర ప్రజలు నమ్మరన్నారు. పక్కనున్న విశాఖ ఉక్కు కర్మాగారానికి నిధుల సహాయం అందిస్తూ తెలంగాణకు మెండి చూపించారన్నారు. కేంద్ర బడ్జెట్ లో ప్రాధాన్యతలు, కేటాయింపులు చూస్తే, కేవలం బీజేపీ పాలిత రాష్ట్రాలకు పెద్దపీట వేసి, బడ్జెట్ లో ఇతర రాష్ట్రాలకు అన్యాయం చేయడం సరైన సంస్కృతి కాదన్నారు. దేశం ఖజానా నింపే దక్షిణాది రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం సమాఖ్య స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధమంటూ మండిపడ్డారు.
KTR | జాతీయ పార్టీలు తెలంగాణ ప్రయోజనాలు కాపాడలేవని మరోసారి కేంద్ర బడ్జెట్తో రుజువైంది : కేటీఆర్