KTR tweet : తెలంగాణకు మరిన్ని విదేశీ పెట్టుబడులు తెచ్చేందుకు సీఎం రేవంత్‌రెడ్డి టీమ్ అమెరికా, దక్షిణ కొరియా పర్యటనలకు వెళ్లింది. ఈ క్రమంలో తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం నుంచి భారీ బృందం అమెరికా, దక్షిణ కొరియా పర్యటనలకు వెళ్తున్నది. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డికి, మంత్రి శ్రీధర్‌బాబుకు నా శుభాకాంక్షలు. ఆల్ ది బెస్ట్.’ అంటూ కేటీఆర్ తన ట్వీట్‌ను మొదలుపెట్టారు.
‘పదేళ్లపాటు అధికారంలో ఉన్న తాము విదేశాల్లోని ప్రముఖ కంపెనీలతో పెంచుకున్న సంబంధాలు ఇప్పుడు రాష్ట్రానికి మేలు చేకూరుస్తున్నాయి. అలుపన్నది లేకుండా పట్టుదలతో రాష్ట్రానికి భారీ ఎత్తున విదేశీ పెట్టుబడులను తీసుకొచ్చాం. వాటిని చూసి ఇవాళ రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు రానుండటం సంతోషకరం. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధికి అనుకూలమైన వాతావరణం కల్పించేందుకు మేం ప్రాధాన్యం ఇచ్చాం.’ అని కేటీఆర్ పేర్కొన్నారు.
టీఎస్ ఐపాస్ (TS-IPASS) లో ప్రభుత్వ వినూత్నమైన విధానాలకు ఆకర్షితులై చాలా సంస్థలు రాష్ట్రంలో గణనీయంగా పెట్టుబడులు పెట్టాయి. గడిచిన దశాబ్దకాలంలో రూ.4 లక్షల కోట్లకు పైగా ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలను సృష్టించాం. రాజకీయాలు పక్కన పెడితే నాకు, బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ఫస్ట్. ప్రస్తుత ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యక్ష పెట్టుబడులు తేవడంలో విజయం సాధించాలని, తాము స్థాపించిన బలమైన పునాదిపై తెలంగాణ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని హృదయపూర్వకంగా ఆశిస్తున్నా.. జై తెలంగాణ.’ అని పోస్ట్ చేశారు.