హైదారాబాద్ : బీఆర్ఎస్ పాలనలో ఓ వెలుగు వెలుగిన గురుకులాలు, నేడు సమస్యల సుడిగుండంలో చిక్కుకొని కొట్టుమిట్టాడుతున్నాయి. జ్ఞానంతో విలసిల్లాల్సిన పాఠశాలలు విద్యార్థుల పాలిట మృత్యు కేంద్రాలుగా మారాయి. నాడు అన్ని రంగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరుస్తూ ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్న గురుకుల విద్యార్థులు నేడు కనీస వసతులు లేక విలవిల్లాడుతున్నారు. చదువు సంగతి దేవుడెరుగు ప్రాణాలు దక్కితే చాలు అనేంతగా గురుకులాల పరిస్థితిని కాంగ్రెస్ ప్రభుత్వం దిగజార్చింది. పాలన గాలికొదిలి పార్టీ ఫిరాంపుల్లో బిజీ ఉండటంతో ప్రభుత్వ తీరు విద్యార్థుల ప్రాణాల మీదకు తెస్తున్నది. నిన్న, మొన్నటి వరకు ఫుడ్ పాయిజన్తో ప్రాణాల మీదకు తెచ్చుకున్న విద్యార్థులు తాజాగా పాముకాటుకు గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే..
నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం మూసీ ప్రాజెక్టు దగ్గర గల జ్యోతిబా పూలే బీసీ గురుకుల పాఠశాల వసతి గృహంలో(Jyotiba Phule BC Gurukulm) ఉండే గణేష్ అనే విద్యార్థికి పాము(Snakebite) కరిచింది. విషయం తెలుసుకున్న పాఠశాల ప్రిన్సిపాల్ విద్యార్థిని హాస్పిటల్కు తరలించగా, చికిత్స పొందుతున్నాడు. కాగా, గురుకులాలను ప్రభుత్వం గాలికి వదిలేయడంతో విద్యార్థులు ఎప్పుడు ఏం జరుగుతుందేమోనని బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. మరికొంత మంది విద్యార్థులు గురుకులాలను వదిలి ఇంటి బాటపడుతున్నారు. సంవత్సర కాలంలోనే గురుకులాలను ఇరవేండ్ల వెనక్కి తీసుకెళ్లిన కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై విద్యార్థి సంఘాలు, మేధావులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.