టెహ్రాన్, ఫిబ్రవరి 28: ఇరాన్ సుప్రీం నాయకుడు అయాతొల్లా అలీ ఖమేనీ సజీవంగానే ఉన్నారా? పశ్చిమాసియాలో పూర్తి స్థాయిలో ఘర్షణలు ప్రారంభమైన నేపథ్యంలో ఖమేనీ ఆచూకీ తెలియరానప్పటికీ తనకు తెలిసినంత వరకు ఆయన జీవించే ఉన్నారని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చీ బీబీసీ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్‌పై దాడులు ప్రారంభించిన తర్వాత ఖమేనీకి సంబంధించి ఎటువంటి వివరాలు బయటకు రాలేదు.
అయితే ఖమేనీ, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజేష్కియాన్ సజీవంగా ఉన్నారని అరఘ్చీ చెప్పారు. ఇదిలా ఉంటే త్వరలో ఖమేనీ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారని అల్ ఆలమ్ టీవీ ప్రకటించింది. ఇరాన్లో అమెరికా, ఇజ్రాయెల్ జరుపుతున్న దాడుల లక్ష్యం, ట్రంప్, నెతన్యాహు చేస్తున్న ప్రసంగాలు ఇరాన్లో నాయకత్వాన్ని తుడిచిపెట్టి విప్లవానికి మార్గాన్ని సుగమం చేసే విధంగా ఉన్నాయి. నాయకత్వ మార్పే తమ లక్ష్యమని ఈ ఇద్దరు నాయకులు బహిరంగంగా చెప్పనప్పటికీ ఖమేనీ, అధ్యక్షుడి కార్యాలయాలే లక్ష్యంగా జరిగిన ఏడు క్షిపణి దాడులు వారి ఉద్దేశాన్ని స్పష్టంగా సూచిస్తున్నాయి.
ఖమేనీ ఆచూకీపై ఇప్పటివరకు అధికారికంగా ఎటువంటి ప్రకటన వెలువడలేదు. అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ప్రారంభమైన సమయంలో ఖమేనీ టెహ్రాన్‌లో లేరని, ఆయనను ఓ సురక్షిత ప్రదేశానికి తరలించారని ఇరానియన్ ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. అమెరికాతో జరిపిన అధికారిక చర్చలు విఫలమైన తర్వాత దాడులు జరుగుతాయని ఇరాన్‌కు సమాచారం ముందుగానే అందిందా? అన్న ప్రశ్నలు కూడా ఉదయిస్తున్నాయి. అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ నివాసంపై దాడి జరిగినప్పటికీ మరణాలపై అధికారికంగా ఎటువంటి ధ్రువీకరణ లేదు. అంతేగాక ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్సు కోర్ ప్రధాన కార్యాలయంపై కూడా దాడి జరిగింది.