CM KCR | కేసీఆర్ మహారాష్ట్రలోని నాందేడ్‌లో, కంధార్-లోహాలో రెండుచోట్ల మాట్లాడితేనే విస్తృతమైన చర్చ జరుగుతున్నది. ఒక రాష్ట్ర సీఎం మరో రాష్ర్టానికి వచ్చి ఆ రాష్ట్ర పాలకుడిపై సవాల్ చేయటం అన్నది మామూలు విషయం కాదు. కేసీఆర్ నాందేడ్ సభ తర్వాతే మహారాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఏడాదికి ఎకరానికి రూ.6 వేల స్కీంను ప్రకటించింది. దీన్ని కేసీఆర్ విజయంగా రైతులు చెప్పుకొంటున్నారు. ఇటీవల గుజరాత్, రాజస్థాన్‌లోనూ రైతులు కేసీఆర్ గురించి మాట్లాడుకోవటం నేను విన్నాను.
– సుధీర్ సుధాకర్‌రావ్ బిందు
హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ) : ‘మహారాష్ట్రలో ఏ ఇంట్లో చూసినా కేసీఆర్ ముచ్చటే.. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌పై కంధార్ లోహా సభలో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు సోషల్, మెయిన్ మీడియాలో వైరల్ అవుతున్నాయి’ అని మహారాష్ట్ర షేత్కరీ యువ సంఘటన రాష్ట్ర అధ్యక్షుడు సుధీర్ సుధాకర్‌రావ్ బిందు పేర్కొన్నారు. దేశమంతా తెలంగాణ వెంట నడవాల్సిందేనని కేసీఆర్ విసురుతున్న సవాల్‌కు పాలకులు జంకుతుంటే.. ప్రజలు మాత్రం స్వాగతిస్తున్నారని చెప్పారు. రైతుల మేలు కోసం ఎంతోకాలంగా పనిచేస్తున్న తమకు బీఆర్ఎస్ రూపంలో చక్కటి వేదిక దొరికిందని ఆనందం వ్యక్తంచేశారు. తాము కేసీఆర్‌తో కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు. మహారాష్ట్రలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, బీఆర్ఎస్ పార్టీకి మహారాష్ట్రలో లభిస్తున్న ఆదరణపై ‘నమస్తే తెలంగాణ’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలను పంచుకొన్నారు.
Sudhir Sudhakar Rao Bindu
తెలంగాణ నుంచి మహారాష్ట్రకు, మహారాష్ట్ర నుంచి తెలంగాణకు చారిత్రకంగా, సామాజికంగా సామీప్యత ఉన్నది. తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించిన నేపథ్యం మాకు తెలుసు. ఏ ఆకాంక్షల కోసం తెలంగాణ ప్రజలు ఉద్యమించారో అవి సాకారమయ్యాయి. ఫలితంగా తెలంగాణ, కర్ణాటకకు సరిహద్దున ఉన్న గ్రామాలు తమను తెలంగాణలో కలుపండి అని డిమాండ్ చేయడం ప్రారంభించాయి. ఇలా ఎందుకు జరుగుతుంది? అనే ఆసక్తి మాకు పెరిగింది. ఈ క్రమంలో మేం కొన్ని బృందాలుగా ఏర్పడి తెలంగాణ సరిహద్దు గ్రామాలే కాకుండా కొన్ని పట్టణాలను కూడా పరిశీలించాం.
మహారాష్ట్ర ప్రభుత్వానికి, తెలంగాణ ప్రభుత్వానికి జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉన్నది. ఇక్కడ (మహారాష్ట్ర) ప్రతి పనికి లంచం. అవినీతి విపరీతంగా ఉంది. మార్కెట్లలో రైతులు దోపిడీకి గురవుతున్నారు. వడ్డీ వ్యాపారుల ధాష్టీకాలు సరేసరి. పండిన పంటకు గిట్టుబాటు దొరకదు. 9 గంటల కరెంట్ అంటరు..కానీ నాణ్యమైన కరెంట్ ఉండదు. బోర్లు, మీటర్లు..ఇదేమని అడిగితే స్పందించని దైన్యస్థితి. ఒక్కమాటలో చెప్పాలంటే మహారాష్ట్రలో రైతులు నిలువు దోపిడికీ గురవుతున్నారు. దీంతో మహారాష్ట్ర రైతులు తెలంగాణ రైతులతో పోల్చుకోవడం మొదలుపెట్టారు. తాము నేరుగా తెలంగాణ రైతులతో మాట్లాడుతున్నప్పుడు వారి ముఖాల్లో వెలుగును చూశాం. తెలంగాణలో రైతు ఏవిధంగా మరణించినా అతడి కుటుంబం ఎలాంటి దరఖాస్తు చేయకున్నా కేవలం 15 రోజుల్లోపే రూ.5 లక్షల బీమా సొమ్ము ఖాతాలో జమ కావడం గొప్ప విషయం. మాకు ఎదురైన రెండు సజీవ సంఘటనల గురించి ప్రస్తావిస్తాను.
మహారాష్ట్రలో సోన్‌పేట్ పెద్ద బ్లాక్. ఇక్కడ అనంత్ ముల్గీ మహాత్పూరి (36)అనే విద్యావంతుడైన యువరైతు ఆత్మహత్య మహారాష్ట్ర రైతుల దుస్థితికి అద్దం పడుతున్నది. అనంత్ ఉన్నత విద్యను అభ్యసించినా ప్రభుత్వ కొలువు రాలేదు. తన 5 ఎకరాల్లో వ్యవసాయం మొదలుపెట్టాడు. ఒకటి రెండు సీజన్లు బాగానే నెట్టుకొచ్చాడు. పంట పెట్టుబడికి తీవ్ర ఇబ్బందిపడ్డాడు. భార్య మంగళసూత్రాన్ని వడ్డీవ్యాపారి దగ్గర తాకట్టు పెట్టాడు. సోయాబీన్, పత్తి సాగుకోసం రూ.2.60 లక్షలు ఖర్చు చేశాడు. కేంద్రం ఎగుమతుల విధానం, పత్తి ధర పడిపోవడం, సోయాబీన్‌కు అనువైన మార్కెట్ లేకపోవటం వంటి పరిస్థితుల వల్ల పెట్టుబడి రాకపోగా, అప్పుతో ఇంటికి తిరిగివచ్చాడు. ఇంటికి రాగానే భార్య మంగళసూత్రం గురించి ఆరా తీసింది. వారి మధ్య ఘర్షణ జరిగింది. దీంతో తీవ్ర మనోవ్యధకు గురైన యువరైతు ఆత్మహత్య చేసుకొన్నాడు. దాదాపు ఇలాంటి సంఘటనలే పర్భణి జిల్లా మానోత్ బాక్ల్‌లో ఏడు జరిగాయి. ఏడు రోజుల్లో ఏడుగురు రైతులు ఆత్మహత్య చేసుకొన్నారు.
సీఎం కేసీఆర్ మహారాష్ట్రలో తెలంగాణ మాడల్ తెస్తామని చెప్తున్నారు. అదే సమయంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్.. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు మహారాష్ట్రలో ఏం పని అంటున్నారు. దీన్ని మీరెలా చూస్తారు?
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడ్నవీస్‌కు కేసీఆర్ కంధార్-లోహాలో స్పష్టమైన సమాధానం చెప్పారు. ‘మీరు మాలాంటి పథకాలు మహారాష్ట్రలో అమలు చేస్తే నేను రావడం మానేస్తా’ అని చెప్పిన తీరుపై మహారాష్ట్ర ప్రజల్లో విస్తృతంగా చర్చ నడుస్తున్నది. రెండో ప్రపంచ యుద్ధానంతరం మార్షల్ ప్రణాళికతో పశ్చిమ యూరోప్ దేశాలు నిలదొక్కుకునేందుకు ఎలాంటి విధానాలు అనుసరించారో? ఆ విధానాలు దేశంలో అనుసరించాలని శరద్జోషిలాంటి వాళ్లు సూచించినా అమలు కాలేదు. కానీ కేసీఆర్ అంతకన్నా రెట్టింపు స్థాయిలో అమలు చేశారు. అందుకే కేసీఆర్‌ను రైతుల మార్షల్ అని పోల్చాను.
‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ అనే నినాదం దేశంపై కచ్చితంగా ప్రభావం చూపుతున్నది. ఇందుకు మా రాష్ట్రమే ప్రత్యక్ష ఉదాహరణ. కేసీఆర్ తెలంగాణ దాటి మొదటిసారిగా మహారాష్ట్రలోని నాందేడ్, కంధార్-లోహా రెండు చోట్ల మాట్లాడితేనే విస్తృతమైన చర్చ జరుగుతున్నది. ఒక రాష్ట్ర సీఎం మరో రాష్ర్టానికి వచ్చి ఆ రాష్ట్ర పాలకుడిపై సవాల్ చేయటం అన్నది మాములు విషయం కాదు. కేసీఆర్ నాందేడ్ సభ తర్వాతే మహారాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఏడాదికి ఎకరానికి రూ.6 వేల స్కీంను ప్రకటించింది. దీన్ని కేసీఆర్ విజయంగా రైతులు చెప్పుకొంటున్నారు. నేను ఇటీవల గుజరాత్, రాజస్థాన్‌ల్లో పర్యటించా. అక్కడా కేసీఆర్ గురించి మాట్లాడుకోవటం నేను విన్నాను.
మహారాష్ట్రలోని దెగ్లూర్ బ్లాక్‌లో (జహీరాబాద్‌కు సమీపంలో) పెద్ద మార్కెట్ ఉంది. ప్రతి వ్యవసాయ సీజన్లో తెలంగాణ రైతులు పెద్ద మొత్తంలో వచ్చి ఇక్కడి వడ్డీ వ్యాపారస్తుల నుంచి డబ్బులు తీసుకొని వెళ్లేవారు. తెలంగాణలో కేసీఆర్ వచ్చిన తర్వాత.. రైతుబంధు అమలైంది. ఆ తర్వాత రైతులెవరూ అప్పుకోసం ఇటువైపు కన్నెత్తి చూడలేదు. ‘తెలంగాణ రైతులెవరూ వడ్డీకి డబ్బులు తీసుకోకపోవడం వల్ల మేం నష్టపోతున్నాం’ అని దెగ్లూర్ వ్యాపారులు స్వయంగా చెప్పారు. ఇది పెద్ద మార్పు. రైతులకు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న గొప్ప భరోసా.
మహారాష్ట్రలో రాజకీయం సంక్షోభంలో ఉన్నది. ప్రస్తుతం కాంగ్రెస్, బీజేపీ, ఎన్సీపీ, శివసేన, శివసేన-2 నాలుగు పార్టీలున్నాయి. కాంగ్రెస్ పార్టీ రాహుల్‌గాంధీ కేసులు, జైలు పరేషాన్లో ఉన్నది. ఇక బీజేపీకి కొన్ని ప్రాంతాల్లోనే ఆదరణ ఉన్నది. రైతులు, సామాన్య ప్రజలు ఎవరూ బీజేపీ వైపు పోరు. ఎన్సీపీ నేత శరద్‌పవార్ వృద్ధాప్యానికి వచ్చారు. ఆయన మాటలు ఎవరికీ అర్థం కావు, ఆయన ప్రజల బాధలకు పరిష్కారాలు చూపే స్థితిలో లేరు. ఉద్ధవ్ ఠాక్రే తన తండ్రి బాల్‌ఠాక్రే స్థాపించిన శివసేనకు ద్రోహం చేశారు. ఇక శివసేన 2 (ఏక్నాథ్ షిండే)ను బీజేపీ ముసుగుగా భావిస్తున్నారు. ఇలా ఏ రకంగా చూసినా మహారాష్ట్రలో బీఆర్ఎస్సే తమకు ఉన్న అసలైన ప్రత్యామ్నాయం అని మహారాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. మహారాష్ట్రలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే 2 ఎంపీ స్థానాలు, 15 నుంచి 20 ఎమ్మెల్యే స్థానాల్లో బీఆర్ఎస్ నిర్ణయాత్మక శక్తిగా అవతరిస్తుందని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నా. -సుధీర్ సుధాకర్‌రావ్ బిందు
మహారాష్ట్రలో ప్రతీ గ్రామంలో మాకు కార్యకర్తలు ఉన్నారు. ఇక్కడి ప్రతీ రైతుకు శరద్‌జోషి తెలుసు. శరద్‌జోషి రైతులకు ఏం కావాలని కలలు కన్నారో వాటి కన్నా మిన్నగా తెలంగాణలో కేసీఆర్ చేసి చూపారు. మహారాష్ట్రలో కేసీఆర్ రెండు సభల్లో మాట్లాడిన మాటలు ఇక్కడి రైతులపై చాలా ప్రభావం చూపాయి. మా షేత్కరీ సంఘటనకు వస్తున్న ఫోన్లే ఇందుకు ఉదాహరణ. నాందేడ్, ఔరంగాబాద్, సోలాపూర్, పర్భణిలాంటి జిల్లాల నుంచి పేరుమోసిన నాయకులు బీఆర్ఎస్లో చేరడమే ఇందుకు నిదర్శనం. కేసీఆర్ విధానాలు, బీఆర్ఎస్ పార్టీ ఎజెండాను చూసిన తర్వాత ఎంతోకాలం నుంచి రైతుల మేలు కోసం చేస్తున్న మాకు చక్కటి ప్లాట్‌ఫాం దొరికిందని భావిస్తున్నాం. ఇవ్వాళో రేపో వచ్చి కేసీఆర్‌ను కలుస్తాం.