సిటీబ్యూరో, ఆగస్ట్ 14 (నమస్తే తెలంగాణ): ఆయన దక్షిణడిస్కంలోని ఆ జోన్‌కే పెద్ద ఆఫీసర్.. తన పరిధిలో జరిగే పనులన్నీ తన కనుసైగలతోనే జరగాలి.. ఏ చిన్న ఫైల్ అయినా ఆయన కానీ, ఆయన బ్యాచ్ కానీ ఓకే అంటేనే ఆ జోన్‌లోని సర్కిళ్లలో పనులు జరగాలి. ఒకవేళ ఎవరైనా తెలియకుండా ఏదైనా పనిచేస్తే వారిపై ఏదో ఒక ఆరోపణతో మెమోలు ఇవ్వడం, ఏదో ఒక సాకుతో వారిపై వేధింపులకు పాల్పడడం ప్రస్తుతం ఆ జోన్లో ప్రతీరోజూ కొనసాగుతోంది. ఆ అధికారి తన అనుచరులుగా ఏ డివిజనల్ స్థాయి అధికారులనో పెట్టుకున్నారంటే పొరపాటే.
కొందరు ఆర్టిజన్లు, ఏఈలను తన బ్యాచ్‌గా తన పరిధిలో ఉన్న అన్ని సర్కిళ్లు, డివిజన్లు, సెక్షన్ల వరకు దందా సాగిస్తున్నారు. ముఖ్యంగా నగరశివారు ప్రాంతాలు ప్రత్యేకించి ఫోకల్ ఏరియాలన్నీ ఈయన పరిధిలోకి వస్తుండడంతో ఆయన చెప్పిందే ఫైలు.. చేసేదే సంతకంలా మారింది క్షేత్రస్థాయిలో వ్యవహారం. అత్యంత ఖరీదైన ప్రాంతంతో పాటు ఐటీ కంపెనీలు ఉండే ప్రాంతం కూడా ఈయన పరిధిలోకే వస్తుండడంతో ఏకంగా ఆ ప్రాంతంలో పనిచేస్తున్న ఒక ఆర్టిజన్‌ను పెట్టుకుని పెద్ద ఎత్తున లావాదేవీలు చేస్తున్నారంటూ ఈ అధికారిపై డిస్కంలో చర్చ జరుగుతోంది.
నగరంలోని కీలకమైన ఆ ప్రాంతంలో ఆ ఆర్టిజన్ చెప్పిందే జరుగుతుంది.. చేసిందే నడుస్తుంది. అక్కడ ఉన్న ఇతర ఇంజినీర్లు ఆర్టిజన్‌ను కాదని ఏం చేయలేని పరిస్థితి ఉంది. ఒకవేళ వాళ్ల దృష్టికి ఏదైనా అక్రమం వచ్చి ఆ ఆర్టిజన్‌ను అడిగితే చాలు.. వెంటనే పెద్దాయన నుంచి ఫోన్ వస్తుంది. అతనిని ఎందుకు అడుగుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆ ఇద్దరు వెనక్కు తగ్గుతున్నారు. గతంలో ఈ ఆర్టిజన్ చేసిన అక్రమాల కారణంగా అతనితో పాటు మరో ఇద్దరిని ట్రాన్స్ఫర్ చేసి వేరే సెక్షన్‌కు మార్చారు.
ఆ ఇద్దరు అలాగే వేరే సెక్షన్లలో కొనసాగుతున్నా ఈ మురళీధరుడు మాత్రం తనకు కావలసిన
ఉంటూ తనది ఎఫ్ఓసీలో డ్యూటీ అయినా అక్కడ ఉన్న సెక్షన్ అంతా తానే చూసుకుంటున్నారు. అతనికి ఆ జోన్‌కే పెద్దగా ఉన్న ’నాయకు’డిని ప్రసన్నం చేసుకోవడానికి అతనికి ఇష్టమైన మాంసాహారాన్ని, చేపలను ఆదివారం పూట ఆయన ఇంటికి తీసుకెళ్లి ఇస్తున్నారని ఆ జోన్లోనే చెవులు కొరుక్కుంటున్నారు. నిబంధనల ప్రకారం జరగాల్సినవి కూడా జరగకుండా ఆర్టిజన్ ఎలా చెబితే అలా జరుగుతుండడంతో అవసరమైన అధికారుల సంతకం లేకుండానే కొన్ని ఫైళ్లు పూర్తవుతున్నట్లుగా చర్చ జరుగుతోంది. ఈ ఆర్టిజన్ వ్యవహారంపై విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతున్నా తనకు మాత్రం తన బాస్ అండదండలు ఉన్నాయంటూ ఆ విచారణతో తనకేం జరిగేది లేదంటూ బహిరంగంగానే చెప్పుకుంటున్నారని తోటి సిబ్బంది అంటున్నారు.
ఫైళ్ల విషయంలో సెక్షన్ ఇంజినీర్లతో పాటు ఆ డివిజన్లో ఉన్న అధికారులకు తెలియకుండానే మొత్తం దందా జరుగుతున్నదంటూ ఈ విషయంలో మీకేం తెలియదా అని అడిగితే అసలు మాకు అలా జరిగిందని కూడా తెలియదంటూ స్థానికంగా అధికారుల మధ్య చర్చ జరుగుతోంది. ఒకవేళ ఇలా ఎందుకు చేసావని ఆ ఆర్టిజన్‌ను అడిగితే పెద్దసార్ నుంచి తమకు తిట్లు తప్పవని, అవసరమైతే మెమోలు కూడా వచ్చే అవకాశమున్నదని వారు వాపోతున్నారట.
సైబర్ వ్యవహారాలు ఎక్కువగా జరిగే ఆ ఏరియాలో ఉద్యోగం చేయాలని అందులోనూ డిస్కంకు సంబంధించిన ఉద్యోగమైతే సంపాదనకు చేతులే సరిపోవని కార్పొరేట్ కార్యాలయంలో అనుకుంటారు. ఆయితే ఈ డివిజన్లో మాత్రం ప్రత్యేకించి ఆ సెక్షన్‌తో పాటు పక్కనే ఉన్న మరో సెక్షన్లో ఆ ఆర్టిజన్ ఏం చెబితే అదే జరుగుతుంది. ఆ ఏరియాలో ఉన్న నిషేధిత భూముల్లో కట్టుకున్న ఇండ్లకు కనెక్షన్లు ఇవ్వద్దంటూ జీవోలు ఉన్నప్పటికీ సర్వీసులు ఇచ్చిన ఘనత ఈ ఆర్టిజన్దే. అలా ఎందుకిచ్చావంటే మా పెద్ద సార్ చెప్పారంటూ సమర్ధించుకున్నారు.
అక్కడ ఇచ్చిన మూడు సింగిల్ ఫేజ్ మీటర్లకు సంబంధించిన ఫైల్‌లను గతంలో పనిచేసిన ఓ కీలక ఉద్యోగి వ్యతిరేకించినప్పటికీ ఆయనకు సంబంధం లేకుండానే పై అధికారులకు తన నాయకుడితో చెప్పించి కొత్తగా సింగిల్‌ఫేస్ సర్వీస్ మీటర్లను మూడింటిని తీసుకొచ్చి ఆ ఏరియాలో పెట్టి నిషేధిత జాబితాలో ఉండగా మీటర్ రాదని, ఇంత కష్టపడ్డానంటూ లక్షల రూపాయలు తీసుకున్నట్లు తెలిసింది. ఈ మీటర్ల వ్యవహారం బయటకు పొక్కకుండా చూసుకుంటూనే ఒకవేళ ఎవరైనా అధికారి అడిగినా అవి సార్‌కు సంబంధించిన వాళ్లకు ఇవ్వాలంటూ చెప్పి తప్పించుకున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే అతను పనిచేసే ప్రాంతంలో ఎలాంటి ఎస్టిమేషన్లు లేకుండానే పనులు చేస్తున్నారని, అందులో భాగంగా ఆయన ఐదు ఎలక్ట్రిక్ పోల్లు వేశారంటూ చర్చ జరుగుతోంది.
అంతేకాకుండా చాలా పనులకు సంబంధించిన మెటీరియల్ కూడా తీసుకెళ్లి బయట అమ్ముకుంటున్నాడని కూడా సమాచారం. విద్యుత్ స్తంభాలు ఎస్టిమేషన్లు లేకుండా వేయడం, డీటీఆర్లలోనూ తన చేతివాటం, సామగ్రి విషయంలో కొన్ని ఎస్టిమేషన్లు ఎక్కువగా వేసి కేబుళ్లు, ఇతర సామగ్రిని స్టోర్స్ నుంచి డ్రా చేసి వాటిని బయట అమ్ముకోవడం.. ఇలా ఆ ఆర్టిజన్ మీద ఆరోపణలున్నాయి. సీఎండీ జితేష్ వీ పాటిల్‌కు ఈవ్యవహారమంతా స్వయంగా తెలిసినప్పటికీ ఆ జోన్ పెద్ద నాయకుడి అండ ఉండడంతో ఎవరూ అతని జోలికే రావడం లేదట.
అంతెందుకు ఆ జోన్లో ఆరోపణలు వస్తున్న ఎవరిపైన అయినా యాక్షన్లు తీసుకోవాలంటే ఆ పెద్ద మనిషిని అడిగి ఆయన ఒప్పుకుంటేనే చర్యలు ఉంటాయని తెలిసింది. ఒకవేళ ఆ నాయకుడు తన జోన్లో అలాంటిదేమీ లేదని చెప్తే వదిలేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయంటూ మింట్‌కాంపౌండ్‌లో ఈ ఆర్టిజన్‌పై చర్చ జరుగుతోంది. కొన్ని అవకతవకలకు సంబంధించి ఇటీవల విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టగా విచారణనుంచి తనవారిని కాపాడుకోవడానికి ఎక్కడా సాక్ష్యాలు దొరకకుండా ఆ జోన్ పెద్ద అధికారి ప్రయత్నించడంతో పాటు తనకున్న పలుకుబడిని కూడా వినియోగిస్తున్నారని డిస్కం మొత్తం చెప్పుకుంటున్నారు.