హైదరాబాద్ సిటీబ్యూరో, మే 20 (నమస్తే తెలంగాణ): ఒకసారి తప్పు చేస్తే పొరపాటు అనొచ్చు. కానీ పదేపదే తప్పు చేయడమే కాకుండా చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకొనేందుకు ఎదురుదాడికి దిగడాన్ని ఏమనాలి? ‘బిగ్ లూట్… రూటే సెపరేట్’ శీర్షికన బుధవారం నమస్తే తెలంగాణ ప్రచురించిన సంచలనాత్మక పరిశోధన కథనంపై హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) బుకాయింపు మొదలుపెట్టింది. ఆ కథనం వల్ల తెరవెనుక పెద్దలు కలవరపడ్డారో… లేక తప్పును కప్పిపుచ్చుకొనేందుకు కవరింగ్ ప్రకటన ఇవ్వాలనుకున్నారోగానీ.. నమస్తే కథనంపై బుధవారం సాయంత్రం అధికారులు ఇచ్చిన వివరణ చూస్తే మళ్లీ అడ్డంగా బుక్కయిన హెచ్ఎండీఏ అనక తప్పదు. కేవలం బిగ్ బ్రదర్స్ రియల్ దందా కోసం ఇప్పటికిప్పుడు అవసరంలేని వంద ఫీట్ల రహదారిని తెరపైకి తెచ్చి.. సర్వేనంబరును ఏమార్చి.. ఇదేదో ప్రజాప్రయోజనం కోసం తెచ్చిన రహదారిగా అధికారులు తమ ప్రకటనలో చెప్పుకొచ్చారు. గతంలో ప్రతిపాదించిన, ఇప్పటికిప్పుడు అవసరం ఉన్న పలు రోడ్ల విస్తరణ ప్రాజెక్టులను అటకెక్కించిన అధికారులు.. మంచిరేవులలో మాత్రం హడావుడిగా నోటిఫికేషన్ ఇవ్వడం వెనుక ఆంతర్యమేందో మంత్రి కొండా సురేఖ కూతురు నేరుగా చేసిన ఆరోపణలతోనే రుజువైంది. ఈ నేపథ్యంలో హెచ్ఎండీఏ అధికారులు విడుదల చేసిన ప్రకటన.. అందులోని డొల్లతనాన్ని పరిశీలిస్తే..
హెచ్ఎండీఏ అధికారులు విడుదల చేసిన ప్రకటనలో ‘డిమాండుకు అనుగుణంగా మాస్టర్‌ప్లాన్‌లోని ప్రతిపాదిత రోడ్ల అలైన్మెంట్లను సవరించుకుంటూ పోతాం. ఈ క్రమంలో మాస్టర్‌ప్లాన్-2031లో ప్రతిపాదించిన 24 మీటర్ల రహదారి (80 ఫీట్లు) మంచిరేవులలోని సర్వేనంబరు 298 మీదుగా వెళ్తుంది. ఈ మేరకు 12.11.2025న రెండు దినపత్రికల్లో నోటిఫికేషన్ ఇచ్చాం. అందులో సర్వేనంబరు 293కు బదులుగా 298 అని ప్రచురితమైంది. ఇది టైపోగ్రాఫికల్ ఎర్రర్ (టైపింగ్ మిస్టేక్) అని 2026, జనవరి 9న హెచ్ఎండీఏ ఒక లేఖ రాసింది. దానికి అనుగుణంగా ఆ రెండు పత్రికల్లో తిరిగి 14.1.2026న సవరణ నోటిఫికేషన్ ఇచ్చాం’ అని వివరించారు. ఇదే నిజమైతే…
హెచ్ఎండీఏ ‘మాస్టర్‌ప్లాన్-2031’లో ఉన్న వంద ఫీట్ల రహదారి అలైన్‌మెంట్‌ను మార్చడానికి గల సాంకేతిక కారణాన్ని అధికారులు ఆ ప్రకటనలో వివరించారు. 2017లో అప్పటి మంచిరేవుల సర్పంచ్ ప్రవీణ్‌యాదవ్ ఇచ్చిన అభ్యంతరాన్ని పరిశీలించి.. 2019లో గ్రామం మీదుగా వెళుతున్న అలైన్‌మెంట్‌ను రద్దు చేస్తూ జీవో 237 జారీచేసినట్టు పేర్కొన్నారు. కానీ ఇదే ప్రకటనలో అధికారులు బైరాగిగూడ నుంచి నార్సింగి వరకు మిస్సింగ్ లింకు రోడ్డు కొత్తది కాదని తెలిపారు. 2008 హుడా, 2013 హెచ్ఎండీఏ మాస్టర్‌ప్లాన్‌లో ఉన్నదేనని స్పష్టం చేశారు. మరి పాత దానిని 2019లో ఎందుకు రద్దు చేశారు? అనేది అధికారులకే తెలియాలి. ఇక.. ప్రస్తుత ప్రతిపాదిత రోడ్డు ప్రజాప్రయోజనాల కోసమేనని అధికారులు చెప్తున్నారు. ఇదే నిజమైతే… 2004లోనే ఔటర్ రింగురోడ్డు పక్క్న సర్వీసు రోడ్డు నుంచి మంత్రి విల్లాస్ వరకు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం వంద ఫీట్ల రహదారిని నిర్మించింది. ప్రజాప్రయోజనాల కోసం అధికారులు దానిని విస్తరిస్తే శంకర్పల్లి-హైదరాబాద్ రోడ్డుకు అనుసంధానమవుతుంది. అది చేయకుండా ఇప్పటికే ఉన్న వంద ఫీట్ల రహదారిని డెడ్ఎండ్గా చేసి.. దాని మధ్యలో నుంచి మరో అలైన్‌మెంట్‌ను వంకరటింకరగా తిప్పడం వెనుక ఆంతర్యమేమిటి? పైగా 16 ఎకరాల భూమి ఉన్న యజమాని వంద ఫీట్ల రహదారి కోసం దేవాదాయ శాఖలో తెరవెనుక అనేక ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో.. ఆ భూమికి ఒక పక్కగా ప్రస్తుత అలైన్‌మెంట్‌ను రూపొందించడమంటే.. సదరు బిల్డర్‌కు మేలు చేయడానికేనని నిర్ధారణ కావడం లేదా? ముఖ్యంగా ఈ అలైన్మెంట్ వల్ల 500, వెయ్యి గజాలు ప్లాట్లను కొనుగోలు చేసిన సామాన్యులు అనేకమంది నష్టపోవాల్సి వస్తుంది. దీంతోపాటు బిట్రో అపార్ట్మెంటు ముందు భాగం కూడా రోడ్డు విస్తరణలో దెబ్బతింటున్నది. కానీ అధికారులు విడుదల చేసిన ప్రకటనలో ఎవరికీ ఎలాంటి అంతరాయం, నష్టం కలగడంలేదని అబద్ధాన్ని వల్లించారు.