హనుమకొండ, ఫిబ్రవరి 28: వేసవి ప్రారంభంలోనే రాష్ట్రంలో విద్యుత్తు వినియోగం పెరుగుతున్నది. ఎన్పీడీసీఎల్ చరిత్రలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా శనివారం గరిష్ఠ విద్యుత్తు డిమాండ్ 6,057 మెగావాట్లు నమోదైనట్టు సీఎండీ వరుణ్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. నిరుడు మార్చి 11న 5,816 మెగావాట్ల విద్యుత్తు డిమాండ్ నమోదు కాగా, ఈ ఏడాది ఫిబ్రవరిలోనే 6,057 మెగావాట్ల డిమాండ్ నమోదైనట్టు పేర్కొన్నారు. పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ముందస్తు ప్రణాళికతో సత్వర చర్యలు చేపట్టినట్టు తెలిపారు. మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తూ 35 కొత్త 33/11 కేవీ సబ్ స్టేషన్లను ప్రారంభించామని, 366 అదనపు పవర్ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. 7,600 ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యం పెంచడంతోపాటు, ఓవర్ లోడ్ ఉన్న 33 కేవీ 8 ఫీడర్లను విభజించినట్టు తెలిపారు. అదనంగా 1,200 కిలోమీటర్ల మేర 33 కేవీ ప్రత్యామ్నాయ లైన్లను ఏర్పాటు చేసి విద్యుత్తు సరఫరాను బలోపేతం చేశామని వెల్లడించారు. డిమాండ్ తగినట్టు విద్యుత్తు సరఫరా అందించడమే ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. మార్చి, ఏప్రిల్, మేలో డిమాండ్ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని, అందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.