వరంగల్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : 42 శాతం రిజర్వేషన్లు (BC Resevations) వస్తయి.. ఈ సారి ఎక్కువ మందికి ‘స్థానిక’ పదవులు దక్కుతాయని ఆశపడి జేబులు గుల్ల చేసుకున్న ఆశావహుల్లో ఇప్పుడు లబోదిబోమంటున్నారు. బీసీ కోటాపై జీవో ఇచ్చి.. ఎన్నికల నోటిఫికేషన్ కూడా జారీ చేసిన రేవంత్ సర్కారు నిర్వాకంతో తాము నిండా మునిగామని నెత్తీనోరు బాదుకుంటున్నారు. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే ఇవ్వడంతో ముఖ్యంగా బీసీ ఆశావహులు తీవ్ర నిరాశా నిస్పృహల్లో కూరుకుపోయారు. రాజ్యాంగ సవరణ చేస్తే తప్ప 42 శాతం బీసీ రిజర్వేషన్ సాధ్యం కాదని తెలిసినా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మొదలు మంత్రులు, సమస్త కాంగ్రెస్ మంత్రాంగం చేసిన ‘అతి’తో తమ పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా తయారైందని ఆందోళన చెందుతున్నారు. బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం సర్వే మొదలైనప్పటి నుంచీ అసెంబ్లీలో బిల్లు పాస్ అయ్యేదాకా.. బిల్లును గవర్నర్ దగ్గరికి పంపి ఢిల్లీలో ధర్నా చేసేదాకా రేవంత్ సర్కారు చేసిన హడావుడి.. గవర్నర్ ఆమోదించకపోయినా ఆర్డినెన్స్ జారీ.. జీవోకు అనుగుణంగా మార్గదర్శకాల విడుదల.. రిజర్వేషన్ల ఖరారు.. గత నెల 27న అన్ని జిల్లాలు, మండలాల దాకా ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ ఇలా అన్ని స్థాయిల్లో డ్రా..
రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు అంటూ అధికార యంత్రాంగం చేసిన హడావుడితో అధికార పార్టీ నేతలు ‘ఇక రిజర్వేషన్ల పెంపు ఖాయం’ అన్నంతంగా వాతావరణాన్ని సృష్టించారు. రాజ్యాంగ సవరణ చేయకుండా రాష్ర్టాల్లో చేసిన రిజర్వేషన్ల పెంపు న్యాయస్థానాల్లో నిలవదని తెలిసినా మంత్రులు కొందరు బీసీ నేతలను ‘ఇక అయిపోయినట్టే’ అని నమ్మించారు. దీంతో బీసీ ఆశావహువులు గాల్లో తేలిపోయారు. ఈ సారి ఎన్నికల్లో ఎలాగైనా బరిలో నిలిచి గెలవాలని ఉవ్విళ్లూరారు. తమ చుట్టూ ఉన్నవాళ్లను విందులు, వినోదాల్లో తేలియాడించారు. ప్రజలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. గత నెల 27 నుంచి పోటీ చేస్తామని ఉబలాటపడ్డ బీసీ రిజర్వ్డ్ స్థానాల ఆశావహులకు ‘దసరా ధమాకా’ చేసింది. ఊళ్లల్లో పెద్దమనుషులకు దావత్లు.. కొన్ని గ్రామాల్లో అయితే యువతకు దట్టించిన ‘మందుగుండు సామాగ్రి’తో నానా హడావుడి నడిచింది. మంచిరోజుల కోసం ఆరా తీస్తూ బంధుగణానికి చెప్పుకొన్నారు. వరంగల్ జిల్లాలో పలుకుబడి ఉన్న ఓ నాయకుడు తాను 11వ తేదీన నామినేషన్ వేసేందుకు మంచి ముహూర్తం ఉన్నదని తెలిసి ప్రత్యేకంగా పటాకులకు ఆర్డరే ఇచ్చాడంటే ఈసారి రిజర్వేషన్ల పెంపుతో తనకు అవకాశం వస్తుందని ఎంతగా ఆశపడ్డాడో.. అందుకోసం ఏ స్థాయిలో ఖర్చుకు వెనుకాడలేదో స్పష్టమవుతున్నది.
ఆశావహుల సంఖ్య ఎక్కువ ఉంటే మండల, నియోజకవర్గస్థాయిలో ముఖ్యనేతలు ‘బలగం సరే..బరువు ఎంత?’ అని ఆరా తీయటంతో ‘ఎంతైనా సరే’ పోటీ చేసుడే అన్న రీతిలో తగ్గేదేలే అన్నట్టు వ్యవహరించి తీరా ఎన్నికలు జరిగేలా లేవనే నిర్ధారణకు వస్తూ ఈ మధ్యకాలంలో ఖాళీ అయిన ఖజానాను లెక్కలతో సహా వెల్లడిస్తున్నారు. ఎంపీటీసీ ఆశావహుల నుంచి రూ.2 లక్షలు.. జడ్పీటీసీ ఆశావహుల నుంచి రూ.5 లక్షలు.. మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానానికి రూ.10 లక్షల దాకా డిపాజిట్ చేయించారని, అవిపోనూ ఆయా మోతాదులో చిన్న గ్రామాలకైతే దాదాపు రూ.50 వేల నుంచి.. లక్ష దాకా దావత్ల పేరిట ఖర్చు చేయించారని చెప్పుకొంటున్నారు. అయితే, అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు ‘కోర్టు స్టే అనంతరం ఎలక్షన్లు అయ్యేటట్టు కనిపిస్తలేదు. డిపాజిట్ చేసిన మొత్తం సొమ్మును ఇవ్వండి’ అని అడిగితే ‘ఎన్నికలు ఎన్నికలే.. సీటు నీకే’ అని పేర్కొంనడంతో ‘ఇంకా నమ్మించొద్దు.. ‘ఇప్పటికి పోయిన పరువు చాలు’ అని తన ఆవేదనను వెళ్లగక్కినట్టు తెలిసింది. మిత్తికి తెచ్చి..ఇంటికాగితాలు కుదవపెట్టి తెచ్చి ‘పెద్దనాయకుడు అని పైసలిత్తి. ఆ పైసలు ఇత్తడా? ఇయ్యడా?’ అని ఆందోళన చెందుతున్నట్టు సమాచారం.
రేవంత్ సర్కార్ తెలిసే నాటకమాడిందని, రాజ్యాంగ సవరణ చేయకుండా రిజర్వేషన్ల పెంపు సాధ్యం కాదని 90 శాతం ఆశావహులు నిర్ధారణకు వచ్చినట్టు క్షేత్రస్థాయి పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. అసలు ఎన్నికలు జరుగుతాయా? ఒకవేళ జరిగితే ఇవే రిజర్వేషన్లు అమలవుతాయా? లేక పాత పద్ధతిలోనే ఎన్నికలా ?’ అని ఆశావహులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఒకవేళ కొత్త పద్ధతిలో అదే డ్రా తీసిన విధానంలో రిజర్వేషన్లు అమలు కాకుంటే ఇప్పటిదాకా పెట్టిన ఖర్చు బూడిదలో పోసిన పన్నీరవుతుందని వాపోతున్నారు. అసలు ఇదంతా తెలిసే రేవంత్ సర్కార్ తమ డబ్బును ఖర్చుచేయించడమే కాకుండా పరువు కూడా తీసిందని లబోదిబోమంటున్నారు.