పత్తి రైతుల కోసం బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మంగళవారం ఆందోళనలకు దిగింది. కరీంనగర్, పెద్దపల్లిలో కర్షలకులతో కలిసి ధర్నాలు చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలను ఎండగట్టింది. కొనుగోళ్లలో సీసీఐ కొర్రీలపై భగ్గుమన్నది. కొత్తగా తెచ్చిన నిబంధనలను ఎత్తివేయాలని, వెంటనే కొనుగోళ్లను చేపట్టాలని డిమాండ్ చేసింది. లేదంటే రైతుల పక్షాన పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించింది.
కరీంనగర్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ) : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంతో రైతులు అరిగోస పడుతున్నారు. ఓవైపు అధిక వర్షాలకు పత్తి దెబ్బతిని నష్టపోతే.. మరోవైపు చేతికొచ్చిన కాస్త పంటను అమ్ముకుందామని వెళ్తే కొత్త నిబంధనలతో ఆగమవుతున్నారు. ఎకరానికి 12 క్వింటాళ్లకు బదులు 7 క్వింటాళ్లు మాత్రమే కొంటామంటూ మెలిక పెట్టడంతోపాటు కపాస్ కిసాన్ యాప్‌లో నమోదు తప్పనిసరి చేయడంతో బేజారవుతున్నారు. ఇంకోవైపు సీసీఐ విధించిన నిబంధనలతో రెండు రోజులుగా జిన్నింగ్ మిల్లులు మూత పడగా, దిగుబడులను ఎక్కడ అమ్ముకోవాలో తెలియక దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ అండగా నిలుస్తున్నది. పత్తి రైతుల కోసం సర్కారును నిలదీస్తున్నది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మంగళవారం పోరు సాగించారు. పెద్దసంఖ్యలో తరలివచ్చిన కర్షకులతో కలిసి కరీంనగర్, పెద్దపల్లి జిల్లా కేంద్రాల్లో ఆందోళనలు చేశారు. కరీంనగర్లో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు పత్తి బస్తాలు మోసుకుంటూ కలెక్టరేట్‌కు చేరుకున్నారు.
సుమారు గంట పాటు అక్కడే బైఠాయించారు. కలెక్టర్ అందుబాటులో లేక పోవడంతో అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్‌కు వినతిపత్రం అందించారు. అలాగే, పెద్దపల్లి జిల్లాలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్ యార్డులో ఆందోళన వ్యక్తం చేశారు. కొప్పులతోపాటు పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్, మాజీ ఎమ్మెల్యేలు పుట్ట మధూకర్, దాసరి మనోహర్‌రెడ్డి రాజీవ్ రహదారిపై ధర్నా చేశారు. అనంతరం అక్కడి నుంచి తెలంగాణ తల్లి విగ్రహం వరకు ర్యాలీగా వచ్చి, నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయాచోట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలపై రైతులు, బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. ‘ఇదేమి రాజ్యం.. ఇదేమి రాజ్యం’ ‘దొంగల రాజ్యం.. దోపిడీ రాజ్యం’ ‘వద్దురా నాయనా.. కాంగ్రెస్ పాలన’ అంటూ నినదించారు. సీసీఐ నూతన నిబంధనలను ఎత్తివేయాలని, ఆంక్షలు లేకుండా తక్షణమే పత్తి కొనుగోలు చేయాలని, ఎకరాకు 7 క్వింటాళ్ల నిర్ణయాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం విధించిన నిబంధనలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి, వాటిని ఎత్తివేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.