సోమవారం 03 ఆగస్టు 2020
Telangana - Jul 10, 2020 , 09:26:29

హైద‌రాబాద్ లో 10 శాతం త‌గ్గిన నేరాలు

హైద‌రాబాద్ లో 10 శాతం త‌గ్గిన నేరాలు

హైద‌రాబాద్ : రాష్ర్ట రాజ‌ధాని హైద‌రాబాద్ లో ఈ ఏడాది ప్రారంభం నుంచి జూన్ నెలఖారు వ‌ర‌కు 10 శాతం నేరాలు త‌గ్గాయ‌ని సిటీ పోలీసు క‌మిష‌న‌ర్ అంజ‌నీ కుమార్ తెలిపారు. గ‌తేడాది ఇదే స‌మ‌యంలో 12,374 కేసులు న‌మోదు కాగా, ఈ ఏడాది మాత్రం 12,273 కేసులు న‌మోదైన‌ట్లు చెప్పారు. నేరాల‌ను త‌గ్గించ‌డంతో పాటు నేర‌స్తుల‌ను కోర్టుల్లో ప్ర‌వేశపెట్టి శిక్ష ప‌డేలా చేశామ‌ని సీపీ పేర్కొన్నారు. ఈ ఏడాది శిక్షా రేటు 26 శాతంగా ఉంద‌న్నారు. 

నేర‌స్తుల‌పై ఉక్కుపాదం మోపుతున్నామ‌ని సీపీ స్ప‌ష్టం చేశారు. సౌత్ జోన్ లో 50 రౌడీషీట్లు, వెస్ట్ జోన్ లో 20 రౌడీషీట్ల‌ను ఓపెన్ చేశామ‌న్నారు. ప్ర‌జ‌ల‌ను భ‌య‌పెట్టేందుకు ప్ర‌య‌త్నించినా, వారి ఇబ్బందులు క‌లిగించిన స‌హించ‌మ‌ని తేల్చిచెప్పారు. నేరాల‌కు పాల్ప‌డే వారికి క‌ఠినంగా శిక్షిస్తామ‌ని అంజ‌నీ కుమార్ స్ప‌ష్టం చేశారు. 

గ‌త ఆరు నెల‌ల్లో న‌గ‌రంలో ఆస్తి గొడ‌వ‌ల‌కు సంబంధించి 1,200 కేసులు న‌మోదు అయ్యాయి. వీటిలో 567 కేసుల‌ను ప‌రిష్క‌రించాము. క్లూస్ టీం స‌హాయంతో నేర‌స్తుల‌ను అదుపులోకి తీసుకుంటున్నామ‌ని సీపీ తెలిపారు. ప్ర‌జ‌లు పోలీసుల‌కు స‌హ‌క‌రించాల‌ని, అత్య‌వ‌స‌ర స‌మ‌యాల్లో డ‌య‌ల్ 100కు ఫోన్ చేయాల‌ని అంజ‌నీ కుమార్ సూచించారు. ప్ర‌తి పౌరుడికి భ‌ద్ర‌త క‌ల్పించేందుకు సిటీ పోలీసు యంత్రాంగం సిద్ధంగా ఉంద‌ని సీపీ స్ప‌ష్టం చేశారు.


logo