సూర్యాపేట, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ) : ‘మిర్యాలగూడ నుంచి సూర్యాపేటకు వస్తుంటే మధ్యన రైతులు వచ్చి బస్సు ఆపి తమ అరిగోస వినిపిస్తుంటే ఆలస్యమైంది.. రాత్రి తొమ్మిది దాటినా తండోపతండాలుగా, వేలాదిగా జనం గంటల తరబడి నిరీక్షించారంటే జగదీశ్‌రెడ్డి నేతృత్వంలో సూర్యాపేట మెజారిటీతోనే నల్లగొండ ఎంపీ అభ్యర్థి కృష్ణారెడ్డి విజయం సాధిస్తారనే నమ్మకం వచ్చింది. ఇక్కడ 50వేలకు పైనే మెజారిటీ వస్తుందనే ధీమా కనిపిస్తున్నది’ అని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. సూర్యాపేట రోడ్ షోలో కేసీఆర్ ప్రజలనుద్దేశించి మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో జగదీశ్‌రెడ్డి రెండు పర్యాయాలు మంత్రిగా పనిచేస్తే సూర్యాపేట నియోజకవర్గంతోపాటు జిల్లా ఏ స్థాయిలో అభివృద్ధి జరిగిందో ప్రజలకు తెలుసన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉత్తమ్ కుమార్‌రెడ్డి మంత్రిగా ఉంటే నయాపైసా అభివృద్ధి జరిగిందా అని ప్రశ్నించారు. ప్రధానంగా నాలుగైదు దశాబ్దాల పాటు ఎడారిగా ఉన్న తుంగతుర్తి, సూర్యాపేటతోపాటు కోదాడ నియోజకవర్గ పరిధిలోని కొన్ని ప్రాంతాలకు కాళేశ్వరం నుంచి గోదావరి జలాలను తెచ్చి 2.50 లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేశామని తెలిపారు. పదేండ్ల పాటు బీఆర్ఎస్ హయాంలో పచ్చగా ఉన్న జిల్లా నేడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నిండా నాలుగు నెలలు కాకముందే ఎడారిగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వందలాది పిల్లర్లు ఉన్న మేడిగడ్డ బ్యారేజీకి మూడు పిల్లర్లు కుంగాయని కాళేశ్వరం ప్రాజెక్టును పండబెట్టారని, మరో పక్క నీళ్లున్నా సాగర్ నుంచి ఒక్క తడికి నీటిని వదలలేని దౌర్భాగ్య స్థితిలో జిల్లాకు చెందిన ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఉన్నారని దుయ్యబట్టారు.
నీటి నిర్వహణ లోపం, రాజకీయ దురుద్దేశంతో కాళేశ్వరం ప్రాజెక్టును పండబెట్టిన కాంగ్రెస్ సాగునీటిని ఇస్తుందనే నమ్మకం తనకు, రైతులకు కూడా పోయిందని కేసీఆర్ అన్నారు. మూసీ మురికి నీటి నుంచి సూర్యాపేటను విముక్తి చేసి స్వచ్ఛమైన తాగునీటిని అందించిన ఘనత బీఆర్ఎస్దేనని తెలిపారు. ఇవాళ రాష్ట్రంలో కాంంగ్రెస్, ప్రజలకు మధ్య పంచాయితీ పడ్డదని, మాట్లాడే పెద్ద కేసీఆర్ బీఆర్ఎస్కు బలమొస్తే అది తెలంగాణ ప్రజల శక్తి అవుతదని కేసీఆర్ అన్నారు. దయచేసి ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి కృష్ణారెడ్డిని కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు బడుగుల లింగయ్యయాదవ్, మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిశోర్‌కుమార్, బొల్లం మల్లయ్యయాదవ్. రాష్ట్ర నాయకులు చెరుకు సుధాకర్ పాల్గొన్నారు.
పదమూడేండ్ల ఉద్యమ పోరాటంతో తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన కేసీఆరే తెలంగాణకు శ్రీరామరక్ష. పదేండ్ల పాటు అహర్నిశలు జనం కోసం తపన పడి వారి బాగోగులను చూసుకుంటే చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఒక్కొక్కటిగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో కండ్లముందే నిర్వీర్యం అవుతుంటే జనం తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. పదేండ్ల తరువాత ఈ జిల్లాలో 120 రోజుల్లో ఏం జరిగిందో తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ చేతుల్లో ఉన్న నాడు ఎంత అద్భుతంగా ఉండేనే ప్రజలు నెమరువేసుకుంటున్నారు. పదేండ్లు రైతులు కడుపులో చల్ల కదలకుండా రాత్రి పూట బయటకు వెళ్లకుండా లక్షల ఎకరాలు ఎలా పండించుకున్నారు, ఒక్క బోరు మోటారు కాలకుండా పంట ఎలా పండించుకున్నారో ప్రజలందరికీ తెలుసు. ఆరోగ్యం బాగా లేకున్నా కేసీఆర్ నా ప్రజలు, రైతులే ముఖ్యమని నాడు తెలంగాణ రాష్ట్రం తెచ్చిన సాహసంతో మరో పోరాటానికి సిద్ధమై వచ్చారు. సూర్యాపేటను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన కేసీఆర్‌కు అండగా ఉండి ఎంపీ ఎన్నికల్లో కారుకు గుర్తుకు ఓటేసి గెలిపిద్దాం.