చింతలమానేపల్లి, నవంబర్ 4 : ఈ ఏడాది జూలై, ఆగస్టు నెలలో కురిసిన అధిక వర్షాలకు దెబ్బతిన్న పంటలకు ఇప్పటివరకు నష్టపరిహారం(Crop damage) అందలేదని సోమవారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట దిందా, కేతిని, చిత్తం గ్రామాలకు చెందిన 60 మందికి పైగా రైతులు ధర్నా(Farmers dharna) చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రాణహిత నదితో పాటు దిందా-కేతిని వాగు వరదకు సుమారు 150 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు.
అధికారులు వచ్చి క్షేత్రస్థాయిలో సర్వే చేయకుండా ప్రైవేట్ వ్యక్తులతో లిస్టు తయారు చేయించారని, అందులో అసలైన బాధితుల పేర్లు లేవని మండిపడ్డారు. అనర్హుల నుంచి వ్యవసాయ శాఖ అధికారి కమీషన్లు తీసుకున్నారని, ఈ విషయమై ఉన్నతాధికారులు స్పందించి సర్వే చేసి బాధిత రైతులకు న్యాయం చేయాలన్నారు. అవకతవకలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.