ఆసిఫాబాద్ టౌన్, మే 10 : ఈ నెల 13న పార్లమెంట్ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ అన్నారు. శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్లు, సహాయ ఎన్నికల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆసిఫాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, అదనపు కలెక్టర్ దాసరి వేణు, ఆసిఫాబాద్ ఆర్డీవో లోకేశ్వర్ రావు పాల్గొన్నారు.
కలెక్టర్ మాట్లాడుతూ 001-ఆదిలాబాద్ (ఎస్టీ) పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని సిర్పూర్, ఆసిఫాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లలోని పోలింగ్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. సిర్పూర్ నియోజకవర్గంలో 320 పోలింగ్ కేంద్రాలకుగాను 40 రూట్లుగా విభజించి 40 మంది సెక్టార్ అధికారులు, ఆసిఫాబాద్ నియోజకవర్గంలో 356 పోలింగ్ కేంద్రాలకు 51 రూట్లు విభజించి 501 మంది సెక్టార్ అధికారులను నియమించామన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల నోడల్ అధికారులు, ఎన్నికల తహసీల్దార్ మధూకర్ పాల్గొన్నారు.