ఆదివారం 05 జూలై 2020
Telangana - Jun 19, 2020 , 02:51:48

వచ్చేవారం అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు!

వచ్చేవారం అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు!

  • 256 సర్వీసులు నడిపేందుకు ఏపీ ప్రతిపాదనలు 
  • విజయవాడలో ఇరురాష్ర్టాల అధికారుల భేటీ 
  • 23న మరోసారి హైదరాబాద్‌లో సమావేశం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఏపీ-తెలంగాణ అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులపై ఇరు రాష్ర్టాల ఆర్టీసీ అధికారులు గురువారం విజయవాడలోని ఆర్టీసీహౌజ్‌లో భేటీ అయ్యారు. వచ్చేవారంలో అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు ప్రారంభయ్యే అవకాశముందని అధికారవర్గాలు తెలిపాయి. ఈనెల 23న హైదరాబాద్‌లో మరోమారు సమావేశం కావాలని నిర్ణయించారు. ఉమ్మడి రాష్ట్ర విభజన సమయంలో ఎలాంటి ఒప్పందాలు లేకుండానే ఇరురాష్ర్టాల మధ్య బస్సు సర్వీసులు కొనసాగాయని, ప్రస్తుతం కిలోమీటరు ప్రాతిపదికన ఒప్పందం చేసుకోవాలని తాజాగా ఏకాభిప్రాయానికి వచ్చారు. తొలిదశలో 256 బస్సులు నడుపనున్నట్టు ఏపీఎస్‌ఆర్టీసీ అధికారులు తెలిపారు. 

విజయవాడ, కర్నూలు, అనంతపురం, కడపతోపాటు పలుప్రాంతాల నుంచి బస్సులు నడుపడంపై ప్రతిపాదనలు అందించారు. దీంతో ఏపీ బస్సులు తొలిదశలో సుమారు 40 నుంచి 50వేల కిలోమీటర్లు తెలంగాణలో తిరిగే అవకాశమున్నదని తెలుస్తున్నది. టీఎస్‌ఆర్టీసీ అధికారులు ఏపీ పరిధిలో అదేస్థాయిలో బస్సు సర్వీసులు నడిపేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయనున్నారు. రెండు రాష్ర్టాల మధ్య నాలుగుదశల్లో బస్సు సర్వీసులను పూర్తిస్థాయిలో నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని, కిలోమీటర్‌ ప్రాతిపదికన నడుపాలని నిర్ణయించామని ఏపీఎస్‌ఆర్టీసీ ఈడీ(ఆపరేషన్స్‌) బ్రహ్మానందరెడ్డి తెలిపారు. 23న హైదరాబాద్‌ సమావేశంలో స్పష్టత వచ్చాక ఒప్పందాన్ని పూర్తి చేసుకొని సర్వీసులను పునరుద్ధరిస్తామని టీఎస్‌ఆర్టీసీ ఈడీ(ఆపరేషన్స్‌) యాదగిరి వెల్లడించారు. 


logo