కేతేపల్లి, ఫిబ్రవరి 26 :ప్రభుత్వ నిర్లక్ష్యంతో యాదాద్రి జిల్లా భువనగిరి పట్టణంలోని మైనారిటీ గురుకుల పాఠశాల ఆవరణలోని నీటి గుంతలో పడి మరణించిన విద్యార్థి బందనాదం బాల ఆకాశ్ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హామీ ఇచ్చారు. నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం ఇనుపాముల ఆవాస గ్రామమైన రాయపురంలోని మృతుడు బాల ఆకాశ్ కుటుంబాన్ని గురువారం రాత్రి మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తదితరులతో కలిసి ఆయన పరామర్శించారు. బాలుడి కుటుంబాన్ని ఓదార్చి, వారిలో మనోధైర్యాన్ని నింపారు.
మృతుడి సోదరి పైచదువుల ఖర్చును పార్టీ భరిస్తుందని హామీ ఇచ్చారు. ఘటనకు బాధ్యులైన అధికారులను సస్పెండ్ చే యాలని పాఠశాల ప్రిన్సిపాల్‌ను ఫోన్లో డిమాండ్ చేశారు. కేటీఆర్ వెంట మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, నోముల భగత్‌కుమార్, గాదరి కిశోర్‌కుమార్, పార్టీ నాయకులు ప్రవీణ్‌కుమార్, చెరుకు సుధాకర్, నల్లగాటి ప్రసన్నరాజ్ ఉన్నారు.