AP News | నేను హోం మంత్రిని అయితే పరిస్థితులు వేరేలా ఉంటాయని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి నారాయణ స్పందించారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రికి పోర్ట్పోలియాపై స్పందించే స్వేచ్ఛ ఉంటుందని తెలిపారు. అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి నారాయణ మాట్లాడుతూ.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను అలర్ట్గా తీసుకోవాలని అప్రమత్తం చేశారు. సీఎం చంద్రబాబు అందర్నీ కో ఆర్డినెట్ చేయగలరని స్పష్టం చేశారు.
గత ప్రభుత్వం రాజధాని పేరుతో మూడు ముక్కలాట ఆడిందని మంత్రి నారాయణ విమర్శించారు. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని అమరావతి పనులను వేగవంతం చేశామని చెప్పారు. ప్రపంచంలోని ఐదు ముఖ్యమైన నగరాల్లో ఒకటిగా అమరావతి నిలిచేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే రూ.30వేల కోట్ల పనులకు టెండర్లు ఖరారయ్యాయని చెప్పారు. పనులకు సంబంధించి చీఫ్ ఇంజనీర్ల కమిటీ అక్టోబర్ 29న నివేదిక ఇచ్చిందని అన్నారు. ప్రపంచ బ్యాంక్ రూ.15వేల కోట్ల రుణం ఇస్తుందని అన్నారు. డిసెంబర్ 31కల్లా అన్ని టెండర్లు పిలవాలని ఆదేశించామని చెప్పారు.