KTR | పోలీసులను పెట్టి ఎరువులు పంచే దుస్థితి ఎన్నడూ లేదని.. మరి ఈ పరిస్థితి రాష్ట్రంలో ఎందుకు వచ్చింది? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో రాష్ట్రంలోని రైతన్నలు ఆలోచించాలని కోరుతున్నానన్నారు. హైదరాబాద్ నందినగర్‌లోని నివాసం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘గత రెండునెలలుగా తెలంగాణలో ఊరు, ఏ పల్లె చూసినా తండోపతండాలుగా రైతులు, వారి కుటుంబ సభ్యులు ఎక్కడికక్కడ అవస్థలు పడుతున్న పరిస్థితి, దయనీయమైన పరిస్థితి దేశం, రాష్ట్రం మొత్తం చూస్తున్నది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిల్ల రాజకీయాలు చేయడం తెలుసు. బురదజల్లడం తెలుసు. కానీ, పనికివచ్చే ఒక్క పని చేతకాదని స్పష్టంగా తేలిపోయింది. చాతకాని కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన వల్ల రైతులు ఒక బస్తా ఎరువు దొరక్క ఆగమాగమవుతున్న పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తున్నది. చివరికి పంట అమ్ముకోవాలి.. పంట కొనాలే ప్రభుత్వం అంటే రైతులు అధికారుల కాళ్లపై పడే దుస్థితి ఉంది. నేడు ఎరువుల బస్తాల కోసం కూడా ఎక్కడికక్కడ రైతులు కాళ్లావేళ్లపడి అధికారులను బతిమిలాడుకునే పరిస్థితి కనిపిస్తున్నది. అధికారుల కాళ్లు పట్టుకునే దౌర్భాగ్యమైన పరిస్థితి కనిపిస్తున్నది’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
‘ఏ చరిత్ర చూసిన ఏం ఉన్నది గర్వకారణం అన్నట్లుగా.. కాంగ్రెస్ చరిత్ర ఎన్నడూ కూడా రైతుల విషయంలో సానుకూలమైన చరిత్ర కాదు. రైతులకు మేలు చేసే చరిత్ర కాదు. ఇవాళ మళ్లీ ఒకసారి ఆనాటి రోజులు తెస్తామని హామీ ఇచ్చిందో కాంగ్రెస్ పార్టీ.. దానికి అనుగుణంగానే.. ఆనాడు అర్ధరాత్రి బాయికాడ పండుకునే దుస్థితి ఉండెనో.. ఇవాళ మరోసారి చివరి మహిళా రైతు ఎరువుల దుకాణం వద్ద పడుకునే దుస్థితి కూడా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పతనం మూలాన కనిపిస్తున్నది. కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వంలో ఆరు నెలల ముందే బఫర్ స్టాక్ తెప్పించి ఎక్కడికక్కడ గోదాములను సీజన్ మొదలుకాక ముందే నింపి పెట్టేది. భారత్‌లో ఎక్కడ యూరియా దొరికినా అక్కడి నుంచి తెప్పించి.. రైతుల కడుపులో చల్లకదలకుండా కూర్చునే విధంగా.. ఇంటికే ఎరువుల బస్తాలు పంపిన పరిస్థితిని కేసీఆర్ పాలనలో చూశాం. 4లక్షల మెట్రిక్ టన్నుల గోదాముల సామర్థ్యం ఉన్నది మేం బాధ్యతలు చేపట్టిననాడు. రైతులకు మేలు జరగాలని 24లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యానికి సంవత్సరం, సంవత్సరన్నర లోపే తీసుకెళ్లిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిది’ అని గుర్తు చేశారు.
‘గోదాములు ఉన్నా, రైతువేదికలున్నా, కష్టపడే రైతులు ఉన్నా.. కేసీఆర్ కష్టపడి చేయించిన మిషన్ కాకతీయ చెరువులు, అద్భుతంగా కట్టిన కాళేశ్వరంతో సహా ప్రాజెక్టులు కళకళలాడుతున్నా.. కానీ, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం వానాకాలం సీజన్ మొదలైనా దున్నపోతుపై వానపడ్డట్లుగా ఉన్నది. కనీసం ప్లానింగ్ లేదు. సమీక్ష లేదు, సన్నద్ధ లేదు. ఎక్కడ ఆలోచన, ప్రణాళిక లేదు. ప్రణాళిక, అనుభవ రాహిత్యం, పరిపాలన చేతగానితనం, ఇతర అంశాలపై దృష్టిపెట్టడం వల్ల ఇవాళ రాష్ట్రంలో రైతులు అవస్థలు పడుతున్నరు. ఒక్కటంటే ఒక్కరోజు ముఖ్యమంత్రి వ్యవసాయంపై, ఎరువులపై సమీక్ష చేయలేదు. కేంద్ర ప్రభుత్వాన్ని కలిసి విజ్ఞప్తి చేసింది లేదు. పేరుకు రాహుల్ గాంధీనికి కలిసేందుకు వెళ్లి.. ఏదో కాగితం ఇచ్చి రావడం కాదు. సీనియస్‌గా, సిన్సియర్‌గా ఇక్కడ ఏ పరిస్థితి ఉంది? ఎట్లా వ్యవసాయ విస్తరణ కేసీఆర్ హయాంలో జరిగింది? దానికి అనుగుణంగా ఎంత ఎరువు కావాలనే ఇండెంట్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్లలేదు. ముందస్తు ప్రణాళిక తయారు చేయలేదు. దాని ఫలితంగానే రాష్ట్రంలో ఎరువుల కొరత కనిపిస్తుంది. కేసీఆర్ ఉన్న పదేళ్లు ఎన్నడూ లైన్లు లేవు. ఎరువుల కోసం కొట్లాడుకునే పరిస్థితి లేదు. పోలీసులను పెట్టి ఎరువులు పంచే దుస్థితి ఎన్నడూ లేదు. మరి ఈ పరిస్థితి రాష్ట్రంలో ఎందుకు వచ్చింది? కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో రాష్ట్రంలోని రైతన్నలు ఆలోచించాలి’ అని కేటీఆర్ కోరారు.