శనివారం 04 జూలై 2020
Telangana - Jun 30, 2020 , 01:50:51

జీహెచ్‌ఎంసీ నిర్బంధం!

జీహెచ్‌ఎంసీ నిర్బంధం!

  • లాక్‌డౌన్‌ సడలింపులతో విజృంభిస్తున్న కరోనా
  • నిబంధనలు పాటించకుండా రోడ్డెక్కుతున్న జనం
  • జీహెచ్‌ఎంసీ మార్కెట్లలో అదుపుతప్పిన పరిస్థితి
  • పలు వ్యాపారసంస్థలు స్వచ్ఛందంగా మూత
  • వైద్యశాఖ సిఫారసుతో మళ్లీ లాక్‌డౌన్‌ దిశగా ప్రభుత్వం

కరోనా మహమ్మారి కట్టడికోసం దాదాపు మూడు నెలలు లాక్‌డౌన్‌ అమలైనప్పుడు పదుల సంఖ్యలోపే పాజిటివ్‌ కేసులు! అన్‌లాక్‌ మొదలైన నెలరోజుల్లోనే రోజుకు సగటున వెయ్యి కేసులు. ఇందులో సింహభాగం రాజధాని నగరంలోనే.. ఇదీ రాష్ట్రంలోని పరిస్థితి. క్రమశిక్షణ అదుపుతప్పిన ఫలితమిది. మృగశిర కార్తె సందర్భంగా హైదరాబాద్‌లోని రాంగనర్‌ చేపలమార్కెట్‌ మేడారం జాతరను తలపించింది. భౌతికదూరం అనే నిబంధనను బొందపెట్టారు. మాస్క్‌ లేకుంటే రిస్క్‌అని తెలిసీ లెక్కచేయనివాళ్లే ఎక్కువ. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. దీంతో గ్రేటర్‌ హైదరాబాద్‌ వైరస్‌కు హాట్‌స్పాట్‌గా మారింది. వ్యాపారులే స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా జీహెచ్‌ఎంసీ వరకు లాక్‌డౌన్‌ అమలుచేయాలని ఆలోచిస్తున్నది.

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: దేశవ్యాప్తంగా దీర్ఘకాలంగా లాక్‌డౌన్‌ను అమలుచేసిన కేంద్రప్రభుత్వం.. కొన్ని నిబంధనలు సూచిస్తూ ఆంక్షలను క్రమంగా సడలిస్తూ వచ్చింది. మాస్క్‌లేకుండా ఇంటినుంచి బయటకు రావద్దని, గుంపులుగా గుమికూడవద్దని పేర్కొన్నది. కానీ, ప్రజలు మాత్రం అవసరం ఉన్నా, లేకున్నా రోడ్లపైకి వస్తున్నారు. మాస్క్‌ ధరించడం, సామాజికదూరం పాటించడాన్ని పక్కనపెట్టేశారు. హైదరాబాద్‌లో కొన్ని మార్కెట్లు జనంతో కిటకిటలాడాయి. రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. దీంతో కరోనా కేసుల సంఖ్య పదుల నుంచి వందలకు చేరింది. ఈ నెల 27న ఏకంగా 1,087 కేసులు నమోదయ్యాయి. 

ఇందులో 95 శాతానికిపైగా జీహెచ్‌ఎంసీ పరిధిలోనే ఉంటున్నాయి. కేసుల తీవ్రతను తగ్గించాలంటే వైద్యారోగ్యశాఖకు మళ్లీ లాక్‌డౌన్‌ విధించడమే పరిష్కారంగా కన్పిస్తున్నది. వైరస్‌ ఉద్ధృతి నేపథ్యంలో హైదరాబాద్‌లోని బేగంబజార్‌, జనరల్‌ బజార్‌లలో వ్యాపారులు తమ దుకాణాలను స్వచ్ఛందంగా మూసుకున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో పలు కాలనీలు స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌ విధించుకున్నాయి. ప్రవేశ, నిష్క్రమణమార్గాలను మూసివేసి.. ఒక్క ద్వారాన్ని మాత్రమే తెరుస్తున్నారు. నిర్దేశిత సమయం వరకు మాత్రమే రాకపోకలకు అనుమతి ఇస్తున్నారు. కొన్నిచోట్ల కాలనీలోని వాహనాలకు స్టిక్కర్లు, ప్రత్యేక నంబర్లు కేటాయిస్తున్నారు. అవి మినహా మిగతావాటిని అనుమతించడం లేదు.

అప్రమత్తమవుతున్న అన్నిశాఖలు

రెండుమూడు రోజుల్లో లాక్‌డౌన్‌ ప్రకటించే అవకాశాలు ఉండటంతో అన్నిశాఖలు సంసిద్ధమవుతున్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో వైరస్‌ను కట్టడిచేస్తే.. రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తిని అరికట్టవచ్చని అధికారులు యోచిస్తున్నారు. సీఎం కేసీఆర్‌ ఏ సమయంలో లాక్‌డౌన్‌ నిర్ణయం ప్రకటించినా పక్కాగా అమలుచేసేందుకు అన్నిశాఖలు అప్రమత్తమవుతున్నాయి. మరోవైపు దేశవ్యాప్తంగా పలు రాష్ర్టాలు లాక్‌డౌన్‌ దిశగా పయనిస్తున్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం తాజాగా జూలై 31 వరకు లాక్‌డౌన్‌ విధించింది. తమిళనాడు రాజధాని చెన్నైలో ఇప్పటికే అమలవుతున్నది. 

పోలీసుశాఖ అప్రమత్తం

లాక్‌డౌన్‌ విధిస్తే పోలీస్‌శాఖ పరంగా తీసుకోవాల్సిన చర్యలపై ఉన్నతాధికారులు దృష్టిపెట్టినట్టు సమాచారం. ప్రధానంగా హైదరాబాద్‌ పరిధిలో బారికేడింగ్‌, ఇతర భద్రతాపరమైన చర్యలపైనా చర్చిస్తున్నారు. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించేవారిపై ఐపీసీ, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌ సెక్షన్‌ 51(బీ) కింద కేసులు నమోదుచేయనున్నారు. మాస్క్‌లు లేకుండా, వ్యక్తిగత దూరం పాటించనివారిపైనా ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ను ఉపయోగించి చర్యలు తీసుకోనున్నారు. గతంలో లాక్‌డౌన్‌ విధించిన సమయంలోనూ రాష్ట్రవ్యాప్తంగా 1.81 లక్షల కేసులు నమోదుచేశారు. 

గ్రామాల్లోనూ ‘స్వచ్ఛంద లాక్‌డౌన్‌'

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్‌లోని పలుప్రాంతాల్లోని మార్కెట్లు ‘సెల్ఫ్‌ లాక్‌డౌన్‌'లోకి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. కాలనీలు, జిల్లాల్లోని పట్టణాలు ఇదేబాట పట్టాయి. ఈ సంస్కృతి తాజాగా గ్రామాలకూ పాకుతున్నది. ఓవైపు ప్రజలకు ఇబ్బంది లేకుండా వ్యాపార, ఆర్థిక కార్యకలాపాలు నడిచేలా.. మరోవైపు వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేలా పంచాయతీ పాలకులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. నిర్ణీత సమయం మేర మాత్రమే దుకాణాలు తెరిచేందుకు అనుమతి ఇస్తున్నారు. చీకటి పడగానే లాక్‌డౌన్‌ పాటిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో మద్యం దుకాణాలకు కూడా మినహాయింపు ఇవ్వడం లేదు. ప్రజలు సైతం ఇండ్ల నుంచి బయటికి రావొద్దని పంచాయతీ అధికారులు స్పష్టంగా పేర్కొంటున్నారు. అవసరం లేకపోయినా బయటకు వచ్చేవారిని, మాస్కులు లేకుండా తిరిగేవారిని, గుంపులుగా గుమికూడేవారిని కట్టడి చేసేందుకు జరిమానా విధిస్తున్నారు. 


logo