రామన్నపేట, నవంబర్ 06 : గీత పనివారలకు చెల్లించాల్సిన రూ.13 కోట్ల ఎక్స్ గ్రేషియా బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం రామన్నపేట మండల తాసీల్దార్ కార్యాలయం ముందు గీత పనివారల సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమానికి గీత పనివారల సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా సహాయ కార్యదర్శి ఎర్ర రమేశ్ గౌడ్ హాజరై మాట్లాడారు. గీత వృత్తిలో చనిపోయిన కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా రూ.5 లక్షల నుండి రూ.10 లక్షలకు పెంచాలన్నారు. తాత్కాలికంగా గాయపడిన వారికి రూ.2 లక్షల ఇవ్వాలన్నారు. మెడికల్ బోర్డు విధానం రద్దు చేయాలని, ప్రభుత్వ సివిల్ సర్జన్ పర్యవేక్షణలో సర్టిఫికెట్లు అందజేయాలన్నారు. ప్రతి సొసైటీకి టిఎఫ్టిలకు గ్రామాల పునాదిగా వనం పెంపకాలకు 560 జీఓ ప్రకారం 5 నుండి 10 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించాలన్నారు.
ప్రమాదవశాత్తు గీత పనివారలు చనిపోయినట్లయితే అతని భార్యకు వెంటనే పెన్షన్ ఇవ్వాలన్నారు. 50 ఏండ్లు నిండిన గీత వృత్తిదారులకు ఫించను వెంటనే మంజూరు చేయాలన్నారు. గీత పనివారల కుటుంబాలకు ప్రభుత్వ పథకాలను వృత్తి పునాదిగా వర్తింపజేసి విద్య, వైద్య, గృహ వసతి, విదేశీ విద్యను అభ్యసించుటకు కావాల్సిన ఆర్థిక సహకారం అందించాలని కోరారు. బీసీ రిజర్వేషన్ 42 శాతం అమలు చేయాలని, బడుగు బలహీన వర్గాల కోసం జీవితం అంకితం చేసిన ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, మూడుసార్లు ఎమ్మెల్యే, రెండుసార్లు ఎంపీగా ఉండి దివంగతులైన బొమ్మగాని ధర్మభిక్షం జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని, హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై ఆయన కంచు విగ్రహం ఏర్పాటు చేయాలని కోరారు. ధర్మభిక్షం జయంతి, వర్ధంతులను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలన్నారు.
భువనగిరి మండలం నందన గ్రామంలో నీరా పరిశ్రమను వెంటనే ఏర్పాటు చేయాలన్నారు. అలాగే ప్రతి మండలంలో నీరా కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం తాసీల్దార్ కు మెమోరాండం సమర్పించారు. ఈ కార్యక్రమంలో గీత పనివారల సంఘం మండల అధ్యక్షుడు గంగాపురం వెంకటయ్య, గీత పనివారల సీనియర్ నాయకులు బాలగోని మల్లయ్య, కొమ్మాయిగూడెం గీత పనివారల నాయకులు బాలగోని నర్సింహ్మ, బత్తుల సత్తయ్య, చెరుకు శివరాజ్, నోముల వెంకటేశ్, కూనూరు నర్సింహ్మ, పల్లె మల్లేశ్ పాల్గొన్నారు.