సిటీబ్యూరో, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) పరిధిలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల అమలు, భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకున్నది. ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ (టీడీఆర్) జారీ, వినియోగానికి సంబంధించిన నిబంధనల్లో మార్పులు చేస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ జీవో ఎంఎస్ నంబర్ 218ను శుక్రవారం జారీ చేసింది. తెలంగాణ బిల్డింగ్ రూల్స్-2012లోని రూల్ 17(సీ)కి ఈ జీవో ద్వారా సవరణలు చేశారు. కొత్త ఉత్తర్వుల ప్రకారం హెచ్ఎండీఏ చేపట్టే ప్రాజెక్టుల కోసం అవసరమైన లేదా స్వాధీనం చేసుకున్న భూములకు సంబంధించి టీడీఆర్ సర్టిఫికెట్లను ఇకపై హెచ్ఎండీఏ నేరుగా జారీ చేయనున్నది.
కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (సీయూఆర్ఈ), పెరి అర్బన్ రీజియన్ ఎకానమీ (పీయూఆర్ఈ) పరిధిలో చేపడుతున్న ప్రాజెక్టుల కోసం సేకరించిన భూములకు కూడా ఇదే నిబంధన వర్తిస్తుంది. దీంతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో రోడ్ల విస్తరణ, ఫ్లైఓవర్లు, మెట్రో, ప్రభుత్వ భవనాలు వంటి ప్రజా ప్రయోజన ప్రాజెక్టుల కోసం యజమానులు స్వచ్ఛందంగా అప్పగించిన లేదా స్వాధీనం చేసుకున్న భూములకు సైతం హెచ్ఎండీఏనే టీడీఆర్ సర్టిఫికెట్లు జారీ చేస్తుంది. హెచ్ఎండీఏ జారీ చేసే ఈ సర్టిఫికెట్లను ఆ సంస్థ పరిధిలో ఎకడైనా వినియోగించుకోవడానికి లేదా బదిలీ (డిస్పోజ్) చేసుకోవడానికి యజమానులకు వెసులుబాటు లభించనున్నది.
ఇది తెలంగాణ బిల్డింగ్ రూల్స్-2012తో పాటు ఇతర చట్టబద్ధమైన నిబంధనలకు లోబడి ఉంటుందని ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. పారదర్శకత, జవాబుదారీతనం పెంచే లక్ష్యంతో టీడీఆర్ సర్టిఫికెట్ల దరఖాస్తు, పరిశీలన, ఆమోదం, జారీ ప్రక్రియ మొత్తాన్ని పూర్తిగా ఆన్లైన్లోనే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి అనుగుణంగా బిల్డ్ నౌ వ్యవస్థలో టీడీఆర్ ప్రాసెసింగ్, జారీ, అకౌంటింగ్, వినియోగానికి సంబంధించిన సాంకేతిక మార్పులు చేపట్టాలని ఆదేశించింది. దీంతో దరఖాస్తుదారులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం తగ్గడంతోపాటు, జాప్యాలకు అడ్డుకట్ట పడనుంది. అలాగే టీడీఆర్కు సంబంధించిన వివరాలు, లెకలు, వినియోగంపై రాష్ట్రవ్యాప్తంగా ఏకరీతి విధానాన్ని అమలు చేయనున్నట్లు ప్రభుత్వం పేరొంది. హెచ్ఎండీఏ జారీ చేసే ప్రతి టీడీఆర్ సర్టిఫికెట్ లేదా సంబంధిత ఉత్తర్వుల ప్రతిని సమాచారం, రికార్డు నిమిత్తం సంబంధిత మున్సిపల్ కార్పొరేషన్, పట్టణ స్థానిక సంస్థ (యూఎల్బీ) లేదా ఎఫ్సీడీఏకు తప్పనిసరిగా అందజేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
దీనివల్ల టీడీఆర్ వినియోగంపై అన్ని స్థానిక సంస్థల వద్ద సమగ్ర సమాచారం అందుబాటులో ఉంటుంది. కాగా టీడీఆర్ బదిలీ, వినియోగానికి సంబంధించి గతంలో 2019, 2022లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసి నిబంధనల్లో మార్పులు చేసింది. 2022లో జారీ చేసిన ఉత్తర్వుల్లో ‘ఓఆర్ఆర్ పరిమితులు’ అనే పదానికి బదులుగా ‘హెచ్ఎండీఏ ప్రాంతం’ అని సవరించడం ద్వారా టీడీఆర్ వినియోగ పరిధిని విస్తరించారు. ఈ నూతన నిబంధనలు తెలంగాణ గెజిట్లో ప్రచురితమైన తేదీ నుంచి తక్షణమే అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేరొన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ భూములకు స్పష్టమైన టీడీఆర్ విధానం, హెచ్ఎండీఏ పరిధిలో ఎకడైనా టీడీఆర్ వినియోగానికి అవకాశం ఉంటుంది. ఈ సవరణ ద్వారా ప్రజా ప్రయోజన ప్రాజెక్టులకు భూసేకరణ సులభతరం కావడంతోపాటు, భూములు అప్పగించిన యజమానులకు వేగవంతమైన, పారదర్శకమైన రీతిలో టీడీఆర్ సర్టిఫికెట్లు లభిస్తాయని అధికారులు తెలిపారు.