తిరుపతి : ఒడిస్సాలోని పూరీ నుంచి తిరుపతికి బయలు దేరిన ఎక్స్ప్రెస్ (Tirupati Express) రైలులో పెను ప్రమాదం తప్పింది. గురువారం ఉదయం ఎక్స్ప్రెస్ రైలు కాకినాడ ( Kakinada) జిల్లా పరిధిలోని తుని-అన్నవరం రైల్వే స్టేషన్ల మధ్య బీ5 బోగీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
బోగీలోని ప్యానెల్ బోర్డు వద్ద విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరగడంతో దుప్పట్లకు మంటలు అంటుకుని బోగీ అంతటా పొగలు వ్యాపించాయి. ప్రమాదాన్ని గుర్తించిన రైల్వే సిబ్బంది రైలును నిలిపివేసి అగ్నిమాపక పరికరాల ద్వారా మంటలను ఆర్పివేశారు.
అనంతరం రైలును రాజమహేంద్రవరం స్టేషన్కు తరలించగా రైల్వే టెక్నికల్ సిబ్బంది, రైల్వే ఉన్నతాధికారులు ప్రమాదానికి గురైన బోగీని పరిశీలించారు. రైలును తనిఖీ చేసిన అనంతరం తిరుపతికి పంపించారు.