న్యూఢిల్లీ, అక్టోబర్ 10: బ్యాంకులను ప్రైవేటీకరం (Banks Privatisation) చేయడానికి కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ఇప్పటికే పలు బ్యాంకుల్లో వాటాలను వదలించుకుంటున్న నరేంద్ర మోదీ సర్కార్..తాజాగా ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టబోతున్నది. ఇందుకోసం కీలక పోస్ట్‌ల్లో ప్రైవేట్ వ్యక్తులను నియమించడానికి తలపులను తెరిచింది. బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతోపాటు ఇతర బ్యాంకుల్లో మేనేజింగ్ డైరెక్టర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల కోసం ప్రైవేట్ వ్యక్తుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. ప్రైవేట్ రంగం, ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూట్‌ల్లో విధులు నిర్వహిస్తున్న వారు కూడా ఉన్నారు. ఇప్పటి వరకైతే ఆయా బ్యాంకుల్లో కీలక స్థానాల్లో ఉన్నవారిని ఎండీ, చైర్మన్లుగా కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈసారి ఈ నియామకాలకు బ్రేక్ వేసి..బయటి వ్యక్తులకు అప్పజెప్పాలని చూస్తున్నది. ఇందుకు సంబంధించి నియామక మార్గదర్శకాలను మార్చివేసింది కూడా.
ఈ ప్రకారం ప్రభుత్వ బ్యాంకుల్లో విధులు నిర్వహిస్తున్న ఎండీల్లో ఒకరు ప్రైవేట్ వ్యక్తిని నియమించుకునే పెసులుబాటు ఏర్పడింది. ప్రస్తుతం ఎస్బీఐతోపాటు 11 ప్రభుత్వరంగ బ్యాంకులు ఉన్నాయి. క్యాబినెట్ నియామకాల కమిటీ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ఈ కీలక పోస్ట్‌కు దరఖాస్తు చేసుకునే వ్యక్తికి కనీసంగా 21 ఏండ్లకు పైగా అనుభవం ఉండాలని, దీంట్లో 15 ఏండ్లపాటు బ్యాంకింగ్ అనుభవం, అలాగే రెండేండ్లపాటు బ్యాంక్ బోర్డు లెవల్ స్థాయిలో పనిచేయాల్సివుంటుంది. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో పనిచేస్తున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చునని సూచించింది. ఈ నూతన మార్గదర్శకాలు అమలులోకి వచ్చిన తర్వాత తొలిసారిగా ఎస్బీఐ ఎండీ పోస్ట్ కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. అలాగే 18 ఏండ్లకు పైగా అనుభవం ఉన్న వారు ఈడీ పదవి కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. వీరు ఖచ్చితంగా 12 ఏండ్లపాటు బ్యాంకింగ్, మూడేండ్లపాటు సీనియర్ స్థాయిలో విధులు నిర్వహించాల్సి ఉంటుంది.
వ్యతిరేకిస్తున్న యూనియన్లు
ప్రభుత్వ బ్యాంకుల్లో కీలక పోస్ట్‌ల్లో ప్రైవేట్ వ్యక్తులను నియమిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని బ్యాంకింగ్ యూనియన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తొమ్మిది యూనియన్ల ఆధ్వర్యంలోని యునైటెడ్ ఫోరం ఫ్ బ్యాంక్ యూనియన్(యూఎఫ్‌బీయూ) ఆందోళన బాటపట్టింది. ఈ చర్యను జాతీయ సంస్థల ప్రజా స్వభావంపై దాడిగా అభివర్ణించిన యూఎఫ్‌బీయూ..నాయకత్వాన్ని పూర్తిగా ప్రైవేట్ పరం చేయాలని ప్రభుత్వం చూస్తున్నదని వారు ఆరోపిస్తున్నారు. ఎలాంటి అమెండ్మెంట్ లేకుండానే నూతన మార్గదర్శకాలను జారీ చేశారని, దీంతో పీఎస్‌బీలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉన్నదని యూఎఫ్‌బీయూ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ నూతన మార్గదర్శకాలపై డీఎఫ్ఎస్, ఆర్బీఐ, ఎఫ్ఎస్ఐబీ, యూఎఫ్‌బీయూ, ఇండిపెండెంట్ జ్యూరిస్ట్లతో సమీక్షించాలని డిమాండ్ చేసింది