KTR | జాతీయ పార్టీలు ఎప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడలేవని మరోసారి కేంద్ర బడ్జెట్‌తో మరోసారి రుజువైందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ రెండు పార్టీల నుంచి చెరో ఎనిమిది మంది ఎంపీలను గెలిపించి పార్లమెంట్‌కు పంపిస్తే ఆ 16 మంది కలిసి కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తెచ్చింది అక్షరాల గుండు సున్నా అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
తెలంగాణ ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాల్సిన రేవంత్ రెడ్డి బీజేపీతో చీకటి ఒప్పందాలు చేసుకోవడం వల్ల ఇవాళ ఈ పరిస్థితి దాపురించిందని మండిపడ్డారు. వరుసగా రెండో ఏడాది తెలంగాణకు చిల్లి గవ్వ కూడా తీసుకురాలేకపోయిన బీజేపీకి చెందిన కేంద్ర మంత్రులు, సీఎం రేవంత్‌రెడ్డితో పాటు కాంగ్రెస్, బీజేపీలకు చెందిన ఎంపీలు తెలంగాణ సమాజానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
స్వీయ రాజకీయ అస్తిత్వమైన బీఆర్ఎస్ మాత్రమే తెలంగాణ హక్కులను, జాతి ప్రయోజనాలను కాపాడగలుగుతుందని ప్రొఫెసర్ జయశంకర్ సార్ చెప్పిన మాట ఈ రోజు మరోసారి గుర్తుకు వస్తుందన్నారు. లోక్ సభలో తెలంగాణ పార్టీ అయినా బీఆర్ఎస్కు ప్రాతినిధ్యం లేకుంటే జరిగే నష్టం ఏమిటో ప్రజల గమనిస్తున్నారన్నారు. పార్లమెంట్లో ప్రాంతీయ పార్టీలకు బలమున్న బిహార్, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలకు దక్కిన ప్రాధాన్యం చూసి జాతీయ పార్టీలను గెలిపిస్తే తెలంగాణను నిండా ముంచారని ప్రజలకు అర్థం అయ్యిందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి 30 సార్లు ఢిల్లీకి పోయింది తెలంగాణకు నిధులు తెచ్చేందుకు కాదని, తెలంగాణ నుంచి డీల్లీకి మూటలు మోసేందుకేనని ఈ రోజు తెలిపోయిందన్నారు. కాంగ్రెస్ సీఎంగా ఉంటూ బీజేపీకి గులాంగిరీ చేస్తూన్న బడే భాయ్- చోటే భాయ్ అనుబందంతో తెలంగాణకు నయాపైసా లాభం లేదని తేలిపోయిందన్నారు.
తెలంగాణ నుంచి మరో ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు గెలిచినా.. వారితో కూడా రాష్ట్రానికి దక్కింది గుండు సున్నానే అన్నారు. కేవలం ఢిల్లీ బాసులను ప్రసన్నం చేసుకునే పని తప్ప.. ఏనాడూ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో తెలంగాణ గళం వినిపించిన పాపాన పోలేదన్నారు. కేంద్ర బడ్జెట్‌కు తెలంగాణకు రావాల్సిన వాటా గురించి పోరాడిన దాఖలు లేకపోవడం వల్లనే తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని కేటీఆర్ మండిపడ్డారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటూ, కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడితే తెలంగాణకు నిధులు తేస్తామంటూ రాష్ట్రం నుంచి ఎనిమిది మంది బీజేపీ గెలిచినా, ఇద్దరు కేంద్ర మంత్రులున్నా తెలంగాణకు ఒక్క నయా పైసా తీసుకురాలేకపోయారన్నారు. ఇతర రాష్ట్రాలనుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీలు తమ రాష్ట్రాలకు నిధుల వరద పారిస్తుంటే.. తెలంగాణ బీజేపీ ఎంపీలు, నిస్సహాయ మంత్రులు చేతకాని దద్దమ్మల్లా వ్యవహరిస్తున్నారు. తెలంగాణకు నిధులు తేలేని బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.