హైదరాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ): అప్పుడూ, ఇప్పుడు తెలంగాణ నీటి ప్రాజెక్టులపై ఫిర్యాదుల మీద ఫిర్యాదులతో వాటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తూనే, మరోవైపు ‘అబ్బే.. అలాంటి పనులు మేం ఏం చేయడం లేద’ంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు బుకాయిస్తున్నారు. ఏపీ అసెంబ్లీలో సాగునీటిరంగం, నల్లమల సాగర్‌పై గురువారం జరిగిన చర్చ సందర్భంగా మరోసారి తెలంగాణ ప్రాజెక్టులపై తన కపట ప్రేమను ఒలకబోశారు. తాము తెలంగాణ ప్రాజెక్టులకు ఎప్పుడూ అడ్డుచెప్పలేదని బుకాయించారు. ముఖ్యంగా గోదావరి జలాలపై తెలంగాణ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు ఏనాడూ అడ్డు చెప్పలేదని నమ్మబలికారు. కాబట్టి, ఇప్పుడు నల్లమలసాగర్‌కు తెలంగాణ అడ్డు చెప్పొద్దని వ్యాఖ్యానించారు. నల్లమలసాగర్ వల్ల ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేదని, వృథాగా సముద్రంలోకి వెళ్లే జలాలనే తరలిస్తామంటూ అరిగిపోయిన రికార్డునే మళ్లీ వినిపించారు.
అయితే, ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యలపై తెలంగాణ వాదులు మండిపడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతోపాటు ఇతర తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డు చెప్పలేదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కాళేశ్వరాన్ని అడ్డుకునేందుకు ఆయన చేసిన కుట్రలు, కోర్టులో వేసిన పదుల సంఖ్యలో కేసులను గుర్తు చేస్తున్నారు. ఈ కేసులన్నీ ఎవరు వేశారని ప్రశ్నిస్తున్నారు. తాజాగా జనవరి 30న ఢిల్లీలో జరిగిన నిపుణుల కమిటీ భేటీలోనూ ఏపీ ప్రభుత్వం తెలంగాణ ప్రాజెక్టులపై విషం చిమ్మింది. ప్రాజెక్టులను అడ్డుకునేందుకు విశ్వప్రయత్నం చేసింది.
ఏ ఒక్క తెలంగాణ ప్రాజెక్టుకూ తాము ఒప్పుకొనేది లేదని వాదించింది. తెలంగాణ ప్రాజెక్టుల అనుమతుల ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకోవద్దని కూడా వాదించింది. అంతేకాకుండా గోదావరిలో తెలంగాణ వాటా 968 టీఎంసీలుగా తాము అంగీకరించబోమని కొర్రీలు పెట్టింది. గోదావరిలో ఏపీకే ఎక్కువ వాటా దక్కాలని వాదించింది. ఇలా ఒకవైపు తెలంగాణ ప్రాజెక్టులపై విషం చిమ్ముతూ, వాటిని అడ్డుకుంటూనే మరోవైపు కపట ప్రేమ నటించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.