(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ) : ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వ పాలనలో దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. 2023 ఒక్క ఏడాదిలోనే దేశవ్యాప్తంగా 4.5 లక్షల మంది మహిళలపై అఘాయిత్యాలు జరిగాయి. మహిళలపై నేరాల్లో బీజేపీపాలిత రాష్ర్టాలు ముందంజలో ఉన్నాయి. టాప్-5 రాష్ర్టాల్లో నాలుగు రాష్ర్టాల్లో బీజేపీనే అధికారంలో ఉన్నది. ఈ మేరకు జాతీయ నేర గణాంక శాఖ (ఎన్సీఆర్బీ-2023) విడుదల చేసిన తాజా గణాంకాలను బట్టి అర్థమవుతున్నది.
2023 ఒక్క ఏడాదిలోనే దేశవ్యాప్తంగా 4,48,211 మంది మహిళలపై అఘాయిత్యాలు జరిగినట్టు ఎన్సీఆర్బీ-2023 నివేదిక స్పష్టం చేసింది. మహిళలపై నేరాల్లో 66,381 కేసులతో ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో ఉండగా, 47,101 కేసులతో మహారాష్ట్ర రెండో స్థానంలో, 45,450 కేసులతో రాజస్థాన్ మూడో స్థానంలో నిలిచింది. పై మూడు రాష్ర్టాల్లో బీజేపీనే అధికారంలో ఉండటం గమనార్హం. మహిళలపై నేరాల్లో గృహహింస, లైంగిక దాడులు, లైంగిక వేధింపులు, వరకట్న వేధింపులు, హత్యలు, కిడ్నాప్‌లు తదితరాలు ప్రధానంగా ఉన్నాయి. ఇక చిన్నారులపై జరుగుతున్న నేరాలు కూడా అంతకంతకూ పెరుగుతున్నాయి. ఒక్క ఏడాదిలోనే 1,77,335 మంది పిల్లలపై దారుణాలు జరిగాయి. 2022తో పోలిస్తే 2023లో పిల్లలపై నేరాలు 9.2 శాతం మేర పెరిగాయని నివేదిక వెల్లడించింది.