Satyavathi Rathod | మహబూబాబాద్ : రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లోని లగచర్లలో గిరిజన కుటుంబాలపై ప్రభుత్వం చేయించిన దాడి రాహుల్ గాంధీకి కనిపించడం లేదా అని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి కట్టే కప్పానికి రాహుల్‌గాంధీ నోరు తెరవడం లేదన్నారు. గురువారం మానుకోట పట్టణంలోని బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. లగచర్లలో 300 కుటుంబాలపై అర్ధరాత్రి కరెంటు తీసేసి, పిల్లలు మహిళలు అని చూడకుండా విచక్షణారహితంగా ప్రవర్తించి పోలీసులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తే దానిపై రాహుల్ గాంధీ ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. లగచర్లలో గిరిజన రైతులపై జరిగిన దాడిని దేశ రాజధాని ఢిల్లీలో వివరించినా ఇప్పటివరకు ఈ ఘటనపై రాహుల్ గాంధీ నోరు మెదపకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు.
గురువారం పట్టణంలో నిర్వహించే మహాధర్నా కార్యక్రమానికి శాంతి భద్రతల పేరుతో పోలీసులు అనుమతి నిరాకరించారన్నారు. కేటీఆర్ పర్యటనను అడ్డుకుంటామని, అతనిపై రాళ్ల దాడి చేస్తామని జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ గిరిజన ప్రజాప్రతినిధులు మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, డోర్నకల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ రామచంద్రునాయక్, మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళి బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పినా పోలీసులు వారిపై ఎందుకు కేసు నమోదు చేయలేదన్నారు. వెంటనే కాంగ్రెస్ చెందిన ముగ్గురు ప్రజాప్రతినిధులపై సుమోటో కేసు నమోదు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డి పతనం ప్రారంభమైందని తెలిపారు. రానున్న రోజుల్లో లగచర్ల ఘటనను జాతీయ స్థాయిలో తీసుకెళ్లి ఉద్యమిస్తామని తెలిపారు. త్వరలోనే హైకోర్టు అనుమతితో పెద్ద ఎత్తున భారీ ధర్నా నిర్వహిస్తామని సత్యవతి రాథోడ్ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Congress Party | రోడ్డెక్కిన కాంగ్రెస్ శ్రేణులు.. వలస నేతలకు పదవులు ఇవ్వడంపై ఆగ్రహం
Junior Lecturers | జూనియర్ లెక్చరర్స్ ఇంగ్లీష్, మ్యాథ్స్ అభ్యర్థుల తుది జాబితా విడుదల
MLC Kavitha | అఖండ భారతంలో అదానికో న్యాయం.. ఆడబిడ్డకో న్యాయమా..? ఎమ్మెల్సీ కవిత ట్వీట్