కరీంనగర్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ) : పత్తి రైతులను ఆదుకోవాలని, సీసీఐ నిబంధనలు ఎత్తివేయాలని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే పత్తి రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వ హించిన ధర్నాలో ఆయన పాల్గొని, మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అసమర్థత వల్లే పత్తి రైతులు నష్టపోవాల్సిన దుస్థతి ఏర్పడిందని వాపోయారు. సీసీఐ నూతన నిబంధనల కారణంగా జిన్నింగ్ మిల్లులు మూత పడడంతో రైతులు పత్తిని ఎక్కడ అమ్ముకోవాలో తెలియడం లేదన్నారు. కేంద్రం విధించిన నిబంధనలపై స్పందించి రాష్ట్ర ప్రభుత్వం వాటిని ఎత్తివేసేందుకు చర్యలు తీసుకొని, తక్షణమే పత్తి కొనుగోళ్లు జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు. ఒకే మిల్లు వద్ద నాలుగైదు రోజులు పడిగాపులు పడితేగానీ తమ పత్తిని విక్రయించుకోలేక పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పత్తి సాగు చేసేది ఎక్కువగా కౌలు రైతులేనని, గతంలో పత్తి అమ్ముకోవాలంటే పట్టాదారు ధ్రువీకరణ ఉంటే సరిపోయేదని గుర్తు చేశారు. కానీ, ఇప్పుడు పట్టాదారు వచ్చి మిల్లు వద్ద వేలి ముద్ర వేస్తేనే ఓటీపీ ఇస్తున్నారని, ఓటీపీ చెబితేనే కొనుగోలు చేయాలనే పనికిమాలిన నిబంధనతో కౌలు రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
రాష్ట్రంలో ఏ రైతు అయినా ఎకరానికి 12 నుంచి 15 క్వింటాళ్ల పత్తి దిగుబడి తీస్తారని, గతంలో ఎకరానికి 15 క్వింటాళ్లు కొనుగోలు చేసుకునేదని, ఇప్పుడు ఎకరానికి కేవలం 7 క్వింటాళ్లు మాత్రమే తీసుకుంటామని సీసీఐ కఠిన నిబంధన విధించడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారని వాపోయారు. సీసీఐ కనీస మద్దతు ధర 8,110 ఉందని, ఒక ఎకరాలో రైతు పండించిన 7 క్వింటాళ్లకు మాత్రమే కనీస మద్దతు ధర వర్తిస్తుందని, మిగతా ఏడెనిమిది క్వింటాళ్లు 6 వేలు, అంతకంటే తక్కువకే ప్రైవేట్లో అమ్ముకోవాల్సి వస్తోందన్నారు. ఈ సీలింగ్ నిబంధన తక్షణమే ఎత్తి వేయాలన్నారు. రైతులను, మిల్లులను ఇబ్బందులకు గురి చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి పత్తి కొనుగోళ్లు సజావుగా జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో నాయకులు ఏనుగు రవీందర్ రెడ్డి, పెండ్యాల శ్యాంసుందర్ రెడ్డి, పిల్లి మహేశ్, మాజీ ఎంపీపీ లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.
గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు కేంద్రం ఇదే విధంగా కొర్రీలు పెట్టింది. దొడ్డు వడ్లను కొనవద్దని ఆదేశాలు ఇచ్చింది. అప్పుడు రాష్ట్ర కేబినెట్ మొత్తం ఢిల్లీకి వెళ్లి అక్కడే 11 రోజులు ఉండి కేంద్రంతో పోరాడాం. దొడ్డు వడ్లు కొంటారా..? గేట్ వే ఆఫ్ ఇండియా ముందు పారబోయమంటారా? అని డిమాండ్ చేసినం. దీంతో కేంద్రం దిగి వచ్చింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి పనీ లేదు. రైతులను ఆదుకోవడమే పనిగా పెట్టుకుని ఢిల్లీకి వెళ్లి మాలాగే సీసీఐతో పోరాడాలి.