మంగళవారం 26 జనవరి 2021
Telangana - Dec 24, 2020 , 03:06:32

దేశానికి దిక్సూచి పీవీ

దేశానికి దిక్సూచి పీవీ

  • పీవీ జ్ఞానభూమిలో మాజీ ప్రధాని వర్ధంతి
  • నివాళులర్పించిన ప్రముఖులు

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ/ బేగంపేట: మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు కొత్త ఆర్థికసంస్కరణలు తీసుకొచ్చి దేశానికి దిక్సూచిగా మారారని పలువురు కొనియాడారు. పీవీ 16వ వర్ధంతి బుధవారం నెక్లెస్‌రోడ్డులోని జ్ఞానభూమిలో రాష్ట్రప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. ఈ సందర్భంగా మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, పీవీ శతజయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్‌ కే కేశవరావు, ఎమ్మెల్సీ కవిత, మంత్రులతోపాటు ఇతర ప్రముఖులు ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మండలి చైర్మన్‌ గుత్తా మాట్లాడుతూ.. బహుభాష కోవిదుడు, మేధావి, రాజకీయ దురంధరుడు, ఉత్తమ పార్లమెంటేరియన్‌ పీవీ నర్సింహారావు అని చెప్పారు. ప్రధానిగా ఆయన ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలతో ప్రపంచపటంలో భారతదేశం సుస్థిర స్థానం ఏర్పరచుకున్నదని పేర్కొన్నారు.

దక్షిణ భారతదేశం నుంచి మొదటి ప్రధానిగా తెలంగాణ బిడ్డ పీవీ ఎనలేని సేవలందించారని, చరిత్రలో మిగిలిపోయే అతి కొద్దిమంది రాజకీయ నాయకుల్లో ఆయన ఒకరని స్పీకర్‌ పోచారం తెలిపారు.  పీవీ ఒకవ్యక్తి కాదు.. శక్తి అని చెప్పారు. సీఎం కేసీఆర్‌, ఎంపీ కేశవరావు ఆధ్వర్యంలో పీవీ శతజయంతి ఉత్సవాలు గొప్పగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. శత జయంతి ఉత్సవాల్లో భాగంగా జూన్‌ 2021 వరకు అంతర్జాతీయ సెమినార్లు నిర్వహిస్తామని ఎంపీ కేశవరావు తెలిపారు. పీవీ తెచ్చిన సంస్కరణలు, ఆయన ఆలోచనలు అందరికీ తెలియాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. పీవీ పేరుతో ఒక స్టాంప్‌ విడుదల చేయాలని కోరుతున్నట్టు వివరించారు. ఈ సందర్భంగా పీవీ కుటుంబసభ్యులు ముద్రించిన 2021 క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. మంత్రులు మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు, శ్రీనివాస్‌గౌడ్‌, మల్లారెడ్డి, సత్యవతి రాథోడ్‌, ప్రభుత్వ సలహాదారులు కేవీ రమణాచారి, రాజీవ్‌శర్మ, సాంస్కృతికశాఖ డైరెక్టర్‌ మామిడి హరికృష్ణ, వివిధ పార్టీల నాయకులు తదితరులు పీవీకి నివాళులు అర్పించారు.  ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల రాంకోఠి ఆధ్వర్యంలో భజన గీతాలను అలపించారు. 

రామానంద తీర్థ ట్రస్టులో..

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు వర్ధంతిని బుధవారం బేగంపేట రామానందతీర్థ ట్రస్టులో నిర్వహించారు. ఎస్సార్టీఐ, ఎస్‌ఈఆర్‌ఎన్‌ఐ అధ్యక్షుడు పీవీ ప్రభాకర్‌రావు, స్వామి రామానందతీర్థ కమిటీ కార్యదర్శి వాణీదేవి, సురభి సంస్థల డైరెక్టర్‌ శేఖర్‌ మారం రాజు తదితరులు పీవీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో స్వామి రామానందతీర్థ కమిటీ సభ్యులు, పలువురు స్వాతంత్య్ర సమరయోధులు పాల్గొన్నారు.logo