KTR | హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): రైతు సంక్షేమం మీద చర్చలకు సవాల్ విసిరి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీకి పారిపోయారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రేవంత్‌రెడ్డికి రచ్చ చేయడమే వచ్చు తప్ప చర్చ చేయడం రాదని మరోసారి రుజువైందని మండిపడ్డారు. బేసిక్ నాలెడ్జ్ లేని రేవంత్‌కు ప్రిపరేషన్ కోసం 72 గంటల సమయమిచ్చినా రాలేకపోయారని ఎద్దేవాచేశారు. ‘ముఖ్యమంత్రికి మరో చాన్స్ ఇస్తున్నా, టైం, డేట్ ఆయనే డిసైడ్ చేసి రావాలి.. లేదంటే ముకునేలకు రాసి కేసీఆర్‌కు క్షమాపణ చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. చర్చకు నిలబడని రేవంత్‌రెడ్డి చర్చలు అని మరోసారి సవాల్ చేయవద్దని హితవుపలికారు. రేవంత్ అసమర్థ పాలన కారణంగా 2వ పేజీలో
రైతులు అరిగోస పడుతున్నారని, ఎరువులు, యూరియా, విత్తనాల కోసం క్యూలైన్లలో గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారని విమర్శించారు. ఆనాటి రోజులు తీసుకొస్తానన్న కాంగ్రెస్, నిజంగానే నాటి దుర్దినాలను మళ్లీ తెచ్చిందని మండిపడ్డారు. గురువు చంద్రబాబు కోవర్టుగా మారి రేవంత్‌రెడ్డి తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. విచ్చలవిడిగా అవినీతి చేస్తున్న రేవంత్ సర్కారును ప్రధాని మోదీ రక్షిస్తున్నారని విమర్శించారు.
రైతు సంక్షేమంపై చర్చకు కేసీఆర్ వస్తరా? కేటీఆర్ వస్తరా? అని రేవంత్‌రెడ్డి ఇటీవల సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. ఈ సవాల్‌ను స్వీకరించిన కేటీఆర్ మూడు రోజుల క్రితం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఈ నెల 8వ తేదీ ఉదయం 11 గంటలకు చర్చకు రెడీ అని ప్రతిసవాల్ చేసిన సంగతీ విదితమే. రైతులు, నిరుద్యోగులకు బీఆర్ఎస్, కాంగ్రెస్ ఏం చేశాయో చర్చిద్దాం రమ్మని ముఖ్యమంత్రిని ఆహ్వానించిన కేటీఆర్, చెప్పిన సమయానికి అకడికి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలతో చేరుకున్నారు. ప్రెస్‌క్లబ్‌లో సీఎం రేవంత్‌రెడ్డి కోసం ప్రత్యేకంగా కుర్చీ వేసి ఆయన కోసం ఎదురుచూశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆత్మహత్య చేసుకున్న 600 మందికి పైగా అన్నదాతల కోసం బీఆర్ఎస్ నేతలు ఒక నిమిషం మౌనం పాటించి నివాళులర్పించారు. రేవంత్‌రెడ్డి కోసం అరగంట వేచి చూసి తర్వాత ఆయన రాకపోవడంతో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. రేవంత్‌రెడ్డికి రచ్చ తప్ప చర్చ తెలియదన్న సంగతి తెలంగాణ ప్రజలకు మరోసారి తెలిసివచ్చిందని ఎద్దేవాచేశారు.
తన పేరు తీసి స్వయంగా ముఖ్యమంత్రే చర్చకు రావాలని సవాల్ విసిరితే స్వీకరించానని కేటీఆర్ స్పష్టంచేశారు. ఆయనకు సమాధానం చెప్పేందుకు సమగ్ర సమాచారంతో వచ్చానని చెప్పారు. రైతుభరోసాలోని డొల్లతనాన్ని బట్టబయలు చేయడానికి అధికారిక సమాచారంతో వచ్చానన్న కేటీఆర్.. ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలోనే 670 మంది రైతులకు రైతుభరోసా రాలేదని విమర్శించారు. వారి పేర్లు, అడ్రస్‌లు, ఫోన్ నంబర్లను కూడా తెచ్చానని చెప్పారు. రుణమాఫీ కానీ లక్షల మంది అధికారిక జాబితా కూడా తమ వద్ద ఉన్నదని వివరించారు. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక వ్యవసాయం చేయలేక ఆత్మహత్య చేసుకున్న 670 మంది రైతుల వివరాలు, వడ్ల బోనస్ రాక పంటలు అమ్ముకునే దికు లేక ప్రభుత్వం కొనక మిల్లర్లకు అమ్ముకొని నష్టపోయిన రైతుల జాబితా కూడా తమ దగ్గర ఉన్నదని తెలిపారు. ముఖ్యమంత్రి లేదా ఎవరైనా మంత్రులు చర్చకు వస్తే ఆ వివరాలు ఇచ్చేవాడిని అన్నారు. బూతులు తప్ప రైతుల గురించి బేసిక్ నాలెడ్జ్ లేని రేవంత్‌రెడ్డి అసమర్థత పాలనతో 18 నెలల నుంచి తెలంగాణలోని 70 లక్షల మంది అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. రేవంత్‌రెడ్డి తెలంగాణ రైతులకు సున్నం పెడుతూ గురువు చంద్రబాబు కోసం కృష్ణా, గోదావరి నీళ్లను ఆంధ్రకు ధారాదత్తం చేస్తున్నాడని కేటీఆర్ విమర్శించారు.
ఎన్నికల ప్రచారంలో నోటికొచ్చిన హామీలు, వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చాక కోట్లాది కుటుంబాలను కాంగ్రెస్ దగా చేసిందని కేటీఆర్ విమర్శించారు. 420 హామీలు, ఆరు గ్యారంటీల అమలుకు తమది గ్యారంటీ అని బాండ్ పేపర్ మీద రాసిన కాంగ్రెస్, ఏ ఒక హామీని కూడా నెరవేర్చలేకపోయిందని మండిపడ్డారు. 50 ఏండ్ల్ల క్రితం ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీని తలదన్నేలా ప్రస్తుత కాంగ్రెస్ పాలన సాగుతున్నదని విమర్శించారు. సోషల్ మీడియాలో పెట్టిన పోస్టును రీ ట్వీట్ చేసినందుకు నల్లబాలు అనే బహుజన బిడ్డను రేవంత్ ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసిందని ధ్వజమెత్తారు. సోషల్ మీడియాలో పిల్లలు పోస్టులు పెడితేనే గజగజ వణికిపోతున్న రేవంత్ స్థాయికి కేసీఆర్ అవసరం లేదన్న కేటీఆర్.. రేవంత్‌రెడ్డికి సమాధానం చెప్పే సత్తా బీఆర్ఎస్లోని ప్రతి ఒక నాయకుడికీ ఉన్నదని స్పష్టంచేశారు. బీఆర్ఎస్ నాయకులకు మైకు ఇవ్వకుండా అసెంబ్లీలో టైం పాస్చేస్తున్న కాంగ్రెస్ వైఖరిని ప్రజలు ఈసడించుకుంటున్నారని తెలిపారు. దళితులు, గిరిజనులు, పేదల పొట్ట కొడుతున్న ఈ ఇందిరమ్మ రాజ్యానికి ఘోరీ కట్టడంతోపాటు రేవంత్‌కు కర్రుకాల్చి వాత పెట్టేందుకు ప్రజలు రెడీగా ఉన్నారని వెల్లడించారు. కార్యక్రమంలో శాసనమండలిలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మధుసూదనాచారి, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, గంగుల కమలాకర్, సబితా ఇంద్రారెడ్డి, లక్ష్మారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్, నవీన్‌కుమార్, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, డాక్టర్ సంజయ్, పాడి కౌశిక్‌రెడ్డి, కోవా లక్ష్మి, అనిల్ జాదవ్, మాజీ ఎంపీ మాలోతు కవిత, మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిశోర్, బాల్క సుమన్, కోరుకంటి చందర్, నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, తుల ఉమ, పల్లె రవి, గెల్లు శ్రీనివాస్‌యాదవ్, ఎర్రోళ్ల శ్రీనివాస్, దేవీ ప్రసాద్, దూదిమెట్ల బాలరాజుయాదవ్, సలీం, వెంకటేశ్వర్‌రెడ్డి, మేడే రాజీవ్‌సాగర్, గజ్జెల నగేశ్, తుంగ బాలు, కురువ విజయ్, కిశోర్‌గౌడ్, ముఠా జయసింహ, సతీశ్‌రెడ్డి, మారయ్య, రాగిడి లక్ష్మారెడ్డి, బొమ్మెర రామ్మూర్తి, శుభప్రద్‌పటేల్, రంగినేని అభిలాశ్ పాల్గొన్నారు.
రైతు సమస్యలపై చర్చించేందుకు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌కు వెళ్లే ముందు తెలంగాణభవన్‌లో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ గతంలో రేవంత్‌రెడ్డి ఎన్నోసార్లు సవాల్ విసిరి తప్పించుకుపోయిన విషయాన్ని గుర్తుచేశారు. ‘కొడంగల్‌లో ఒడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ చేసి ఆరు నెలలు తిరక్కముందే మల్కాజిగిరిలో ఎంపీగా పోటీ చేస్తివి.. హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంట అంటివి.. అందుకే నువ్వు మాట మీద నిలబడే మనిషిని కాదు కాబట్టే నీ కొరిక మేరకు కొడంగల్లోనైనా, కొండారెడ్డిపల్లిలోనైనా, నీ జూబ్లీహిల్స్ ప్యాలెస్లోనైనా..అంబేద్కర్ చౌరస్తాలోనైనా, చివరికి అసెంబ్లీలోనైనా చర్చకు సిద్ధమని చెప్పినం.. కాదుపోదూ అంటే తటస్థ వేదిక అయిన ప్రెస్‌క్లబ్‌కు మేమే వస్తమని చెప్పినం. రేవంత్ సవాల్‌ను స్వీకరించి మొన్ననే ప్రెస్‌క్లబ్‌ను బుక్ చేశామని తెలిపారు. తాము ప్రజల సమక్షంలో తటస్థ వేదికపై చర్చిద్దామంటున్నామని పునరుద్ఘాటించారు. ఒకవేళ అసెంబ్లీలో చర్చ చేసేందుకైనా సిద్ధమేనని చెప్పారు.
కానీ, గతంలో ఫార్మాసిటీ, ఫార్మర్స్ సమస్యలు లెవనెత్తిన సందర్భాల్లో అధికారపక్షం తమ మైక్ కట్ చేయించిందని, సీనియర్లు, మాజీ మంత్రులు మాట్లాడినా ఆరేడుసార్లు మైక్ కట్ చేసిన ఉదంతాలు ఉన్నాయని గుర్తుచేశారు. అసెంబ్లీలో చర్చించేందుకు ప్రభుత్వం ఏనాడూ సుముఖంగా లేదని చెప్పారు. గతంలో ఫార్ములా-ఈపై, ఫార్మర్స్ సమస్యలపై, ఫార్మాసిటీపై చర్చకు తాము ప్రతిపాదిస్తే తప్పించుకొన్నదని దుయ్యబట్టారు. అందుకే స్పీకర్‌ను ఇబ్బంది పెట్టవద్దన్న ఉద్దేశంతో ప్రెస్‌క్లబ్‌లో చర్చించేందుకు సిద్ధమయ్యామని చెప్పారు. అయితే ఇప్పుడు అసెంబ్లీలో చర్చపెట్టి మైక్ కట్ చేయకుండా మాట్లాడే సమయం ఇస్తే, ముఖ్యమంత్రి మాటిస్తే చర్చించేందుకు రెడీగా ఉన్నామని, తమ ప్రతిపాదనలకు ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని స్పీకర్‌కు కేసీఆర్ లేఖ రాయాలని సీఎం రేవంత్‌రెడ్డి కోరడం వింతగా ఉన్నదని ఎద్దేవా చేశారు. ‘మరి కేసీఆరే అసెంబ్లీ పెట్టాలని, కేసీఆరే ముందు చెప్పాలని, అన్ని నిర్ణయాలు ఆయననే చేయమంటే సీఎంగా రేవంత్‌రెడ్డి ఎందుకు? మీరు కదా ఆరు గ్యారెంటీలు, 420 హామీలిచ్చింది? అమలు చేయాల్సిన బాధ్యత మీపైలేదా?’ అని నిలదీశారు. ఒకవేళ పాలన చేతగాకుంటే తప్పుకొని కేసీఆర్‌కు అప్పగిస్తే అప్పుడు ఎం జేయాలో అది చేసి చూపెడతామని స్పష్టంచేశారు.
కాంగ్రెస్ అరాచక పాలనలో రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నరు. ఎరువుల కొరతతో సతమతమవుతున్నరు. ఆధార్‌కార్డు మీద ఇచ్చే ఒక్క యూరియా బస్తా కోసం చెప్పులు క్యూలో పెట్టి పడిగాపులు కాస్తున్నరు. మళ్లీ ఆనాటి రోజులు తెస్తామని చెప్పిన కాంగ్రెస్ నిజంగానే ఆ పాత దుర్దినాలను తెచ్చింది. కరెంటు కోతలు, ట్రాన్స్ఫార్మర్లు పేలిపోయే ఆనాటి రోజులు మళ్లీ వచ్చినయి. -కేటీఆర్
తెలంగాణ రైతులకు సున్నం పెడుతూ గురువు చంద్రబాబు కోసం రేవంత్ కృష్ణా, గోదావరి నీళ్లను ఏపీకి తరలిస్తున్నడు. గోదావరి నీళ్లను అక్రమంగా ఆంధ్రకు తరలించేందుకు కడుతున్న బనకచర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిండు. పోతిరెడ్డిపాడు నుంచి కృష్ణా నీళ్లను దొంగచాటుగా తీసుకెళ్తుంటే కండ్లు మూసుకొని చంద్రబాబు కోవర్టుగా వ్యవహరిస్తున్నడు. -కేటీఆర్
తెలంగాణ రైతాంగానికి, యువతకు ఎవరేం చేశారో తేల్చుకుందాం రమ్మని ముఖ్యమంత్రి చాలెంజ్ చేస్తే ఆ సవాల్‌ను స్వీకరించినం. ప్రెస్‌క్లబ్‌లో మీడియా, ప్రజల సాక్షిగా చర్చిద్దామని ఆహ్వానిస్తే ఢిల్లీకి పారిపోయిండు. ఒకవేళ ముఖ్యమంత్రి రాలేకపోతే ఆయన బాధ్యత గల ఉప ముఖ్యమంత్రో, వ్యవసాయమంత్రో.. ఇంకెవరైనా మంత్రులు వస్తారనుకుంటే వాళ్లూ రాలే. తొడలు కొట్టుడు, రంకెలు వేసుడు, సవాళ్లు విసిరి పారిపోవుడు రేవంత్‌కు అలవాటే. -కేటీఆర్