Harish Rao | టెలీమెట్రిల ఏర్పాటు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి పట్ల మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. కృష్ణా జలాల వినియోగ లెక్కలు తేల్చేందుకుగాను టెలిమెట్రీల కోసం కేటాయించిన రూ. 4.18 కోట్ల నిధులను కేఆర్ఎంబీ (KRMB)దారి మళ్లిస్తుంటే తెలంగాణ ప్రభుత్వం చోద్యం చూడటం సిగ్గుచేటన్నారు. ఉద్దేశపూర్వకంగానే టెలిమెట్రీల ఏర్పాటు ప్రక్రియను ఆలస్యం చేస్తూ, కృష్ణా జలాల ఏపీ అక్రమ వినియోగానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం దుర్మార్గమన్నారు.
జూన్ 2016లో జరిగిన కేఆర్ఎంబీ సమావేశ నిర్ణయం ప్రకారం మొదటి దశలో 18 చోట్ల టెలిమెట్రి పరికరాలు ఏర్పాటు చేయగా, రెండో దశలో ఇంకా 9 చోట్ల ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ ఇప్పటివరకు అమలు కాకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. కేఆర్ఎంబీ (KRMB) నిర్ణయం ధిక్కరిస్తూ టెలీమెట్రి ఏర్పాటు కోసం నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం ప్రదర్శిస్తుంటే ఏపీ ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయలేదు..? ఎందుకు ఏపీ మీద ఒత్తిడి చేయకుండా మౌనంగా ఉన్నట్లు ? కృష్ణా జలాల విషయంలో తెలంగాణ హక్కులను కాపాడాల్సిన కేఆర్ఎంబీ , రాష్ట్ర ప్రభుత్వ అలసత్వాన్ని ఆసరాగా చేసుకొని తెలంగాణకు అన్యాయం చేస్తుంటే ఎందుకు స్పందించడం లేదు? అని హరీష్ రావు ప్రశ్నించారు.
తెలంగాణకు తీరని అన్యాయం..
తెలంగాణ, ఏపీ, కేంద్రంలోని బీజేపీ.. మూడు కలిసి టెలీమెట్రిల ఏర్పాటును నిర్లక్ష్యం చేస్తూ, తెలంగాణకు తీరని అన్యాయం చేస్తున్నాయి. టెలీమెట్రి ఏర్పాటు చేస్తున్నాం అని ప్రచారం చేసుకోవడమే తప్ప రెండేళ్ల నుండి కేంద్రం చేసింది ఏం లేదని హరీష్ రావు అన్నారు. సబ్ జ్యూడిస్ అని సాకులు చెప్పే కేంద్రానికి, సుప్రీంకోర్టులో కేసు ఉన్నప్పటికీ కేసీఆర్ 18 చోట్ల టెలీమెట్రిలు ఏర్పాటు చేసిన విషయం గుర్తు లేదా..? పోలవరం, నల్లమల సాగర్ విషయంలో మొద్దు నిద్ర ప్రదర్శించినట్లుగానే, టెలిమెట్రిల ఏర్పాటు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కావాలనే నిర్లక్ష్యంగా వ్యవహరించడం శోచనీయమన్నారు.
రూ. 4.18 కోట్ల రాష్ట్ర ప్రభుత్వ నిధులను వెంటనే రికవరీ అయ్యేలా చేసి, టెలిమెట్రీల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేసేందుకు కృషి చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం. కేవలం లేఖలు రాస్తూ కాలయాపన చేయకుండా, నిధులు మళ్లించిన కేఆర్ఎంబీపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నట్టు పేర్కొన్నారు.
Tirupati Express | తిరుపతి ఎక్స్ప్రెస్కు తప్పిన పెను ప్రమాదం..మంటలను ఆర్పివేసిన సిబ్బంది
Mamata Banerjee | కోల్కతాలో ఐ-ప్యాక్ సంస్థపై ఈడీ దాడులు.. తీవ్రంగా ఖండించిన సీఎం మమత
Bomb Threats | ఏపీలో మూడు జిల్లాల కోర్టులకు బాంబు బెదిరింపులు