DK Shivakumar | కర్నాటకలో గత కొద్దికాలంగా ముఖ్యమంత్రి మార్పుపై పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నది. త్వరలోనే డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. నవంబర్లో విప్లవం పేరుతో వస్తున్న ఊహాగానాలను కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తోసిపుచ్చారు. నవంబర్, డిసెంబర్లో విప్లవం ఉండదని.. 2028లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు మాత్రమే జరుగుతుందన్నారు. తాను పార్టీకి క్రమశిక్షణ కలిగిన సైనికుడినని.. సీఎం సిద్ధరామయ్యతో కలిసి పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఉంటానన్నారు. ఇటీవల సీఎం మార్పు జరిగే అవకాశం ఉందని.. దీన్ని కొందరు నవంబర్ విప్లవం అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై శివకుమార్ స్పందిస్తూ.. తాను ఎవరినీ కలవబోవడం లేదని.. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై ఎలాంటి చర్చ జరుగలేదన్నారు. ఇది ముఖ్యమంత్రి హక్కని.. పార్టీ ఏది నిర్ణయించినా అదే జరుగుతుందన్నారు.
పార్టీ ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉంటారని చెబితే.. ఆయన అలాగే ఉంటారని.. ఆయన పదేళ్లు, పదిహేనేళ్లు ఉండాలనుకుంటే అన్ని సంవత్సరాలు కొనసాగుతారన్నారు. మీడియాలో వస్తున్న ఊహాగానాలను ఆయన తోసిపుచ్చారు. నవంబర్, డిసెంబర్, జనవరిలో విప్లవం రాదని.. 2028లో కాంగ్రెస్ తిరిగి వచ్చినప్పుడు ఆ విప్లవం జరుగుతుందన్నారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై ప్రశ్నించగా.. ఢిల్లీ హైకమాండ్ దీనిపై నిర్ణయం తీసుకుంటుందని శివకుమార్ వ్యాఖ్యనించారు. ఇదిలా ఉండగా.. ఇటీవల సిద్ధరామయ్య ఇటీవల తన ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేస్తానని, అయితే తుది నిర్ణయం పార్టీదేనని స్పష్టం చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత.. సీఎం పదవి కోసం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ పోటీపడ్డ విషయం తెలిసిందే. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ చెరో రెండున్నరేళ్లు సీఎంగా కొనసాగే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి.