హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) తొందరపాటు చర్యలతో కోట్లాది రూపాయల ప్రజాధనం వృథా అయింది. రిజర్వేషన్ల అంశం హైకోర్టు పరిధిలో ఉండగానే ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ ఇవ్వడం, జీవో ద్వారా రిజర్వేషన్లు అసాధ్యం అని తెలిసి కూడా దూకుడుగా వ్యవహరించడం చివరకు కోర్టు స్టే ఇవ్వడంతో ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. ఈ పది రోజుల వ్యవధిలో ఎన్నికల నిర్వహణ కోసం పెట్టిన ఖర్చులు అన్నీ వృథాగా మారాయి. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ప్రభుత్వ పథకాల ప్రచారాలు, వాటికి సంబంధించిన ఆనవాళ్ల తొలగింపునకు ప్రజాధనం భారీగా వెచ్చించాల్సి వచ్చింది. ఎన్నికల ప్రక్రియలో భాగమైన ఆర్వోలు, ఏఆర్వోలు, పీవోలకు ఫిబ్రవరిలో రెండుసార్లు, ఇటీవల రెండుసార్లు ట్రైనింగ్ ఇచ్చారు. జనవరిలో మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తే మరొకసారి శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది.
ఇప్పటికే ఒకో మండలంలో నామినేషన్ సెట్లు, ఓటర్ల జాబితా జిరాక్స్లకు లక్షలాది రూపాయలు ఖర్చు చేశారు. ఒకవేళ జనవరిలో ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే, అప్పుడు మళ్లీ కొత్త ఓటర్లు జాబితా ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో జిరాక్స్లకు అదనపు ఖర్చు తప్పదు. ఇలా అనేక రకాలుగా ప్రజాధనం వృథా అయిందని అధికారులే చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల నిర్వహణ కోసం రూ.325 కోట్లు విడుదల చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల సంఘం రహస్యంగా చేపట్టడంపైనా ఆరోపణలు ఉన్నాయి. ఎస్ఈసీ వెబ్సైట్లో సైతం తాజా వివరాలను వెల్లడించలేదని వివిధ పార్టీల నేతలు తెలిపారు.