KTR | మూడు ఎరువుల బస్తాలు తీసుకుంటే రైతును జైలుకు పంపిన దుర్మార్గమైన ప్రభుత్వం రేవంత్ ప్రభుత్వమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు మండిపడ్డారు. హైదరాబాద్ నందినగర్‌లోని నివాసం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఇవాళ రాష్ట్రంలో పోలీసులు రెండే పనులు చేస్తున్నారు ఒకటి బీఆర్ఎస్ నేతలపై ఎట్ల కేసులు పెట్టాలి. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా చిన్నచిన్న పిల్లలను కూడా భయపెట్టాలనేది ఒకటి. రెండోది ఎరువుల బస్తాల వద్ద కాపలా కాస్తున్నారు. ఎక్కడ రైతులు తిరగబడి అధికారులను తంతారేమోనని ఎక్కడికక్కడ పోలీసుల పహారా పెట్టి.. ఎరువుల దుకాణాల వద్ద ఎరువులు పంచే దుస్థితిలో ప్రభుత్వం ఉన్నది. వాస్తవం ఏంటంటే.. రాష్ట్ర వ్యవసాయశాఖ గానీ, మార్కెటింగ్‌శాఖ, మార్క్‌ఫెడ్ గానీ, రవాణాశాఖ, జిల్లా యంత్రాంగం మధ్య సమన్వయ లోపం కనిపిస్తుంది’ అన్నారు.
‘నడిపించే నాయకుడి వ్యవసాయంపై లేదు. పరిపాలనపై అంతకన్నా అవగాహన లేదు కాబట్టి వచ్చిన యూరియా పంచే పరిస్థితి కనిపించడం లేదు. ఇంకా దారుణం ఏంటంటే.. ఒకవైపు చాంతాడంత లైన్లు ఏ ఊరికి పోయినా కనిపిస్తుంటే.. వేలాది మంది రైతులు వర్షాల్లో లైన్లలో తండ్లాడుతుంటే.. ముఖ్యమంత్రి మాత్రం రాష్ట్రంలో ఎరువుల కొరత లేదు.. ఇదంతా కృత్రిమ కొరత.. సోషల్ మీడియా సృష్టి అంటూ పనికిమాలిన డైలాగ్‌లతో టైంపాస్ చేస్తున్నరు తన జూబ్లీహిల్స్ ప్యాలెస్‌లో కూర్చొని. క్షేత్రస్థాయిలో కూర్చొని, ఊర్లలోని తిరిగి, రైతులను కలిస్తే తెలుస్తుంది. దమ్ముంటే సీఎం, మంత్రి అయినా రైతుల వద్దకు వెళ్తే వారి పరిస్థితి, బాధేంటో తెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని అభినందిస్తున్నాను. చాలాచోట్ల ఇవాళ క్షేత్రస్థాయిలో రైతులకు అండగా నిలుబడుతున్నారు’ అన్నారు.
‘పార్టీ పిలుపు ఇవ్వకపోయినా, ఎక్కడికక్కడ స్వచ్ఛందంగా రైతులకు అండగా నిలబడ్డ బీఆర్ఎస్ నాయకత్వాన్ని అభినందిస్తున్నాను. ఊరూరా రైతులు ఆధార్ కార్డులు, వాటిపై రాళ్లు, క్యూలైన్లలో చెప్పుపెట్టి రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గువచ్చే విధంగా మీడియా ఆ దృష్యాలను ప్రసారం చేస్తుంటే.. అవి కనిపించనట్లు.. రైతుల ఆక్రందనలు వినబడనట్లుగా సిగ్గులేని మాటలు మాట్లాడుతుంది. మొన్నటి వరకు విత్తనాల కొరత, సాగునీటి సంక్షోభం.. కరెంటు కోతలు మరొకవైపు.. కొనుగోళ్ల లేమి మరొకవైపు.. ప్రస్తుతం ఎరువుల కొరత. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వాకం వల్ల రైతుల నిర్వాకం వల్ల రైతుల్లో ఇవాళ ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకుంటున్నాయి. ప్రభుత్వాన్ని తిట్టని రైతు లేడు. ఒక ఎకరానికి ఒక ఆధార్ కార్డుపై ఒకే బస్తా అని చెబుతుంటే ఇవాళ అవస్థలు పడుతున్నరు’ అని తెలిపారు.
‘పరకాల దగ్గర నల్లబెల్లి అనే ఊరిలో ఒక రైతు తన భార్య, కొడుకుపై ఆధార్ కార్డులు కూడా తీసుకొని మూడు బస్తాలు తీసుకుంటే.. నాన్ బెయిలబుల్ కేసు పెట్టారు. వాళ్ల కుటుంబ సభ్యుల పేరుతో తీసుకుంటే జైలుకు పంపిన దుర్మార్గమైన ప్రభుత్వం రేవంత్ ప్రభుత్వం. ఇంత జరుగుతున్నా రేవంత్ పత్తా లేడు. కనీసం ఈ అంశంపై మాట్లాడడం లేదు. ఎక్కడికి వెళ్లిండో.. ఏం చేస్తున్నడో.. ఆయన ప్రభుత్వం ఏం చేస్తున్నదో చెప్పాలని కోరుతున్నా. 24గంటలు బురద రాజకీయాలు తప్ప.. రైతులకు పనికి వచ్చే ఒక్క పని చేయడం లేదనేది వాస్తవం. ఇంకో అనుమానం మాకుంది. కాంగ్రెస్ నాయకులు చానా మంది చాలాచోట్ల బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నారనే అనుమానాలున్నాయి. లేకపోతే ఇంత కొరత రాదు. పదేళ్లలో కేసీఆర్ హయాంలో రైతుల అవస్థలు లేవు. కాంగ్రెస్ రాగానే ఎందుకు ఆకస్మికంగా సమస్య వచ్చింది? బఫర్ స్టాక్‌లు పెట్టుకునే విధానం, నైపుణ్యం అధికారులకు ఉంది’ అని పేర్కొన్నారు.
Read Also :
Nalgonda : ప్రముఖ విద్యావేత్త కొండకింది చిన వెంకట్‌రెడ్డి కన్నుమూత