ఖైరతాబాద్, నవంబర్ 18 : 42 శాతం రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం యావత్ తెలంగాణలోని బీసీలను నిలువునా మోసగించిందని తెలంగాణ బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ ఓరుగంటి వెంకటేశం గౌడ్ విమర్శించారు. రిజర్వేషన్ల పేరుతో బీసీలకు బిచ్చం వేస్తున్నట్లుగా ప్రభ్వుం భావిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఆయన మీడియా సమావేశంలో కాంగ్రెస్ వైఖరిపై నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎన్నికల ముందు టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తామని హామీ ఇచ్చారని, తీరా ఎన్నికల్లో గెలిచి పదవీ చేపట్టిన తర్వాత ఆ బిల్లు ఆమోదమయ్యే విధంగా ప్రయత్నం చేయకుండా, రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు, బీసీ సంఘాలను ప్రధానిమంత్రి వద్దకు తీసుకెళ్లి పార్లమెంట్లో బిల్లు ఆమోదించేలా చేయకుండా తాత్సారం చేస్తున్నారని విమర్శించారు.
బీసీలను మోసగించిన ముఖ్యమంత్రికి ఆ పదవీలో కొనసాగే హక్కులేదని, తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. క్యాబినెట్ సమావేశం నిర్వహించి, పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించి, కొందరు బీసీ నాయకులను పిలిపించుకొని వారు ధర్నాలు చేయకుండా ప్యాకేజీలు ముట్టజెప్పారని ఆరోపించారు. బీసీలను మోసం చేస్తే కాంగ్రెస్ నేతలనే కాదు, బీసీ నాయకులను సైతం గ్రామాల్లో తిరగనివ్వమన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌ను విస్మరించిందని, తాజాగా బీసీలను మోసగించారని, కేవలం ఆ వర్గాల ఓట్ల కోసం రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ బీసీ నినాదం ఎత్తుకున్నట్లు అర్థమవుతుందన్నారు.
జూబ్లీహిల్స్‌లో గెలవగానే బీసీలు ఓట్లు వేస్తారని అనుకోవద్దని, ఆ వర్గాలు రాజకీయంగా చైతన్యమయ్యాయని, పార్టీ పరంగా రిజర్వేషన్లు ప్రకటించి స్థానిక సంస్థల ఎన్నికలకు పోతామని చెబుతున్నారని, బీసీలకు రిజర్వేషన్లు ఏమైనా బిచ్చం వేస్తున్నారా? అని ప్రశ్నించారు. చట్టబద్దంగా రిజర్వేషన్లు ఇవ్వకుండా ఎన్నికలకు పోతే గ్రామ గ్రామాన తిరిగి కాంగ్రెస్ పార్టీకి ఒక్క బీసీ ఓటు కూడా పడకుండా చేస్తామని హెచ్చరించారు. తమిళనాడులో నాటి ముఖ్యమంత్రి జయలలిత, అప్పటి ప్రధానిని ఒప్పించి రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్పించారని గుర్తు చేశారు. అదే చిత్తశుద్ధి సీఎం రేవంత్‌రెడ్డికి ఉంటే బీసీలకు రిజర్వేషన్లు వచ్చేవన్నారు. బీసీలను మోసగిస్తున్న ప్రభుత్వంలో ఉన్న మంత్రి పొన్నం ప్రభాకర్, మహేశ్ కుమార్ గౌడ్లకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
బీసీలను మోసగిస్తే ఆ సామాజికవర్గాల నాయకులను కూడా వదలమన్నారు. కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ ఈడబ్ల్యూస్ రిజర్వేన్ల చట్టాన్ని నెల రోజుల్లో తీసుకొచ్చారని, కానీ బీసీల రిజర్వేషన్లు చట్టం చేయాలంటే ఎన్ని రోజులు పోరాటం చేయాలని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉన్న కేంద్ర మంత్రులు స్పందించాలని, లేకుంటే తెలంగాణ ఉద్యమ తరహాలో పోరాడాల్సి వస్తుందని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో బీసీల సత్తా చూపిస్తామన్నారు. బీసీ యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షుడు పాలూరి రామకృష్ణయ్య, బీసీ జేఏసి కన్వీనర్ ఎస్. సోమేశ్వర రాజు, మాల మహానాడు రాష్ట్ర నాయకులు బి. మధుసూదన్, మేదర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ పాల్గొన్నారు.

కాచిగూడ, నవంబర్ 18: కాంగ్రెస్, బీజేపీలను బొందపెడితేనే బీసీల బతుకులు మారుతాయని బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. బీసీ జేఏసీ చీఫ్ కోఅర్డినేటర్ గుజ్జ కృష్ణ ఆధ్వర్యంలో మంగళవారం కాచిగూడ అభినందన్ హోటల్లో బీసీ, కుల సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిధిగా జాజుల శ్రీనివాస్‌గౌడ్ హాజరై మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గుర్తులు ఉండవని, అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పడం మరోసారి బీసీ ప్రజలను మోసగించడమేనన్నారు. బీసీ రిజర్వేషన్ల చట్టం చేసిన తర్వాతే స్థానిక ఎన్నికలకు వెళ్లాలని, లేకుంటే రాష్ట్ర అగ్ని గుండం అవుతుందని హెచ్చరించారు. బీసీ రిజర్వేషన్ల కోసం తెలంగాణ వ్యాప్తంగా మెరుపు ధర్నాలు, నిరసన ర్యాలీలు చేపట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమంలా బీసీ ఉద్యామాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామనని చెపారు. కేంద్రంలో వచ్చే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లోనే బీసీ బిల్లును అమోదించి, 9వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కుడకచర్ల శ్రీను, గణేశ్‌చారి, విక్రంగౌడ్, జగన్నాథం, వేముల రామకృష్ణ, నందగోపాల్, శ్రీనివాస్‌గౌడ్, కవిత, నర్సింగ్‌నాయక్, ఉదయ్‌నేత, శివమ్మ, హరి తిలక్‌సింగ్, తదితరులు పాల్గొన్నారు.
ఉస్మానియా యూనివర్సిటీ, నవంబర్ 18: బీసీ రిజర్వేషన్ల సాధనకు ఈ నెల 24న బీజేపీ, కాంగ్రెస్ రాష్ట్ర కార్యాలయాల ముందు శాంతియుత ధర్నా చేయనున్నట్లు బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్ తెలిపారు. శాంతియుత (గాంధీగిరి) ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఓయూ బీసీ విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రూపొందించిన ధర్నా పోస్టర్‌ను ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో మంగళవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజారాం యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ సవరణ చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్, బీజేపీలదేనని అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
పార్టీపరంగా రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహిస్తే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని హెచ్చరించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ గెలుపు కేవలం బీసీల గెలుపుగానే చూడాలన్నారు. అది కాంగ్రెస్ గెలుపు ఏ మాత్రం కాదన్నారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకారం 42శాతం రిజర్వేషన్లు కల్పించకపోతే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బీసీలు రాజకీయంగా బొంద పెడతారని హెచ్చరించారు. సామాజిక న్యాయమంటూ దేశమంతా తిరుగుతున్న రాహుల్‌గాంధీకి బీసీల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా పార్లమెంట్లో వెంటనే ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టేలా చూడాలని డిమాండ్ చేశారు. బీసీ ప్రధానినని చెప్పుకునే నరేంద్ర మోడీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల రక్షణ కోసం రాజ్యాంగ సవరణ చేసేందుకు ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు.
ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల జేఏసీ అధ్యక్షుడు ఓరుగంటి వెంకటేశ్‌గౌడ్, అల్లంపల్లి రామకోటి, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రవంక చిన్న రామస్వామి, తెలంగాణ జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల కృష్ణ యాదవ్, ఓయూ బీసీ విద్యార్థి సంఘాల జేఏసీ చైర్మెన్ కొమ్మనబోయిన సైదులు యాదవ్, అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బండారు వీరబాబు, నాయకులు చేరాల వంశీ, నూకల మధుయాదవ్, అశ్వన్, మనోజ్‌గౌడ్, శ్రీనివాస్, సంతోష్‌యాదవ్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
పార్టీ పరంగా కాకుండా చట్టపరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతోనే సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని బీసీ విద్యార్థి జేఏసీ చైర్మన్ బొల్లెపల్లి స్వామిగౌడ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా ఓయూ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్వామిగౌడ్ మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం మొండి వైఖరితో పార్టీపరంగా రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహిస్తే బిహార్ ఎన్నికల్లో పట్టిన గతే తెలంగాణలోనూ పడుతుందని హెచ్చరించారు. సర్పంచ్ ఎన్నికలపై బీసీ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో పేర్కొన్న విధంగా 42 శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికలు నిర్వహించాలని సూచించారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అఖిలపక్షాన్ని వెంటనే ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధాని మోడీని కలవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ ప్రైవేటు బిల్లును ప్రవేశపెట్టాలని కోరారు. శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లోనే బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు రఘు, లక్ష్మణ్, విగ్నేష్, సుభాష్, ప్రవీణ్, శ్రీకాంత్, అరవింద్, శ్రవణ్, శివ, వెంకట్, రాజేశ్, జగదీశ్, రవీందర్, జానీ, ముకేష్, సురేశ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.