Nirmal | నిర్మల్ : ఓ వృద్ధుడి ప్రాణాలను బీడీ బలి తీసుకుంది. మంటల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యాడు. ఈ దారుణ ఘటన నిర్మల్ జిల్లాలోని దండేపల్లి మండ పరిధిలోని తళ్లపేట గ్రామంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. తళ్లపేట గ్రామానికి చెందిన నాగయ్య(55) తన భార్య, కుమారుడు, కోడలితో కలిసి నివాసం ఉంటున్నాడు. అయితే బుధవారం రాత్రి తన గదిలో నాగయ్య ఒంటరిగా నిద్రించాడు. బీడీ తాగే అలవాటు ఉండడంతో.. అర్ధరాత్రి వేళ వెలిగించాడు. దాన్ని ఆర్పేయకుండానే నిద్రలోకి జారుకున్నాడు. మంటలు మంచానికి అంటుకున్నాయి. దీంతో క్షణాల్లోనే బెడ్షీట్లకు మంటలు వ్యాపించి, నాగయ్య సజీవ దహనమయ్యాడు.
కాలిన వాసన రావడంతో కుమారుడు, కోడలికి మెలకువ వచ్చింది. అప్పటికే మంటల్లో కాలిపోయిన నాగయ్యను బయటకు లాగారు. కానీ అప్పటికే ప్రాణాలొదిలాడు. మృతుడి భార్య రాణి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.