మెదక్ ఆర్అండ్బీ వర్క్ : రూ.116 కోట్లు
షాద్‌నగర్-పరిగి రోడ్డు : రూ.135 కోట్లు
మోతే-సూర్యాపేట లిఫ్ట్ : రూ.1910కోట్లు
రాజీవ్‌గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ (గణపవరం (కోదాడ)) : రూ.320కోట్లు
మెటర్నరీ సైన్స్ ఇంటర్నేషనల్ కాలేజీ, కొడంగల్ : రూ.145 కోట్లు
హెచ్ఎండబ్ల్యూఎస్ మిషన్ భగీరథకు : రూ.165 కోట్లు
అమృత్, జల్‌జీవన్, యంగ్ ఇండియా స్కూల్స్ కలిపి మొత్తం రూ.6000కోట్లు
తాను అప్పనంగా కాంట్రాక్టులు కట్టబెట్టిన తన బినామీ కంపెనీకి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చిన అంశాన్ని దాచి ఉంచడానికే సిట్ పేరుతో దావోస్ నుంచి రేవంత్‌రెడ్డి డ్రామాలాడారు. రేవంత్‌రెడ్డి బినామీ కంపెనీ కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాకు సుప్రీంకోర్టు నోటీసులిచ్చిన నాటి నుంచి వరుసగా మాజీ మంత్రి హరీశ్‌రావు, నాకు, మాజీ ఎంపీ సంతోష్‌కుమార్, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు కూడా సిట్ నోటీసులు ఇచ్చి విచారణ పేరుతో డైవర్ట్ పాలిటిక్స్ చేశారు.
రేవంత్‌రెడ్డి చీఫ్ మినిస్టర్ కాదు.. బినామీ చీఫ్ మినిస్టర్ అని అందరికీ తెలుసు. ఇప్పుడాయన బినామీ చీఫ్ మినిస్టరే కాదు.. బినామీ మాస్టర్ అని చూపించే బాగోతమిది. రేవంత్ వాడుతున్న టీఎస్ ఓ7ఎఫ్ ఎఫ్ 0009 నంబర్ ల్యాండ్ క్రూజర్ బ్లాక్ కారు కూడా కేఎల్ఎస్ఆర్ కంపెనీ పేరు మీదే ఉన్నది. ఇది ఆయన ముఖ్యమంత్రి కాకముందు తిరిగిన కారు. రెండున్నర కోట్లు విలువ చేసే లాండ్ క్రూజర్‌ను కేఎల్ఎస్ఆర్ కంపెనీ ఈయనకెందుకు కొనిచ్చింది? రేవంత్‌రెడ్డికి చెందిన భూపాల్ ఇన్ఫ్రా కంపెనీలోకి కేఎల్ఎస్ఆర్ నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వస్తున్నయి.
-కేటీఆర్
హైదరాబాద్, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన బినామీ కంపెనీకి వేల కోట్ల ప్రజాధనం దోచిపెడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. గతంలోనే దివాలా తీసిన కేఎల్ఎస్ఆర్ కంపెనీకి రూ.6,000 కోట్ల విలువైన కాంట్రాక్టులు కట్టబెట్టారని మండిపడ్డారు. సిబ్బందికి వేతనాలు చెల్లించడానికి కూడా డబ్బుల్లేక దివాలా తీసిన ఈ కంపెనీకి సుప్రీంకోర్టు గత నెల 23న నోటీసులు ఇచ్చిందని బయటపెట్టారు. ఆ సంస్థ వ్యవహారాలపై విచారణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వానికి, సీబీఐ, ఈడీ, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆర్గనైజేషన్ ఏజెన్సీలు, కేంద్రానికి కూడా సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చిందని సంచలన విషయాలను వెల్లడించారు. తన బినామీ కంపెనీకి సుప్రీంకోర్టు నోటీసులిచ్చిన అంశాన్ని దాచి ఉంచేందుకే సిట్ నోటీసుల పేరుతో దావోస్ నుంచి రేవంత్‌రెడ్డి డ్రామాలాడారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రేవంత్‌రెడ్డి బినామీ కంపెనీ అయిన కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చిన నాటి నుంచి వరుసగా మాజీ మంత్రి హరీశ్, తనకు, మాజీ ఎంపీ సంతోష్‌కుమార్, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు కూడా సిట్ నోటీసులు పంపి విచారణ పేరుతో డైవర్ట్ పాలిటిక్స్ చేశారని విమర్శించారు. వెంటనే కేఎల్ఎస్ఆర్ కంపెనీపై విచారణ ప్రారంభించాలని, అప్పటిదాకా ఆ సంస్థ కార్యకలాపాలను నిలిపివేయాలని, దాన్ని బ్లాక్ లిస్ట్ చేసి ఇప్పటివరకు ఇచ్చిన కాంట్రాక్టులన్నింటినీ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణభవన్‌లో బుధవారం ఎమ్మెల్యే కేపీ వివేకానందగౌడ్, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే నలమోతు భాస్కర్‌రావు, పార్టీ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్‌తో కలిసి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
‘రేవంత్‌రెడ్డి చీఫ్ మినిస్టర్ కాదు.. ఆయన బినామీ చీఫ్ మినిస్టర్’ అని కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ‘వారం పదిరోజులుగా వరుసగా మొదట హరీశ్‌రావును తర్వాత నన్ను, అనంతరం రాజ్యసభ మాజీ సభ్యుడు సంతోష్ రావు, అటు తర్వాత మా అధినాయకుడు కేసీఆర్‌ను విచారణకు పిలిపిస్తే మాకు అనుమానం వచ్చింది. ఈ డైవర్షన్ గేమ్ సీరియస్‌గానే అడుతున్నరు.. ఇంతకీ ఎందుకు ఆడుతున్నరని, ఇంత హడావుడిగా ఎందుకు చేస్తున్నరని మాకు డౌట్ వచ్చింది. మేం కూడా తవ్వడం మొదలుపెట్టాం. ఎందుకోసం ఈ కవర్ డ్రైవ్‌లు, ఎక్స్ట్రా కవర్ డ్రైవ్‌లు అని జాగ్రత్తగా ఆలోచిస్తే మాకు ముఖ్యమంత్రి పెద్ద బినామీ బాగోతం ఒకటి బయటపడ్డది. కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రా కంపెనీ అవినీతి బాగోతం వెలుగులోకి వచ్చింది’ అని వివరించారు. కేఎల్ఎస్ఆర్ కంపెనీ సీఎం రేవంత్‌రెడ్డి బినామీ అని విమర్శించారు. ఆ బాగోతం నుంచి డైవర్ట్ చేసేందుకే తమకు నోటీసులు ఇచ్చారని తెలిపారు. రేవంత్ వాడుతున్న టీఎస్ ఓ7ఎఫ్ ఎఫ్ 0009 నంబర్ ల్యాండ్ క్రూజర్ బ్లాక్ కారు ఈ కంపెనీ పేరు మీదే ఉన్నదని చెప్పారు. ఇది రేవంత్ ముఖ్యమంత్రి కాకముందు తిరిగిన కారు అని, రెండున్నర కోట్లు విలువ చేసే లాండ్ క్రూజర్‌ను కేఎల్ఎస్ఆర్ కంపెనీ రేవంత్‌రెడ్డికి ఎందుకు కొనిచ్చిందని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డికి చెందిన భూపాల్ ఇన్ఫ్రా కంపెనీలోకి కేఎల్ఆస్ఆర్ నుంచి డబ్బులు పెద్ద ఎత్తున వస్తున్నాయని, రియల్ ఎస్టేట్ డీల్ చేస్తున్నట్టు ఐటీవాళ్లు చెప్పారని వివరించారు.
రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు బినామీ కంపెనీల మాస్టర్‌గా పనిచేశారని కేటీఆర్ విమర్శించారు. ‘2018లోనే ఈ కంపెనీపై, రేవంత్‌రెడ్డి బంధువులపై ఐటీ రైడ్స్ జరిగాయి. సాయి మౌర్య ఎస్టేట్స్ అనే కంపెనీ, కేఎల్ఎస్ఆర్ కంపెనీ మధ్య పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారిన విషయాన్ని, ట్యాక్స్ ఎగవేతలను రైడ్స్ సందర్భంగా గుర్తించారు. భూపాల్ ఇన్ఫ్రా, సాయి మౌర్య కంపెనీల డబ్బులు ఖాతాల్లోకి వచ్చాయి. ఈ రెండు కంపెనీలు రేవంత్‌రెడ్డి బంధువుల కంపెనీలే అన్న విషయాన్ని గుర్తించారు. కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రా అనేది బినామీ కంపెనీ అని అందరికీ తెలుసు. 2023లోనే ఈ కంపెనీ దివాలా తీసింది. అలాంటి కంపెనీకి రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి కాగానే అనేక ప్రాజెక్టులు కట్టబెట్టారు. దివాలా తీసిన కంపెనీకి రూ.6 వేల కోట్ల కాంట్రాక్ట్ ఇవ్వడం ఏంటి?’ అని ప్రశ్నించారు. ఈ కంపెనీకి కాంట్రాక్టులు ఎందుకు ఇచ్చారని సుప్రీంకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులిచ్చిందని గుర్తుచేశారు. ఈ కంపెనీ అవకతవకలపై దర్యాప్తు సంస్థలతో విచారణ చేయించాలని, జనవరి 23న సుప్రీంకోర్టు ఆదేశించిందని తెలిపారు.

2023 జూలైలో కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రా కంపెనీకి, ఏఎస్ఎంఈటీ అనే కంపెనీ మధ్య గొడవ జరిగిందని, వారిద్దరూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ వద్దకు వెళ్లారని, ఆ కేసు నడుస్తున్నదని కేటీఆర్ తెలిపారు. ఆ తర్వాత ఈ కేఎల్ఎస్ఆర్ కంపెనీ అకడ కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ పిటిషన్ వేసి తాము దివాలా తీసిన విషయాన్ని స్పష్టంగా చెప్పిందని, దాంతో ఈ కంపెనీలో ఆర్థిక లావాదేవీలను ఎన్సీఎల్టీ నిషేధించిందని గుర్తుచేశారు. అయితే ఎన్సీఎల్టీలో జరుగుతున్న ఈ కేసు విషయంలో జస్టిస్ శరత్‌కుమార్‌పై ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నిస్తే, ఆయన ఆ విషయాన్ని బయటపెట్టి ఆ కేసు నుంచి తప్పుకొన్నారని తెలిపారు. ఎన్సీఎల్టీలోనూ జడ్జిల ద్వారా కంపెనీకి సానుకూలంగా తీర్పు వచ్చేలా నిలబడిన వ్యక్తి ముమ్మాటికీ రేవంత్‌రెడ్డి అని చెప్పారు. కేఎల్ఎస్ఆర్ కంపెనీలో రేవంత్‌రెడ్డి అనేక పెట్టుబడులు పెట్టారని, అందుకే రేవంత్‌రెడ్డి బావమరిదికి సంబంధించిన సాయి మౌర్య అనే కంపెనీతో లావాదేవీలు నడిపిందని చెప్పారు. కేఎల్ఎస్ఆర్ అనే కం పెనీ ద్వారా సాయి మౌర్య అనే కంపెనీలోకి డబ్బులు పంపి దాన్నుంచి భారీగా భూముల కొనుగోలు చేపట్టిందని పేర్కొన్నారు. 2018లోనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్లు కూడా ఈ కంపెనీ మీద దాడి చేసి అనేక ఆధారాలు బయటపెట్టారని గుర్తుచేశారు.
‘కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రా కంపెనీ అక్రమ కాంట్రాక్టుల వ్యవహారంపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సత్వరమే స్పందించాలి. రేవంత్‌ను బీజేపీ కాపాడుతున్నది నిజంకాకుంటే సీబీఐతో విచారణ జరిపించేలా చర్యలు తీసుకోవాలి’ అని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ దిశగా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. మొత్తం వ్యవహారం కేవలం అవకతవకలు, ఆర్థిక కుం భకోణం, క్రిమినల్ కుట్ర, అధికార దుర్వినియోగం మాత్రమే కాదని, మనీ లాండరింగ్ జరిగిందని వివరించారు. ఇందులో సీఎం రేవంత్‌రెడ్డి పాత్ర ఉన్నదని విమర్శించారు. సింగరేణి టెండర్ల కుంభకోణం విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలు లేవని తప్పించుకున్న కిషన్‌రెడ్డి..ఇప్పుడు సుప్రీంకోర్టే ఆదేశించినందున కేఎల్ఆర్ఎస్ స్కామ్, ముఖ్యమంత్రి పాత్రపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. కేంద్రం విచారణకు ఆదేశించేలా కిషన్‌రెడ్డి చొరవచూపాలని లేదంటే రెండు పార్టీలు కుమ్మక్కయినట్టు ప్రజలు భావిస్తారని తేల్చిచెప్పారు.
అన్ని ఆధారాలు ఉన్నా ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేందుకు స్పీకర్ వెనుకడుగు వేయడం దురదృష్టకరమని కేటీఆర్ వాపోయారు. ముఖ్యమంత్రి రేవంత్ ఒత్తిడితోనే ఆయన కండ్లకు గంతలు కట్టుకున్న గాంధారిలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఏదేమైనా ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడేదాకా బీఆర్ఎస్ న్యాయ పోరాటం చేస్తుందని ప్రకటించారు. ఈ అంశంలో తప్పకుండా విజయం సాధిస్తామనే నమ్మకం ఉన్నదని చెప్పారు.
కాంట్రాక్టుల వ్యవహారంపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సత్వరమే స్పందించాలి. రేవంత్‌ను బీజేపీ కాపాడుతున్నది నిజం కాకుంటే సీబీఐతో విచారణ జరిపించేలా చర్యలు తీసుకోవాలి. సింగరేణి టెండర్ల కుంభకోణం విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలు లేవని తప్పించుకున్న కిషన్‌రెడ్డి..ఇప్పుడు సుప్రీంకోర్టే ఆదేశించినందున కేఎల్ఎస్ఆర్ స్కామ్, ముఖ్యమంత్రి పాత్రపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేయించాలి.
కేఎల్ఎస్ఆర్ కంపెనీకి, రేవంత్‌రెడ్డికి ఉన్న ఆర్థిక లావాదేవీలు, అనుబంధం, సీఎం అయ్యాక కంపెనీకి చేసిన అనుచిత లబ్ధి, కట్టబెట్టిన వేలకోట్ల రూపాయల కాంట్రాక్టుల ఆధారాలు, ఫొటోలు, ఆంగ్ల మాధ్యమాల్లో వచ్చిన న్యూస్ క్లిప్పింగ్‌లను ఈ సందర్భంగా మీడియాకు కేటీఆర్ చూపించారు. కేఎల్ఎస్ఆర్ కంపెనీ పేరిట కొనుగోలు చేసిన ల్యాండ్ క్రూజర్ బ్లాక్ కారును సీఎం అయ్యాక కూడా రేవంత్‌రెడ్డి వాడుకున్నారని తెలిపారు. అందుకు సంబంధించిన ఫొటోను మీడియాకు చూపించారు. ఈ కేఎల్ఎస్ఆర్ కంపెనీపై 2018లోనే ఈడీ, ఇన్కమ్ టాక్స్ దాడులు చేసిందని, అప్పుడే పీసీసీ ప్రెసిడెంట్‌గా ఉన్న రేవంత్‌రెడ్డికి ఈ కంపెనీకి ఉన్న సంబంధాల గురించి మీడియా బయటపెట్టిందని గుర్తుచేశారు. పూర్తిగా దివాలా తీసి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో దివాలా ప్రక్రియ కేసు నడుస్తున్న క్రమంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్‌రెడ్డి.. ఆ కంపెనీకి అడ్డగోలుగా రూ.6,000 కోట్ల కాంట్రాక్టులు కట్టబెట్టారని వివరించారు. కాంట్రాక్టులకు సంబంధించిన పనుల జాబితాను చదివి వినిపించారు.
ఇంత దుర్మార్గ, నీచమైన చరిత్ర ఉన్న కేఎల్ఎస్ఆర్ కంపెనీకి రేవంత్‌రెడ్డి పాలనలో రూ.6,000 కోట్ల ప్రాజెక్టులు వచ్చాయని కేటీఆర్ విమర్శించారు. అమృత్ సీమ్, జల్ జీవన్ మిషన్, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ సూల్స్, తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులు, రహదారుల పనులన్నీ కలిపి సుమారు రూ.6,000 కోట్ల కాంట్రాక్ట్‌ను ఈ కంపెనీ ఎలా పొందిందో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోని పురపాలక శాఖతోపాటు సీఎం నియోజకవర్గంలో ఈ కంపెనీ భారీగా పనులు దకించుకున్నదని తెలిపారు. 2023 నుంచే దివాలా తీసిన కంపెనీకి 2024-26 సంవత్సరాల్లో ఏ విధంగా తెలంగాణ ప్రభుత్వం కాంట్రాక్టులు ఇచ్చిందో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కేఎల్ఎస్ఆర్ కంపెనీ తమ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి రూ.15 లక్షలు కూడా లేవని బ్యాంకుల నుంచి అప్పు తీసుకున్నదని, అంతటి ఆర్థిక వనరుల్లేని కంపెనీకి వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులకు సంబంధించిన వందల కోట్ల బ్యాంక్ గ్యారెంటీలను ఎందుకు, ఎలా సబ్మిట్ చేస్తుందనే విషయాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించిందని గుర్తుచేశారు. జడ్జిని ప్రభావితం చేసే అంశంతో పాటు ఈ కంపెనీలోకి వచ్చిన వందల కోట్ల రూపాయల నిధుల విషయంపై విచారణ జరపాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించిందని చెప్పారు. సుప్రీంకోర్టు నిర్దేశించిన మేరకు విచారణ పూర్తయ్యేదాకా కేఎల్ఎస్ఆర్ కంపెనీకి ఇచ్చిన కాంట్రాక్టులను రద్దు చేసి ప్రజాధనాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం కంపెనీ ద్వారా కొనసాగుతున్న పనులను నిలిపివేయాలని, బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలని, వాస్తవాలు వెల్లడయ్యేవరకు కొత్త కాంట్రాక్టుల్లో పాల్గొనకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టంచేశారు.