Manchirevula | దారి దోపిడీ.. అంటే అర్థం తెలుసా మీకు!దారి పక్కన నిలబడి, వచ్చిపోయే వాళ్లను దోచుకోవడం. ఇది పాత చందమామ, బాలమిత్ర కథల కాలం నాటి పద్ధతి!అయితే దారిని చూపించి దోచుకోవడం అనే కొత్త పద్ధతిని కనిపెట్టారు బిగ్‌బ్రదర్స్. జూబ్లీ కొండల్లో గన్ గురిపెడితే.. మంచిరేవులలో ఎలా పేలిందో నిన్నటి నమస్తే తెలంగాణ ‘ఎక్స్‌ప్లోజివ్’ కథనంలో చెప్పుకొన్నాం. ఆ పేలుడు వెనుక మందుగుండును కూర్చింది బిగ్‌బ్రదర్స్! పక్కా దోపిడీకి ప్లాన్ వేసింది బిగ్‌బ్రదర్స్!
రింగురోడ్లు, హైవేలను అష్టవంకర్లు తిప్పి, తమ పొలాల పక్కనుంచి వెళ్లేలా మాస్టర్‌ప్లాన్‌ను మార్చేసే కథలు ఎన్నో విన్నాం. కానీ ఇది వేరు. తమది కాని భూమిలో 30 ఫీట్ల రోడ్డును ఏమార్చి, వందఫీట్లకు మార్చి.. దాన్ని చూపించి అన్లిమిటెడ్ ఫ్లోర్ స్పేస్‌కు అనుమతులిప్పిస్తామని బిల్డర్‌తో ఒప్పందాలు చేసుకున్నారు. ఆ భూమి దేవాదాయశాఖది! ఆ దారి హెచ్‌ఎండీఏది! ఆ 16 ఎకరాలు బిల్డర్వి! చేతికి మట్టి అంటకుండా సాంతం మింగేసే ప్లాన్ ఇది!. ముఖ్యనేత ముఖం చూపించి.. తమ తెలివితేటలను ఉపయోగించి.. అధికార యంత్రాంగాన్ని లొంగదీసుకొని.. నడిపించిన హైప్రొఫైల్ లూట్ రూట్! మంచిరేవులలో మహాజాదూగాళ్ల సెటిల్మెంట్ హంట్!
కానీ, 2025 అక్టోబర్‌లో జరిగిన మంత్రి సురేఖ ఓఎస్డీ గన్గేమ్ వ్యవహారం, అనంతరం బిగ్‌బ్రదర్స్ జోక్యం తర్వాత 2025 డిసెంబర్ 31న అందరూ నూతన సంవత్సర వేడుకల్లో మునిగిఉన్న రోజున ఈ 100 ఫీట్ల రహదారి పత్రికా ప్రకటన సాక్షిగా తన దారి మార్చుకున్నది. మంత్రి విల్లాస్ కాస్త దూరం నుంచి కుడివైపు తిరిగి, ఆ తర్వాత అటూఇటూ వంకర్లు పోతూ.. బిట్రో నివాస సముదాయం మీదుగా ఓవర్‌హెడ్ ట్యాంక్ పక్కనుంచి ఇటీవల ఓ మాజీ ఎంపీ కొనుగోలు చేసిన భూమి పక్కనుంచి, బిగ్‌బ్రదర్ కార్యాలయం ముందునుంచి, డ్యూస్ విల్లాస్ సమీపం వరకు సొగసుగా సాగిపోయింది.
జూబ్లీక్లబ్ ఎన్నికల్లో గెలుపు కోసం మంచిరేవులలోని 16 ఎకరాల్లో మొదలైన దొంగాట.. డెక్కన్ సిమెంట్స్ వ్యవహారం చుట్టూ తిరిగి, అక్కడి నుంచి ఓ టీవీ యజమాని ద్వారా మంత్రి చేతుల్లోకి మారింది చదివాం కదా! మంచిరేవులలో బిగ్‌బ్రదర్స్ నడిపిస్తున్న ‘గన్ గేమ్.. పేలిన భూ స్కామ్‘లో అది ఇంటర్వెల్ మాత్రమే. చానల్ యజమాని పైరవీలు, జూబ్లీహిల్స్ సొసైటీ సభ్యత్వం గొడవ అంతా అక్కడితో పక్కకెళ్లిపోయాయి. ఎందుకంటే.. బిగ్‌బ్రదర్స్ జోక్యంతో వాళ్ల రోల్ అయిపోయింది. తమ పరిధి ముగియడంతో ఆ పాత్రలు అక్కడితో తెరమరుగయ్యాయి. ఇటు సురేఖ ఓఎస్డీ వ్యవహారం, 30 ఫీట్ల రోడ్డు కథ కూడా మొదటి అంకంతోనే ముగిసింది. అక్కడే అసలైన ‘మాస్టర్‌ప్లాన్’ మొదలైంది. మంచిరేవుల నుంచి బైరాగిగూడకు వెళ్లే 30 ఫీట్ల రహదారిని 100 ఫీట్లకు మార్చి, హెచ్ఎండీఏ సహకారంతో దాన్ని ఎలా తమకు అవసరమైన భూములవైపు దారి మళ్లించారనేదే సెకండాఫ్ స్టోరీలో కీలక మలుపు!
‘ఇసుక నుంచి తిమిరి తైలంబు తీయవచ్చు’ అనే స్థాయిలో, సామాన్యుల ఊహకందని రీతిలో బిగ్ బ్రదర్స్ కాసుల వేట మొదలు పెట్టారు. 30 ఫీట్ల రోడ్డు కాస్తా 100 ఫీట్ల మాస్టర్ ప్లాన్ రోడ్డుగా మారింది. అది కూడా వంకర టింకరలు తిరిగింది. ఈ ప్లాన్ వారికి అడుగడుగునా కోట్లు రాల్చింది. భూమికి భూమి ఫైల్‌కు మోక్షం కలిగి ఉంటే మధ్యవర్తులకు కొంత మొత్తం ముట్టగా, దేవాదాయ శాఖకు బదులుగా భూమి దక్కేది. ప్రైవేట్ బిల్డర్ సొంత ఖర్చులతో 30 ఫీట్ల రోడ్డు వేసుకునేవాడు. ఆ భూమిలో విల్లాల నిర్మాణానికి అనుమతులు వచ్చేవి.
కానీ వచ్చింది బిగ్ బ్రదర్స్ కదా. అందుకే రోడ్డు నిర్మాణం, భూసేకరణ భారం మొత్తాన్ని ప్రభుత్వ ఖాతాలోనే పడేలా స్కెచ్ వేశారు. తమను ‘సంతృప్తి’పరిచిన వారి భూముల ముందు నుంచి వంద ఫీట్ల రోడ్డును తిప్పుకొంటూ ‘రియల్’ కరువు కాలంలోనూ కాసుల వర్షాన్ని కురిపించారు. విల్లాల వరకు మాత్రమే అనుమతులు వచ్చే భూ ముల్లో ఆకాశాన్నంటే రెసిడిన్షియల్ టవర్స్ వచ్చేలా చేయడంతో ఆ భూముల విలువ బహిరంగ మార్కెట్లో నాలుగైదింతలు అవుతున్నది. దీంతో ‘బ్రదర్స్’ ఖాతాలోకి కమీషన్లతోపాటు వాటాల రూపంలో కాసుల వర్షం కురిసిందనేది స్థానిక రియల్ ఎస్టేట్ మార్కెట్లో టాక్.
ఈ మొత్తం వ్యవహారంలో హెచ్ఎండీఏ కీలుబొమ్మగా మారింది. సర్వే నంబర్లను మార్చి, వ్యవస్థలను ఏమార్చి, గెజిట్ నోటిఫికేషన్ వచ్చేలా చేసింది. దేవాదాయ శాఖ భూముల్లోంచి రోడ్డు వేస్తున్నా కనీసం ఆ శాఖకు వీసమెత్తు సమాచారం ఇవ్వకుండా బురిడీ కొట్టించింది. దీనిని బట్టే బిగ్ బ్రదర్స్ మంత్రాంగం ఏ స్థాయిలో ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. ఈ తతంగం మొత్తం ఎలా జరిగిందో తెలుసుకోవాలంటే ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ప్రతిపాదనల నుంచి మొదలు పెట్టాలి.
స్పెషల్ టాస్క్బ్యూరో, మే 19 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 2031 మాస్టర్ ప్లాన్‌లో భాగంగా మంచిరేవుల సమీపంలోని ట్రక్‌పార్క్ నుంచి నార్సింగి జంక్షన్ వరకు వంద ఫీట్ల రహదారిని ప్రతిపాదించింది. ఈ రోడ్డు 114 ఎకరాల దేవాదాయ భూములు, జూబ్లీ క్లబ్ నిర్వాహకులు ప్రీలాంచ్ నాటకాన్ని రక్తి కట్టించిన 16 ఎకరాల భూముల మధ్యలో నుంచి, మంచిరేవుల గ్రామం మీదుగా వెళ్తుంది. అయితే అప్పట్లో దేవాదాయ శాఖ ఈ ప్రతిపాదనలపై అభ్యంతరం వ్యక్తం చేసిందట. దీంతోపాటు రోడ్డు అలైన్‌మెంట్‌లోని ఒక సర్వేనెంబర్ భూమిపై న్యాయస్థానాల్లో కేసులు కొనసాగుతున్నాయి. మరోవైపు 16 ఎకరాల యజమాని తన భూమిలోంచి వంద ఫీట్ల రోడ్డు పోకుండా ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆ తర్వాత ఏం జరిగిందో మనకు తెలిసిందే. ఆ బిల్డర్ ఓ టీవీ చానల్ యజమాని ద్వారా మంత్రిని ఒప్పించి, దేవాదాయ భూముల్లో నుంచి భూమికి బదులు భూమి ప్రాతిపదికన రోడ్డు నిర్మాణానికి అనుమతుల కోసం ప్రయత్నించడం, ముఖ్యనేత ఆదేశాలతో చివరి నిమిషంలో ఆగిపోవడం చకచకా జరిగిపోయాయి. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది.
ట్విస్ట్ 1 వంద ఫీట్ల రోడ్డు పేరిట భారీ దందా

సినిమాల్లో ఒక ప్రధానమైన క్యారెక్టర్ తెరమీదికి వస్తే కథాగమనం మారిపోతుంది కదా. మంచిరేవులలోనూ ఇదే జరిగింది. ‘ఇప్పటివరకు ఒక లెక్క.. ఇప్పటి నుంచి మరో లెక్క’ అనే తరహాలో రోడ్డు కథ మొత్తం మారిపోయింది. ఒకవేళ మంత్రి పంపిన ‘భూమికి భూమి’ ఫైల్‌కు మోక్షం కలిగితే.. మంత్రి విల్లాస్ నివాస సముదాయం ఉన్నంత పొడవున సుమారు వంద మీ టర్ల మేర దేవాదాయ భూమిలో బిల్డర్ సొంత ఖర్చుతో 30 ఫీట్ల రోడ్డు నిర్మించుకునేవారు. అతడి భూమిలో విల్లాల నిర్మాణానికి అనుమతులు వచ్చేవి.
కానీ.. బిగ్ బ్రదర్స్ పేరుకు తగ్గట్టే ప్లాన్‌ను బాహుబలి తరహాలో ‘బిగ్ స్కేల్’కు పెంచేశారు. వంద ఫీట్ల మాస్టర్ ప్లాన్ రోడ్డును తెరమీదికి తెచ్చారు. పైగా ‘ప్రభుత్వ ఖర్చుతో రోడ్డును పూర్తి చేస్తాం. అలైన్‌మెంట్‌ను ఎక్కడెక్కడ మలుపులు తిప్పాలో చెప్పండి’ అంటూ స్థానిక రియల్ ఎస్టేట్ మార్కెట్లో బేరం పెట్టినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఫలితంగా సక్కగా పోవాల్సిన రోడ్డు వంకరటింకర్లు తిరిగిందని ఆరోపణలున్నాయి. మంత్రి విల్లాస్ నివాస సముదాయం పక్క నుంచి మొదలయ్యే వంద ఫీట్ల రహదారి బిట్రో నివాస సముదాయం మీదుగా ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి ఇటీవల మాజీ ఎంపీ ఒకరు కొనుగోలు చేసిన భూమి, బిగ్ బ్రదర్ కార్యాలయం ముందు నుంచి డ్యూస్ విల్లాస్ సమీపం వరకు కొనసాగేలా స్కెచ్ వేశారు. ఇలా చేస్తే ఏం లాభం వస్తుందనే సందేహం మీకు వచ్చింది కదా? సాధారణంగా ఒక వెంచర్‌కు 30 ఫీట్ల రోడ్డు (చిన్న రోడ్డు) ఉంటే గరిష్ఠంగా ఐదు ఫ్లోర్లు మాత్రమే కట్టుకోవచ్చు. ఎకరా స్థలంలో సుమారు లక్ష చదరపు అడుగుల నిర్మాణానికి మాత్రమే అనుమతి ఉంటుంది. అదే వంద ఫీట్ల రోడ్డు (పెద్ద రోడ్డు) వేస్తే హైరైజ్ బిల్డింగ్లు కట్టుకోవచ్చు. ఎకరానికి మూడున్నర లక్షల చదరపు అడుగుల మేర నిర్మాణాలు చేపట్టొచ్చు. అంటే.. ప్రభుత్వ ఖర్చుతో రోడ్డు వెడల్పు చేయడం ద్వారా దాని పక్కన ఉన్న భూముల్లో నిర్మాణాలు మూడున్నర రెట్లు పెంచుకోవచ్చు. లాభం కూడా మూడున్నర రెట్లు పెరుగుతుంది. రోడ్డు నిర్మాణంతో ఏయే బిల్డర్లు, వ్యాపారవేత్తలు ప్రయోజనం పొందుతారో గుర్తించి వారితో బిగ్ బ్రదర్స్ ఒప్పందాలు చేసుకున్నారన్న టాక్ వినిపిస్తున్నది. వారికి ఎంత లాభమో వివరించి, ఆ లాభాల్లో నుంచి వాటాలు వసూలు చేసుకున్నారన్న ఆరోపణలున్నాయి.
ట్విస్ట్ 2 హెచ్ఎండీఏ దాసోహం

బిగ్ ప్లాన్ బాగానే ఉన్నది.. మరి బిల్డర్లు, వ్యాపారవేత్తలకు భారం పడకుండా,ప్రభుత్వ ఖజానా నుంచి సొమ్ము ఖర్చు చేయించి వంద ఫీట్ల రోడ్డు నిర్మించడం ఎలా? చోటామోటా నేతల నుంచి మంత్రుల స్థాయి వరకు చూసినా నిబంధనలకు విరుద్ధంగా ఈ స్థాయిలో రోడ్డును నిర్మించడం దాదాపు అసాధ్యం.
కానీ.. ప్లాన్ వేసింది బిగ్ బ్రదర్స్ కదా.. వారి స్థాయికి తగ్గట్టే వంద ఫీట్ల రహదారి నిర్మాణ ప్రతిపాదనలకు రెక్కలొచ్చాయి. రెండున్నరేండ్లుగా మహానగరంలో ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టును సైతం పూర్తి చేయని హెచ్ఎండీఏ అధికారులు ఆగమేఘాల మీద ఈ వంద ఫీట్ల రహదారిపై స్పందించారు. నిబంధనలకు పాతర వేసి, బిగ్ బ్రదర్స్‌కు దాసోహమయ్యారు. మాస్టర్ ప్లాన్-2031 ప్రకారం, మొయినాబాద్-రాజేంద్రనగర్ మండల మాస్టర్ ప్లాన్స్ ప్రకారం ఆన్లైన్మెంట్లో భాగంగా వంద ఫీట్ల వెడల్పు, మూడున్నర కిలోమీటర్ల పొడవున రోడ్డు నిర్మిస్తున్నట్టు ప్రకటించారు. మంచిరేవుల కారిడార్ నంబర్ 131ను కలుపుతూ బైరాగిగూడ నుంచి నార్సింగి వరకు (శంకర్పల్లి-హైదబారాద్రోడ్) రోడ్డు వేస్తున్నామని పేర్కొంటూ భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేశారు. ఇందుకోసం గండిపేట మండలం మంచిరేవుల గ్రామం, రాజేంద్రనగర్ మండలం బైరాగిగూడ గ్రామం గోల్కొండ మండలం ఇబ్రహీంబాగ్ గ్రామంలోని పలు సర్వేనంబర్లను భూ సేకరణ జాబితాలో చేర్చారు. ఈ మేరకు ప్రతిపాదిత మిస్సింగ్ లింక్ రోడ్డును మాస్టర్ ప్లాన్ రోడ్డుగా ప్రకటిస్తూ 2025 డిసెంబర్ 31న హెచ్ఎండీఏ అధికారులు ప్రముఖ దినపత్రికలో నోటిఫికేషన్ ఇచ్చారు. ముఖ్యంగా మంచిరేవుల గ్రామ పరిధిలోని దేవాదాయ శాఖ భూములు ఉన్న 298తోపాటు 294, 128, 124, 125 సర్వేనంబర్లను ప్రచురించారు. ఈ ప్రతిపాదనలపై అభ్యంతరాలుంటే పదిహేను రోజుల్లో వ్యక్తం చేయాలని, అంటే 2026 జనవరి 15వ తేదీ వరకు గడువు ఇచ్చారు.
ట్విస్ట్ 3 ‘బిగ్’ ప్లాన్.. హెచ్ఎండీఏ అమలు

నిబంధనల ప్రకారం హెచ్ఎండీఏ అధికారులు గడువు పూర్తయ్యే వరకు ఆగాలి. ఏవైనా అభ్యంతరాలు వస్తే వాటిని పరిశీలించిన తర్వాత, అలైన్‌మెంట్‌ను ఖరారు చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలి. అప్పుడు ప్రభుత్వం గెజిట్ జారీ చేస్తుంది. కానీ వంద ఫీట్ల రోడ్డుకు 2026 జనవరి 7వ తేదీనే గెజిట్ ప్రచురితమైంది. అంటే భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చిన వారానికే గెజిట్ వచ్చిందన్నమాట.
దీనిని బట్టి హెచ్ఎండీఏ అధికారులు అంతకుముందే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారని స్పష్టమవుతున్నది. మరి ఈ మాత్రందానికి భూ సేకరణ నోటిఫికేషన్, అభ్యంతరాల స్వీకరణ డ్రామా ఎందుకని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఇక్కడితో అయిపోలేదు. అసలు ట్విస్ట్ ఇక్కడే ఉన్నది. హెచ్ఎండీఏ అధికారులు ఏకంగా సర్వే నంబర్లనే మార్చేశారు. ప్రముఖ దినపత్రికలో ఇచ్చిన భూసేకరణ నోటిఫికేషన్లో మంచిరేవుల గ్రామ పరిధిలోని దేవాదాయ భూములు ఉన్న సర్వేనంబర్ 298గా ప్రచురించారు. కానీ గెజిట్‌లో మాత్రం సర్వేనంబర్ 293గా పేర్కొనడం గమనార్హం. 293 సర్వేనంబర్‌లో 12.13 ఎకరాల దేవాదాయ భూమి ఉన్నది. దీనిపై హైకోర్టుతో పాటు దేవాదాయ ట్రిబ్యునల్‌లో కేసులు కొనసాగుతున్నాయి. ఒకవేళ భూసేకరణ జాబితాలో 293 సర్వేనంబర్ ఉంటే, తీర్పులు వచ్చే వరకు భూసేకరణ ప్రక్రియ ముందుకు సాగదు. పైగా ఈ కారణాన్ని చూపెట్టి భూ సేకరణకు దేవాదాయ శాఖ అభ్యంతరం తెలిపే అవకాశం ఉంటుంది. అప్పటికే భూమికి భూమి ఫైల్ ఆగిపోయిన కోపంలో ఉన్నారు కాబట్టి కచ్చితంగా అడ్డుకుంటారని బిగ్ బ్రదర్స్, హెచ్ఎండీఏ అధికారులకు తెలుసు. ఆ భూమి తమదే అని కోర్టుల్లో పోరాడుతున్న రైతులు కూడా అడ్డం పడేవారు. అందుకే వీటన్నింటినీ తప్పించేందుకు హెచ్ఎండీఏ అధికారులు భూ సేకరణ నోటిఫికేషన్లో సర్వే నంబర్‌ను 293కి బదులుగా 298 అని ప్రచురించారు. గెజిట్‌లో మాత్రం 293 సర్వే నంబర్‌ను ప్రచురించారు. ఈ తప్పును కప్పిపుచ్చుకోవడానికి మరో కవరింగ్ డ్రామా ఆడారు. జనవరి 13వ తేదీన అంటే గెజిట్ విడుదలైన వారం రోజులకు ఓ ఆంగ్ల పత్రిక, ఒక తెలుగు చిన్న పత్రికలో సవరణ భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చారు. గతంలో (డిసెంబరు 31) ఇచ్చిన నోటిఫికేషన్లో 293కి బదులుగా 298 సర్వేనంబర్ ప్రచురితమైందని అందులో పేర్కొన్నారు.
ట్విస్ట్ 4 ఇక్కడితో అయిపోలేదు

బిగ్ బ్రదర్స్ రంగ ప్రవేశం చేసి చిన్న రోడ్డును పెద్ద రోడ్డుగా మార్చడం, స్థానిక బిల్డర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, వ్యాపారవేత్తలతో ఒప్పందాలు చేసుకోవడం, రూ.కోట్లు కమీషన్లు తీసుకోవడం, హెచ్ఎండీఏ అధికారులు బిగ్ బ్రదర్స్ సేవలో తరించి, నిబంధనలను తుంగలో తొక్కి రోడ్డు అలైన్‌మెంట్‌కు గెజిట్ విడుదల చేయడంతో కథ అయిపోలేదు.
ఇక్కడే మరో భూ స్కామ్‌కు తెరలేచింది. గుడినే కాదు.. గుడిలో లింగాన్ని సైతం మింగేసే ఎత్తుగడలు ఇప్పుడే మొదలయ్యాయి. బిగ్ స్కెచ్ పరిధి వంద ఫీట్ల రోడ్డో, వ్యాపారుల నుంచి వచ్చే రూ.వందల కోట్లో కాదట. ఏకంగా 114 ఎకరాల దేవాదాయ భూములకు ఎసరు పెట్టారని తెలుస్తున్నది. తద్వారా రూ.వేల కోట్లు దిగమింగేందుకు ఎత్తుగడ వేశారు. ఈ క్రమంలో ఎవరెవరు ఏం చేశారు? ‘బిగ్’ వలలో దేవుడు సైతం చిక్కిపోయాడా? వంటి ఆసక్తికర అంశాలతో రేపు మూడో భాగం.
ఈ ప్రశ్నలకు జవాబులేవి?
సర్వే నంబర్ మార్పు కోసం హెచ్ఎండీఏ అధికారులు పూర్తిగా బిగ్ బ్రదర్స్‌కు దాసో హం అయ్యారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు చేసిన తప్పిదాలను ఎత్తిచూపుతూ నిపుణులు అనేక ప్రశ్నలు సంధిస్తున్నారు.
‘నమస్తే’ విచారణ.. నిద్రమత్తు వీడిన దేవాదాయ శాఖ

‘బిగ్’ బ్రదర్స్ డైరెక్షన్లో వంద ఫీట్ల రోడ్డు నిర్మాణానికి అడ్డదారులు తొక్కిన హెచ్ఎండీఏ అధికారులు ఏకంగా దేవాదాయ శాఖనే బురిడీ కొట్టించారు. పెద్ద రోడ్డును దేవాదాయ భూముల్లోంచి వేస్తున్నా ఆ శాఖకు కనీస సమాచారం ఇవ్వలేదు. ‘నమస్తే తెలంగాణ’ బృందం తమ విచారణలో భాగంగా దేవాదాయ శాఖ అధికారులను సంప్రదిం%B