న్యూఢిల్లీ, అక్టోబర్ 10: దేశంలో సంఘటిత గోల్డ్ లోన్ (Gold Loan) మార్కెట్ వచ్చే ఏడాది మార్చికల్లా రూ.15 లక్షల కోట్లకు చేరవచ్చని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేస్తున్నది. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ)లకు పోటీగా ఇప్పుడు బ్యాంకులు గోల్డ్ లోన్లను మంజూరు చేస్తున్నాయని ఇక్రా చెప్తున్నది. ఈ క్రమంలోనే 2026 మార్చి ఆఖరునాటికి భారతీయ ఆర్గనైజ్డ్ గోల్డ్ లోన్ మార్కెట్ వాల్యూ రూ.15 లక్షల కోట్లను తాకగలదని పేర్కొన్నది. నిజానికి గత ఏడాది సెప్టెంబర్‌లో ఈ మార్కును అందుకోవాలంటే 2027 మార్చిదాకా సమయం పడుతుందని ఇక్రా అంచనా వేసింది. అయితే ఏడాదిలోనే ఆ అంచనాను ఏడాది తగ్గించడం గమనార్హం. ఇక 2027 మార్చికల్లా మార్కెట్ విలువ రూ.18 లక్షల కోట్లకు వెళ్లవచ్చని ఇప్పుడు అంటున్నది. ఈ ఏడాది మార్చి చివరినాటికి గోల్డ్ లోన్లకు సంబంధించి అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ (ఏయూఎం) రూ.11.8 లక్షల కోట్లుగా ఉన్నది.
కిలో వెండి రూ.1,71,500
వెండి ధర శుక్రవారం ఒక్కరోజే కిలో రూ.8,500 ఎగబాకింది. ఢిల్లీలో మునుపెన్నడూ లేనివిధంగా రూ.1,71,500గా నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్లలో డిమాండ్, దేశీయంగా సాధారణ కొనుగోలుదారులతోపాటు పరిశ్రమల నుంచి ఆదరణ పెరగడం.. రేట్లను ఎగదోస్తున్నాయని అఖిల భారత సరఫా అసోసియేషన్ తెలిపింది. ఈ క్రమంలోనే గత 3 రోజుల్లోనే కిలో ధర రూ.17,500 పెరిగినట్టు గుర్తుచేస్తున్నది. మరోవైపు బంగారం ధర స్వల్పంగా తగ్గింది. ఢిల్లీలో 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) 10 గ్రాములు రూ.600 దిగి రూ.1,26,000 పలికింది. ఇక హైదరాబాద్‌లో 24 క్యారెట్ తులం రూ.440 తగ్గి రూ.1,23,710గా ఉన్నది. 22 క్యారెట్ (99.5 స్వచ్ఛత) రూ.400 దిగి రూ.1,13,400గా నమోదైంది. గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ 16.61 డాలర్లు ఎగసి 3,992.80 డాలర్లుగా ఉన్నది. ఔన్స్ సిల్వర్ 50.01 డాలర్లు పలికింది.
ధరల్ని ఎగదోస్తున్న పాలిటిక్స్
ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలు.. రోజురోజుకూ బంగారం ధరల్ని పరుగులు పెట్టిస్తున్నాయి. ఇన్నాళ్లూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపే అనుకుంటే.. జపాన్, బ్రిటన్ రాజకీయ నాయకులు సనే తకైచి, నిగెల్ ఫారెగ్ తదితరులూ గోల్డ్ మార్కెట్‌ను ప్రభావితం చేస్తున్నారు. దేశ అప్పులు, వడ్డీరేట్లు, జీడీపీ అంశాల్లో వారి ఆలోచనలు.. ఆ దేశాల సెంట్రల్ బ్యాంకులనూ ఒత్తిడికి గురిచేస్తున్నాయి. ఏ దేశ ఆర్థిక వ్యవస్థల్లోనైనా ఆ దేశ సెంట్రల్ బ్యాంక్‌ల పాత్ర కీలకం అన్న విషయం తెలిసిందే. దేశ రాజకీయ, ఆర్థిక అంశాలు సెంట్రల్ బ్యాంక్‌ల నిర్ణయాలను తప్పక ప్రభావితం చేస్తాయి. వడ్డీరేట్లు సహా ఇతర ద్రవ్యపరమైన నిర్ణయాల్లో ఈ ప్రభావాన్ని ప్రస్ఫుటంగా చూడవచ్చు. ఈ క్రమంలో రాబోయే రాజకీయ మార్పులు.. వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకుల ద్రవ్యవిధానాలను, బాండ్-స్టాక్ మార్కెట్లు, కరెన్సీ విలువల్ని అస్థిరపర్చే వీలుందన్న అంచనాలతో పసిడి ధరలు దూసుకుపోతున్నాయి. జపాన్‌లో సనే తకైచీ.. ఆ దేశ రాజకీయాల్లో కీలకం కాబోతున్నారన్న వార్తలతో అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం తొలిసారి 4 వేల డాలర్లు పలకడం గమనార్హం. పరిస్థితులు ఇలాగే ఉంటే ధరలు ఇంకా పెరుగుతాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.