e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 13, 2021
Home తెలంగాణ నీళ్లు లేనిచోట చేపల పంట!

నీళ్లు లేనిచోట చేపల పంట!

నీళ్లు లేనిచోట చేపల పంట!
  • ఎస్సారెస్పీ ఆయకట్టులో నిండిన చెరువులు
  • సూర్యాపేట జిల్లాలోని 9 మండలాల్లో నీలి విప్లవం
  • ఉచిత చేపపిల్లల పంపిణీతో పెరిగిన మత్స్య సంపద
  • మూడేండ్లలో రూ.120 కోట్లకుపైనే ఆదాయం

సూర్యాపేట, ఏప్రిల్‌ 14 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా పూర్తిచేసిన కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవసాయంతోపాటు అనుబంధ వృత్తులకు జీవం పోస్తున్నది. ప్రాజెక్టు ద్వారా తరలివస్తున్న గోదావరి జలాలతో చెరువులు, కుంటలు నిండుకుండల్లా మారుతున్నాయి. నీళ్లు పుష్కలంగా వస్తుండటంతో వ్యవసాయం పండుగలా మారగా, మత్స్యసంపద పెరుగుతున్నది. వేసవిలోనూ చెరువులు అలుగులు పోస్తుండటంతో ఎస్సారెస్పీ ఆయకట్టు చివరి ప్రాంతమైన సూర్యాపేట జిల్లాలోని 9 మండలాల్లో నీలి విప్లవం వచ్చింది. ప్రభుత్వమే ఉచితంగా చేప పిల్లలను అందిస్తుండటంతో కరువు నేలపై నేడు కోట్లాది రూపాయల మత్స్య సంపద పెరిగింది. మూడేండ్ల క్రితం వరకు ఆయా మండలాల్లోని మత్స్యకార్మికులకు ఏటా రూ.15 కోట్ల ఆదాయం రావడమే గగనమైన పరిస్థితుల నుంచి నేడు రూ.120 కోట్లకు పైనే సంపాదిస్తుండటం విశేషం.
నాడు నెర్రెలు.. నేడు జలసిరులు
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తుంగతుర్తి, తిరుమలగిరి, నాగారం, అర్వపల్లి, మద్దిరాల, నూతనకల్‌ మండలాలతోపాటు సూర్యాపేట నియోజకవర్గంలోని ఆత్మకూర్‌(ఎస్‌), పెన్‌పహాడ్‌, కోదాడ నియోజకవర్గంలోని మోతె మండలాలు శ్రీరాంసాగర్‌ ఆయకట్టు పరిధిలో ఉంటాయి. ఈ మండలాల్లో ఎస్సారెస్పీ కాల్వలు ఉన్నా.. మూడేండ్ల క్రితం వరకు చుక్కనీరు రాకపోయేది. చెరువులు, కుంటలు నెర్రెలు వారి కనిపించేవి. ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి జగదీశ్‌రెడ్డి మిషన్‌ కాకతీయ పథకం ద్వారా చెరువులను ఆధునీకరించడంతోపాటు ఎస్సారెస్పీ కాల్వలకు మరమ్మతులు చేయించారు. ఆ తర్వాత కాళేశ్వరం ద్వారా గోదావరి జలాలు రావడంతో నేడు చెరువులు, కుంటలు జలకళ సంతరించుకున్నాయి. ఆయా చెరువుల్లో ప్రభుత్వమే ఉచితంగా చేప పిల్లలు పోయడంతో మత్స్య సంపద పెరిగింది. నాడు బుడ్డ పరకలు కూడా దొరకని చోట నేడు రవ్వలు, బొచ్చెలు వంటి పెద్ద చేపలు లభ్యమవుతున్నాయి. ప్రభుత్వం మత్స్యకారులకు సబ్సిడీపై వలలు, వాహనాలు, బోట్లు అందజేయడంతో వారి జీవనోపాధి మెరుగుపడింది.
రూ.120 కోట్లకు పైనే ఆదాయం
జిల్లాలో ఎస్సారెస్పీ ఆయకట్టు పరిధిలోని 9 మండలాల్లో 278 చెరువులు ఉన్నాయి. మూడేండ్ల క్రితం వరకు నీరున్న కొన్ని చెరువుల్లో మత్స్యకారులు సుమారు 35 లక్షల చేప పిల్లలు వేసేవారు. వాటి ద్వారా ఏటా రూ.15 కోట్ల వరకు మత్స్య సంపద చేతికొచ్చేది.
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు రావడంతో 278 చెరువులు నిండాయి. మూడేండ్లుగా 2.5 కోట్లకుపైనే ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలు అందిస్తుండటంతో వాటి ద్వారా మత్స్య సొసైటీలకు ఏటా రూ.120 కోట్లకుపైనే ఆదాయం సమకూరుతున్నది. చెరువుల్లో కట్ల, రాహు, మెరిగలు తదితర చేపలు పెంచుతుండగా కిలో రూ.120 వరకు విక్రయిస్తున్నారు.
ఊరులోనే ఉపాధి పెరిగింది
గోదావరి నీళ్లు రాకముందు మా దగ్గర చేపలు దొరికేవి కావు. ఒకవేళ వానలు పడ్డా బయటి నుంచి తెచ్చుకోవాల్సిన పరిస్థితి. సీఎం కేసీఆర్‌ సారు కాళేశ్వరం నీళ్లు ఇస్తుండటంతో ఇప్పుడు చెరువులు నిండినయి. మా ఊరి చెరువుతోపాటు వేరే ఊరులో చెరువులు, కుంటల్లోనూ చేపలు పడుతూ ఉపాధి పొందుతున్నాం.
పిట్టల సైదమ్మ, నూతనకల్‌
మూడేండ్ల క్రితం సభ్యుడికి వెయ్యి.. నేడు పది వేలకు పైనే..
కాళేశ్వరం జలాల పుణ్యమా అని 23 ఏండ్ల తరువాత మా ఊరి పెద్ద చెరువు (శుభ సముద్రం) నిండింది. గతంలో భారీ వర్షాలు పడితే చెరువులో ఓ మోస్తరు నీళ్లు వచ్చేవి. అప్పుడు చెరువులో 50 వేల నుంచి 70 వేల వరకు చేప పిల్లలు పోసేది. ఇప్పుడు సీఎం కేసీఆర్‌ సార్‌ ఇచ్చే లక్ష పిల్లలకు తోడు సొంతంగా మరో లక్షన్నర చేప పిల్లలను వదులుతున్నం. గతంలో చేపలు పడితే రూ.90 వేలకు మించి ఏనాడూ రాలేదు. సొసైటీలో ఉన్న 89 మంది సభ్యులకు వెయ్యికి మించి రాకపోయేది. మూడేండ్లుగా ఏటా రూ.10 లక్షలు వస్తుంటే.. సభ్యులు ఒక్కొక్కరికి దాదాపు రూ.10 వేల వరకు వస్తున్నాయి. మత్స్య కార్మికులకు చేపల పంట పండుతుంది.
గుండ్లపల్లి వీరయ్య, మత్స్యకారుల సొసైటీ వైస్‌ చైర్మన్‌, ఆత్మకూరు(ఎస్‌)
తక్కువ ధరకే దొరుకుతున్నాయి
మా ఊరి చెరువు నిండటంతో చేపలను బాగా పెంచుతున్నారు. పోయిన ఏడాది నుంచి మా ఊరి చెరువు చేపలనే తింటున్నాం. గతంలో కిలో 150 నుంచి 200 రూపాయలు పెట్టి కొనేది. ఇప్పుడు మా ఊర్లోనే రూ.80కే కిలో ఇస్తున్నారు.
నాగమ్మ, గృహిణి, ఏపూరు, ఆత్మకూర్‌(ఎస్‌)

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
నీళ్లు లేనిచోట చేపల పంట!

ట్రెండింగ్‌

Advertisement