హైదరాబాద్, జనవరి 14 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ఏం జరుగుతున్నది? కొందరు ప్రభుత్వ పెద్దలు ఆడుతున్న నాటకంలో ఎవరు బలవుతున్నారు? రాష్ట్రంలో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిన ‘సిట్’ ఏర్పాటు.. ప్రభుత్వ పెద్దలకు బ్యాక్ ఫైర్ అయ్యిందా? రెండేండ్లుగా అవమానాలు దిగమింగుతున్న సివిల్ సర్వెంట్లు పెన్‌డౌన్ చేసేందుకు సిద్ధమయ్యారా? అంటే ‘ఔను’ అనే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ముఖ్యనేత తన రాజకీయాల కోసం మీడియాను విచ్చలవిడిగా వాడుకుంటున్నారనేది బహిరంగ రహస్యం. తనకు గిట్టనివారిపై దుష్ప్రచారం చేయించడం ఆయనకు వెన్నతోపెట్టిన విద్య అని చెప్తుంటారు.
అధికారంలో లేనపుడే సొంతంగా మీడియా వ్యవస్థ ఏర్పాటు చేసుకున్న ఆయన ఇప్పుడు తనకు అడ్డు వస్తారనుకున్న వారి వ్యక్తిత్వాన్ని హననం చేసేందుకు వెనుకాడటంలేదు. ఇదే క్రమంలో ఇటీవల ఓ మీడియాలో వచ్చిన కథనం సంచలనంగా మారింది. ఇది అనేక మలుపులు తిరిగి ఇప్పుడు ఆ ముఖ్యనేతకే బ్యాక్‌ఫైర్ అయ్యిందని చెప్తున్నారు. తన రాజకీయానికి ఆ కథనాన్ని వాడుకుందామనుకుంటే కథ అడ్డం తిరిగిందని, అధికారుల పేరు చెప్పి నాయకులను లొంగేలా చేసుకుందామనుకుంటే అధికారులు కన్నెర్ర చేయడంతో తప్పని పరిస్థితుల్లో లోతైన దర్యాప్తు తప్పలేదని చెప్తున్నారు.
అసలేమైందంటే..
కాంగ్రెస్ వర్గాలు, రాజకీయ విశ్లేషకుల కథనాల మేరకు ముఖ్యనేత ఆలోచనల్లో నుంచే గతకొన్ని రోజులుగా మీడియాలో అసలు కాంగ్రెస్ నేతలపై దాడులు మొదలైనట్టు తెలుస్తున్నది. రాష్ట్రంలో ముఖ్యనేత కనుసన్నల్లో నడిచే మీడియాలోనే ఇటీవల కొందరు మంత్రులు, నేతలపై కథనాలు వస్తున్నాయి. వీటి వెనుక ఉన్నది ముఖ్యనేత అని తెలిసినా నాయకులు ఏమీ అనలేని పరిస్థితి ఉన్నది. ముఖ్యనేత అనుకూల మీడియాలో తమపై బురద జల్లితే వాటిని కడిగేసుకునేందుకు నేతలు తంటాలు పడుతున్నారు.
ఇదే క్రమంలో ఓ చానల్లో కీలక మంత్రిపై సైతం అసత్య ఆరోపణలు వచ్చినట్టు చెప్తున్నారు. నికార్సయిన అసలు కాంగ్రెస్ నేతగా ఎదిగిన ఆ మంత్రిపై ఆరోపణలు రావడంతో అందరూ షాక్‌కు గురయ్యారు. దీనిపై సదరు మంత్రి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. అది అక్కడితో ఆగలేదు. ఓ మంత్రిని బలిచేసేందుకు ఓ మహిళా అధికారి పేరును ఉపయోగించారు. అధికారులే కదా ఏమీ కాదులే అని ముఖ్యనేత వర్గం భావించినట్టున్నది. కానీ, ఇక్కడే కథ అడ్డం తిరిగింది. మహిళా అధికారి పేరును ముఖ్యనేత అనుకూల మీడియా సంస్థ ఉపయోగించడంతో సివిల్ సర్వెంట్ల వ్యవస్థ మొత్తం ఉలిక్కిపడింది. ఇదేం పద్ధతి అంటూ మహిళా ఐఏఎస్‌లు ఘాటుగా స్పందించారు.
పెన్‌డౌన్ హెచ్చరికతో దిగివచ్చిన సర్కార్?
పోలీస్ స్టేషన్లో ఐఏఎస్‌ల అసోసియేషన్ ఫిర్యాదు ఇచ్చిన తర్వాత విషయం తెలిసి ఐపీఎస్ అధికారులు, టీజీవోలు, టీఎన్జీవోలు సహా అందరూ స్పందించారు. ఇటీవల అనేక ఘటనలు జరిగాయని వారు గుర్తు చేశారు. కరీంనగర్లో మహిళా కలెక్టర్‌ను అందరి ముందు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కామన్ సెన్స్ లేదా అంటూ అరవడం, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఓ సమావేశంలో అక్కడ పనిచేసిన కలెక్టర్ గురించి నోటికి వచ్చినట్టు మాట్లాడటం, మరో మంత్రి విద్యాశాఖలోని ఓ అధికారిని తూలనాడటం వంటివి మరోసారి చర్చనీయాంశంగా మారాయి. సమావేశాలున్నాయని పిలిచి అవసరం ఉన్నా లేకపోయినా గంటల తరబడి మంత్రులు తమ పేషీల్లో అధికారులను కూర్చోబెట్టడం వంటి పరిణామాలతో తమను బంట్రోతుల్లా భావిస్తున్నారన్న భావన అధికారుల్లో ఉన్నది.
సభలు, సమావేశాల్లో తమకు కనీస గౌరవడం ఇవ్వడంలేదని, తమ వయసు, అనుభవానికి కూడా గౌరవడం ఇవ్వడంలేదని, ఏకవచనంతో సంబోధించడం విచారకరమని చెప్తున్నారు. చివరకు క్యాబినెట్ సమావేశాలపుడు కూడా తమ సబ్జెక్టు అయిన వెంటనే పంపించడం లేదని, బయట కూర్చోబెడుతున్నారని, ఇది ఒక రకమైన శిక్షలా మారిందని పలువురు అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన ఓ మంత్రి సెక్రటరీ స్థాయి అధికారికి కనీసం గౌరవడం ఇవ్వకుండా వెట్టిచాకిరి చేసే కూలీలా మాట్లాడటం.. తాము చెప్పింది చేయకపోతే బదిలీ చేస్తామంటూ కొంతమంది అధికార పార్టీ నేతలు అధికారులను బెదిరించడం వంటి వాటన్నింటిని అధికారులు గుర్తు చేసుకున్నారు.
ఇక ఇప్పుడు సీనియర్ మహిళా అధికారిపై అడ్డగోలు రాతలు రాయించారని, ఇది ముమ్మాటికీ ఏమాత్రం క్షమించరాని నేరమని మండిపడుతున్నారు. దీనిపై చర్యల కోసం పట్టుబట్టకపోతే అందరికీ అలుసైపోతామని ఐఏఎస్‌లు అన్నట్టు తెలిసింది. అయితే, ఇది ముఖ్యనేత అనుకూల మీడియాలో రావడం, ప్రభుత్వ పెద్దలు పెద్దగా స్పందించకపోవడంతో అధికారులు మూకుమ్మడిగా పెన్‌డౌన్ చేస్తామని సీఎంవో, సీఎస్కే తేల్చి చెప్పినట్టు సమాచారం. పెన్‌డౌన్ హెచ్చరికలతో ప్రభుత్వ పెద్దల్లో చలనం వచ్చిందని చెప్తున్నారు. సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తును వేగవంతం చేశారని చెప్తున్నారు. తాము ఒత్తిడి తేకపోతే ప్రభుత్వం ఇప్పటికీ స్పందించేది కాదని అన్ని కేసుల్లాగే ఇది కూడా అటకెక్కేదని అంటున్నారు.
ముఖ్యనేత గొంతులో పచ్చివెలక్కాయ
తమ పార్టీలోని నేతలను అడ్డగోలు రాతలతో తన దారిలోకి తెచ్చుకుందామనుకున్న ముఖ్యనేతకు తాజా ఘటనలు మింగుడుపడటంలేదని చెప్తున్నారు. సిట్ ఏర్పాటుపై ఐఏఎస్‌లు ఇంతగా పట్టుబడతారని ముఖ్యనేత ఊహించలేదట. ఇప్పుడు సిట్ ఏర్పాటవడం, జర్నలిస్టుల అరెస్ట్ జాతీయ స్థాయిలో చర్చనీయాంశం కావడంతో ఆయన గొంతులో పచ్చివెలక్కాయపడ్డట్టు అయ్యిందని అధికారపార్టీకే చెందిన సీనియర్ నేతలు చెప్తున్నారు. అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి అని ముఖ్యనేత సన్నిహితులు వాపోతున్నట్టు సమాచారం. వివాదాన్ని పరిష్కరించేందుకు ఇప్పటికే ఆయన తన వర్గం సివిల్ సర్వెంట్లను రంగంలోకి దించారని, వారు ప్రభుత్వంపై కోపంగా ఉన్న అధికారులను తమ దారిలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇలా చేస్తే తమకు నచ్చిన పోస్టింగ్‌లు వస్తాయనే భావనలో వారున్నట్టు చెప్తున్నారు. దీంతో ముఖ్యనేత వర్గంగా ఉన్న అధికారుల తీరుపై నికార్సయిన అధికారులు గుర్రుగా ఉన్నారని, వారి తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని సచివాలయ వర్గాలు తెలిపాయి. దీంతో ఇప్పుడు ఐఏఎస్‌లు రెండు వర్గాలుగా చీలినట్టయ్యిందని అంటున్నారు. పోస్టింగ్‌లు, పైరవీల్లో ఆరితేరినవారితో అంటకాగలేమని, పోస్టింగ్ ఇవ్వకపోతే సెంట్రల్ సర్వీసుల్లోకి వెళ్తామని కొందరు తేల్చి చెప్తున్నట్టు సమాచారం. ఇలా వేధిస్తే పనిచేయలేమని, ఇక్కడ కాకపోతే మరోచోట పనిచేసుకుంటామని కొందరు తమ సన్నిహితుల వద్ద వాపోతున్నట్టు తెలిసింది.
భగ్గుమన్న అధికారులు
ముఖ్యనేత అనుకూల మీడియాలోనే మహిళా ఐఏఎస్‌పై అడ్డగోలుగా కథనం ప్రసారం కావడంపై సివిల్ సర్వీసెస్ అధికారులు భగ్గుమన్నారు. సమావేశం పెట్టుకొని తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో ఇలా జరగడం కొత్త కాదని, ఇటీవల కాలంలో కొంత మంది నేతలు పనిగట్టుకొని అధికారులను బదనాం చేస్తున్నారని పలువురు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు అభిప్రాయపడినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దేశ సేవ కోసం వచ్చిన తమను కించపర్చడం, అడ్డగోలుగా మాటలనడం ఇటీవల పెరిగిపోయిందని వాపోయారట. ఇలాగే కొనసాగితే వ్యక్తిత్వ హననం ఇంకా పెరిగిపోతుందని, ఎలాంటి తప్పు చేయకపోయినా మాటలు పడాల్సి వస్తుందని, సంసారాలు కూలిపోయే పరిస్థితులు వస్తాయని పలువురు ఐఏఎస్‌లు తమ సీనియర్ల వద్ద ఆవేదన వ్యక్తంచేసినట్టు తెలిసింది. అసోసియేషన్ పరంగా కూడా స్పందించాలన్న డిమాండ్ రావడంతో తొలుత మీడియా ముఖంగా ఖండన ఇచ్చారు. ఆ తర్వాత ఏకంగా పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు చెప్తున్నారు.
గౌరవాన్ని దెబ్బతీస్తే ఊరుకోం
దేశ సేవ చేయాలన్న తపనతో అనేక కష్టనష్టాలకు ఓర్చి తాము సివిల్ సర్వీసెస్‌లోకి వచ్చామని ఓ సీనియర్ ఐఏఎస్ పేర్కొన్నారు. కుటుంబాన్ని కూడా వదిలిపెట్టి పనిచేస్తున్న తమపై ఆరోపణలు చేయడం, బెదిరించడం, మీడియాలో వార్తలు రాయించడం ఇటీవల పెరిగిపోయిందని, తమ రాజకీయ లబ్ధి కోసం ఐఏఎస్, ఐపీఎస్‌లను వాడుకోవడం దుర్మార్గమని ఆయన ‘నమస్తే తెలంగాణ’తో చెప్పారు.
పోస్టుల ఎరవేసి అధికారులను విభజిస్తున్నారని, ఇది ఇక్కడి పాలకుల చలువే అని ఆ అధికారి వాపోయారు. ఏ పార్టీతోనూ తమకు సంబంధంలేకపోయినా ‘మీరు ఫలానా పార్టీ సమయంలో మంచి పోస్టింగ్ పొందారు కాబట్టి ఆ పార్టీ వ్యక్తులు’ అంటూ ముద్ర వేస్తున్నారని, ఇదేం పద్ధతి అని ఆవేదన వ్యక్తంచేశారు. అధికారులకు పార్టీలు ఉండవని, ఎవరు అధికారంలో ఉన్నా తాము పనిచేస్తామని, దేశంలోని ఏ ప్రాంతంలో అయినా పనిచేస్తామని, అధికారంలో ఉన్నవారికి తమ పని నచ్చకపోతే వెళ్లేందుకు సిద్ధంగా ఉంటామని మరో ఐఏఎస్ పేర్కొన్నారు. తమ గౌరవాన్ని దెబ్బతీసేలా అధికార పార్టీలోని నేతలు కొందరు వ్యవహరిస్తున్నారని, ఇదే కొనసాగితే ఊరుకోబోమని స్పష్టం చేస్తున్నారు.