అశ్వారావుపేట, ఆగస్టు 14 : వ్యవసాయరంగ సేవలను డిజిటలైజేషన్ చేసే ప్రక్రియలో భాగంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఫార్మర్ రిజిస్ట్రేషన్ (ఫార్మర్ రిజిస్ట్రీ) భద్రాద్రి జిల్లాలో నత్తనడకన సాగుతోంది. ఈ ప్రక్రియను ప్రారంభించి సుమారు ఏడాదిన్నర ముగుస్తున్నా ఇంకా పూర్తి కాకపోవడం ఇందుకు ఉదాహరణగా నిలుస్తోంది. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 73 శాతం మాత్రమే పూర్తి కావడం గమనార్హం. రిజిస్ట్రీ పట్ల రైతుల్లో కనీసం ఆసక్తి కనబరచడం లేదు. ప్రభుత్వ పథకాల అమలుకు ఇది అత్యవసరమని, తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిందేనని వ్యవసాయాధికారులు స్పష్టం చేస్తున్నారు. భద్రాద్రి జిల్లావ్యాప్తంగా 1,79,217 మంది రైతులకుగాను.. 1,30,282 మంది రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఇంకా 48,935 మంది రైతులు రిజిస్ట్రీ చేయించుకోవడానికి ఆసక్తి చూపడం లేదు.
వ్యవసాయాభివృద్ధి, రైతు సంక్షేమం అమలు కోసం ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. రిజిస్ట్రీ చేయించుకున్న రైతులకు ఒక విశిష్ట సంఖ్యను కేటాయించి గుర్తింపు కార్డుగా అందించాలని నిర్ణయించింది. ఈ గుర్తింపు కార్డుకు ప్రభుత్వం 11 అంకెల యూనిక్ ఐడీని కేటాయించనుంది. కానీ, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం పట్ల రైతులు ఆసక్తి చూపడం లేదు. ఏదో నష్టం జరుగుతుందనే భావన వారిలో ఉంటోంది. అధికారులు మాత్రం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే సంక్షేమ పథకాలకు ఈ యూనిక్ ఐడీ కచ్చితంగా ఉండాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు.
జిల్లాలో ఫార్మర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్ నత్తనడకను తలపిస్తోంది. అధికారిక లెక్కల ప్రకారం కేవలం 73 శాతం మాత్రమే పూర్తయింది. ఇంకా 27 శాతం పూర్తి కావాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్, సాయిల్ హెల్త్ కార్డ్, ఫసల్ బీమా వంటి అనేక పథకాలకు అర్హత పొందాలంటే ఈ ఫార్మర్ రిజిస్ట్రీ యూనిక్ ఐడీ ఉండాలని వ్యవసాయ శాఖాధికారులు చెబుతున్నారు. అలాగే, భవిష్యత్‌లో ఎరువులతోపాటు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలకు కూడా ఫార్మర్ రిజిస్ట్రేషన్‌ను తప్పనిసరి చేసే అవకాశాలు ఉన్నాయని సూచిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ విధానంతో ప్రతి రైతుకూ 11 అంకెలతో కూడిన యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్‌ను కేటాయిస్తారు. దీంతో రైతుల భూముల వివరాలు, సర్వే నంబర్లు, నేల స్వభావం, సాగు చేస్తున్న పంటలు సహా రైతులకు సంబంధించిన సమస్త వివరాలన్నింటినీ వ్యవసాయ శాఖాధికారులు ఆన్లైన్లో పొందపరుస్తారు. ఆ వివరాలన్నీ ఆధార్ కార్డుతో అనుసంధానించబడటంతో ఒకే ఒక క్లిక్‌తో రైతు వివరాలన్నీ తెలుసుకునే అవకాశం ఉంటుంది.
పట్టాదారు పాసు పుస్తకాలు కలిగిన రైతులందరూ కచ్చితంగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాల లబ్ధిపొందాలంటే ఈ యూనిక్ ఐడీ ఉండాల్సిందే. ఇంకా మిగిలి ఉన్న రైతులందరూ స్థానిక ఏఈవోలనుగానీ, మీ సేవా కేంద్రాలనుగానీ సంప్రదించాలి. ఆధార్ కార్డుకు లింక్ అయిన ఫోన్ నంబర్‌తో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. రైతుల ప్రయోజనం కోసమే ఫార్మర్ రిజిస్ట్రీ విధానం అమలవుతోంది.
-బాబూరావు, డీఏవో, భద్రాద్రి