లక్నో: ప్రభుత్వ మెడికల్ కాలేజీలోని వాటర్ ట్యాంకు నీటి నుంచి దుర్వాసన రావడాన్ని గ్రహించారు. వాటర్ ట్యాంకును పరిశీలించగా అందులో కుళ్లిన మృతదేహం కనిపించింది. (dead body in water tank) అయితే గత పది రోజులుగా ఆ ట్యాంకులోని నీటిని మెడికల్ విద్యార్థులు, సిబ్బంది తాగారు. ఈ విషయం తెలిసి వారు షాక్ అయ్యారు. ఉత్తరప్రదేశ్‌లోని డియోరియా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మహామృషి దేవరహ బాబా మెడికల్ కాలేజీ బిల్డింగ్‌పై ఉన్న వాటర్ ట్యాంకు నుంచి సరఫరా అవుతున్న నీరు కొన్ని రోజులుగా దుర్వాసన రావడాన్ని గమనించారు. బిల్డింగ్ ఐదో అంతస్తులో ఉన్న సిమ్మెంట్ వాటర్ ట్యాంకును క్లీనింగ్ చేసేందుకు అక్టోబర్ 7న సిబ్బంది అక్కడకు వెళ్లారు. అందులో కుళ్లి పాడైన వ్యక్తి మృతదేహం ఉండటం చూసి వారు షాకయ్యారు.
కాగా, ఈ సమాచారం తెలిసిన పోలీసులు ఆ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి చేరుకున్నారు. కుళ్లిన గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని ఆ వాటర్ ట్యాంకు నుంచి బయటకు తీశారు. పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మరోవైపు ఆ ట్యాంకులోని నీరు మెడికల్ కాలేజీతోపాటు ప్రభుత్వ ఆసుపత్రిలోని అవుట్ పేషెంట్ విభాగం, వార్డులకు సరఫరా అయ్యింది. గత పది రోజులుగా ఆ నీటిని తాగినట్లు తెలుసుకుని వైద్య విద్యార్థులు, డాక్టర్లు, సిబ్బంది, రోగులు షాక్ అయ్యారు. మృతదేహాన్ని గుర్తించిన ఆ వాటర్ ట్యాంక్‌కు అధికారులు సీల్ వేశారు. ప్రత్యామ్నాయంగా ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు.
ఈ సంఘటన నేపథ్యంలో మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ రాజేష్ కుమార్ బర్న్వాల్ను తాత్కాలికంగా విధుల నుంచి తప్పించారు. ఎటా మెడికల్ కాలేజీలోని అనాటమీ విభాగం అధిపతి డాక్టర్ రజనీని తాత్కాలిక ప్రిన్సిపాల్‌గా నియమించారు. డియోరియా జిల్లా కలెక్టర్ దివ్య మిట్టల్ నేతృత్వంలోని కమిటీ ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నది.
Also Read:
Road Accident | తల్లి మృతదేహాన్ని తరలిస్తుండగా రోడ్డు ప్రమాదం.. కుమారుడితో సహా ముగ్గురు మృతి
Watch: ఆవును పట్టుకునేందుకు ప్రయత్నించిన మున్సిపల్ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?