రామవరం, నవంబర్ 06 : సింగరేణిలో పేరుకుపోయిన కార్మిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని, కమిటీల పేరు మీద కాలయాపన చేయవద్దని కొత్తగూడెం ఏరియా బ్రాంచ్ కార్యదర్శి వి.మల్లికార్జునరావ్ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. గురువారం కొత్తగూడెం ఏరియాలో అన్ని మైన్స్, డిపార్ట్మెంట్స్ నందు ఏఐటీయూసీ మెమొరాండం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యంగా మెడికల్ బోర్డు ఆరు నెలల నుంచి నిర్వహించకపోవడం వల్ల కార్మికులు అనారోగ్య కారణాల వల్ల ఉద్యోగం చేయలేకపోవడంతో ఆర్థికంగా కుటుంబాలు ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు. సొంత ఇంటి పథకం అమలు చేయాలని, మారుపేర్ల మీద ఉన్న విజిలెన్స్ కేసులు పరిష్కరించి వారి పిల్లలకు ఉద్యోగం ఇవ్వాలన్నారు. అలవెన్స్‌ల మీద విధిస్తున్న ఇన్కమ్ ట్యాక్స్ కోల్ ఇండియాలో మాదిరిగా యాజమాన్యమే భరించాలని కోరారు.
అలాగే డిస్మిస్ అయిన ఉద్యోగులకు మరోసారి అవకాశం కల్పించాలని, సింగరేణి యాజమాన్యం గుర్తింపు సంఘంతో చర్చించకుండా 150 మస్టర్ల సర్కులర్‌ను వెంటనే రద్దు చేయాలన్నారు. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న జూనియర్ అసిస్టెంట్ పరీక్షను వెంటనే నిర్వహించాలని, మెడికల్ అన్‌ఫిట్ అయ్యి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న కార్మికుల పిల్లలకు వెంటనే ఉద్యోగం కల్పించాలన్నారు. వీకే కోల్ మైన్ పర్మినెంట్ ఉద్యోగాలతోనే నడిపించాలని, ఈ డిమాండ్లను యాజమాన్యం త్వరగా స్పందించి పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో కార్మికులందరూ ఆందోళనలకు సిద్ధంగా ఉండాలని, నిరవధిక సమ్మెకు కూడా సిద్ధంగా ఉండాలని కార్మికులకు పిలుపునిచ్చారు.
కార్మికుల డిమాండ్స్ పరిష్కరించాలని అన్ని మైన్స్, డిపార్ట్మెంట్స్ నందు మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో సహాయ కార్యదర్శి గట్టయ్య, ఆఫీస్ బ్యారర్స్, సందబోయిన శ్రీనివాస్, ఎస్.నాగేశ్వరరావు, హీరాలాల్, పిట్ కార్యదర్శిలు హుమాయూన్, మధుకృష్ణ, కమల్, ఏం ఆర్ కే ప్రసాద్, సురేందర్, సౌజన్య, సీనియర్ నాయకులు రాజాలపూడి సాంబమూర్తి, బండి వెంకటరమణ, కర్రు రమేశ్, మెంగన్ రవి, కోటి, మురళి, గుమ్మడి మురళి, మాచర్ల శ్రీనివాస్, ఓం ప్రకాశ్, సుబ్రమణ్యం, వినయ్, లిఖిత్, గావిని నాగరాజు, రాజేశ్, సురేశ్, సాగర్, కృష్ణ, కార్మికులు పాల్గొన్నారు.

Ramavaram : సింగరేణి కార్మికులు నిరవధిక సమ్మెకు సిద్ధం కావాలి : వి.మల్లికార్జున్ రావు