Condom packets | మెదక్ అర్బన్, మార్చి 18: ఎయిడ్స్ రహిత సమాజ నిర్మాణంలో కండోమ్స్ పాత్ర చాలా కీలకమని తెలిసిందే. అయితే ప్రజలకు అందించాల్సిన కండోమ్ ప్యాకెట్లను నిర్లక్ష్యంగా చెత్త కుప్పలో పడేయడం పట్ల మెదక్ ఐసీటీసీ సిబ్బంది నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. గ్రామాలలో, పట్టణాల్లో ఎయిడ్స్ రహిత సమాజంగా నిర్మించడానికి కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినా ప్రజలకు అవగాహన కల్పించడంలో ఎయిడ్స్ ప్రాజెక్ట్ సిబ్బంది సరిగా పనిచేయకపోవడం మెదక్ జిల్లాలో బాధాకరంగా ఉంది.
బుధవారం నాడు మెదక్ డంప్ యార్డులో కుప్పలు తెప్పలుగా కండోమ్ ప్యాకెట్లు కనిపించడంతో డంప్ యార్డులో పనిచేస్తున్న కార్మికులు అవాక్కయ్యారు. ఈ విషయంపై ఐసీటీసీ సిబ్బందిని వివరణ కోరగా.. మా దగ్గర నిరోద్ ప్యాకెట్ల సప్లై సరిగా లేదని ఎయిడ్స్ పేషంట్లకు సప్లై చేయాలంటే అనుకున్నంత కండోమ్స్ రాలేవని సమాధానం తెలిపారు. ఈ విషయంపై సంగారెడ్డిలో ఉన్న ఎఆర్టీ సెంటర్ అధికారిని వివరణ కోరగా అందుబాటులో లేరని తెలిసింది. మెదక్ జిల్లాకు సంబంధించిన మోటివేషన్ రాజేశ్వర్‌ను అడగగా మెదక్ సెంటర్ నుండి ఎలాంటి కండోమ్‌లను చెత్తకుప్పలో పడేయలేదని తెలిపారు.
డీఎంహెచ్ఓ కార్యాలయంలో కండోమ్ ప్యాకెట్స్ నిలువ ఉంచుతారని ఆ ఆఫీసుకు సంబంధించిన వారు పడేసారేమో అని నిర్లక్ష్యపు సమాధానం చెప్పడం గమనార్హం.
ప్రజలను ఎయిడ్స్ మహమ్మారి పై అవగాహనన కల్పించాల్సిన సిబ్బంది ఇలాంటి సమాధానం చెప్పడం ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ మెదక్‌లో ఎంతవరకు పనిచేస్తుందో గమనించాలి. బాధ్యత మరిచి పనిచేయని అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎయిడ్స్ బాధితులు కోరుతున్నారు.
