పెద్దపల్లి, నవంబర్ 18(నమస్తే తెలంగాణ)/పెద్దపల్లి : ఆరుగాలం శ్రమించి పండించిన పత్తిని ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేయాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు. పెద్దపల్లిలో చేపట్టిన ధర్నాలో ఆయన మాట్లాడారు. మద్దతు ధర చెల్లించకుండా.. కొనుగోళ్లు చేయకుండా ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నదని మండిపడ్డారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఏనాడూ రైతులకు నష్టం చేయలేదన్నారు. కానీ, ఇప్పుడు పత్తిని అమ్ముకునేందుకు రైతు ఇబ్బందులు పడుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. పత్తిని విదేశాల నుంచి దిగుమతి చేసుకొని కార్పొరేట్ సంస్థలకు లాభం చేకూర్చాలనే ఉద్దేశంతో కేంద్రం లేనిపోని నిబంధనలు తెస్తున్నదని మండిపడ్డారు. రాష్ట్రంలో 28 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేస్తే ఇప్పటి వరకు కొన్నది కేవలం 1.25 లక్షల మెట్రిక్ టన్నులేనని వివరించారు. సీసీఐ తీసుకొచ్చిన ఎల్ 1, ఎల్ 2, ఎల్ 3 నిబంధనలు, ఎకరాలకు 7 క్వింటాళ్ల కొనుగోలు పరిమితి ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటే ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు, మరో ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రఘువీర్ సింగ్, నాయకులు గోపు ఐలయ్య యాదవ్, ఉప్పు రాజ్‌కుమార్, సతీశ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
పత్తి రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలా ఆదుకోవాలి. ఎలాంటి ఆంక్షలు లేకుండా పత్తి కొనుగోలు చేయాలి. మొంథా తుపాన్ ప్రభావంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. నష్టపోయిన రైతులను ప్రభుత్వం అదుకోవాలి. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు నిలిచిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైతుల గోస పట్టించుకోవాలనే సోయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేకపోవడం సిగ్గుచేటు.
ఓవైపు ప్రకృతి పగబట్టి రైతులను నిలువునా ముంచితే.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులపై కనికరం కూడా చూపకుండా పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నాయి. దేశానికి అన్నం పెట్టే అన్నదాత కంట కన్నీరు పెడుతుంటే ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో రైతులు ఇబ్బందుల పడ్డ దాఖలాలు లేవు. తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులను కడుపులో పెట్టుకొని చూసుకున్నారు.
సీసీఐ నిబంధనలతో పత్తి రైతులు ఆరిగోస పడుతుంటే బీజేపీ నుంచి గెలిచిన ఎనిమిది మంది, కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎనిమిది మంది ఎంపీలు ఏం చేస్తున్నరు? బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు వెంటనే రాజీనామా చేయాలి. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటా అని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డికి కేంద్రం ప్రవేశ పెడుతున్న నిబంధనలు కనిపించడం లేదా? నిజంగా రైతు సంక్షేమం, అభివృద్ధి కాంక్షిస్తే వెంటనే ఎలాంటి షరుతులు లేకుండా మద్దతు ధరతో పత్తిని కొనుగోలు చేయాలి.