Harish Rao | బడీడు పిల్లలకు పౌష్టికాహారం అందించడంతో పాటు విద్యాబుద్ధులు నేర్పేందుకు ఎంతో గొప్ప ఆలోచనతో తీసుకువచ్చిందే మధ్యాహ్న భోజన పథకం. కాంగ్రెస్ పాలనలో విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం సైతం సక్రమంగా అందని పరిస్థితి నెలకొన్నది. పౌష్టికాహారంతో విద్యార్థుల కడుపులు నింపాల్సింది పోయింది.. కారం నూనె మెతుకులు తినాల్సిన పరిస్థితి ఎదురవుతున్నది. ఈ ఘటనలో నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో చోటు చేసుకున్నది. ఓ వైపు కూరగాయల ధరల పెరుగుదల.. మరో వైపు మధ్యాహ్న భోజనానికి సంబంధించిన బిల్లులు రాకపోవడంతో కుక్ కమ్ హెల్పర్లు ఇబ్బందులుపడుతున్నారు. ఈ ఘటనపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు స్పందించారు.
సరైన భోజనం లేక ఆకలితో ఉన్న విద్యార్థులు కారం, నూనెతో అన్నం కలుపుకుని కడుపు నింపుకున్నారని.. ప్రభుత్వం భావిభారత పౌరులతో ఇంత బాధ్యతారహితంగా వ్యవహరించడం బాధాకరమన్నారు. విద్యార్థులకు పౌష్టికాహారం కోసం అందించే సిఎం బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని అటకెక్కించిన ప్రభుత్వం.. ఇప్పుడు మధ్యాహ్న భోజనం అందించడంలో తీవ్రంగా విఫలమైందని మండిపడ్డారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమని.. మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి భోజన సామగ్రి బిల్లులు, కుక్ కమ్ హెల్పర్ల వేతనాలు పెండింగ్ ఉండడంతో విద్యార్థులకు సరైన భోజనం అందడం లేదంటూ మండిపడ్డారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెంటనే స్పందించి మధ్యాహ్న భోజనం పథకం పెండింగ్ బిల్లులు, కార్మికుల జీతాలు చెల్లించి.. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థుల కడుపు నింపాలని కోరారు.
నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం కొత్తపల్లి ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం సరైన భోజనం లేక ఆకలితో ఉన్న విద్యార్థులు కారం, నూనెతో అన్నం కలుపుకుని కడుపు నింపుకొన్నారు. ప్రభుత్వం భావిభారత పౌరుల పట్ల ఇంత బాధ్యతారహితంగా వ్యవహరించడం బాధాకరం.
విద్యార్థులకు పౌష్టికాహారం కోసం అందించే సిఎం… pic.twitter.com/7zmh8fv81S
— Harish Rao Thanneeru (@BRSHarish) August 4, 2024