Koppula Eshwar | షాద్నగర్లో దళిత మహిళతో పోలీసులు వ్యవహరించిన తీరుపై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. దళిత మహిళలో పోలీసులు వ్యవహరించిన తీరు అత్యంత నీచమైందని ధ్వజమెత్తారు. నేరం ఒప్పుకోవాలంటూ మహిళ అని చూడకుండా థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా? ఇదెక్కడి ఇందిరమ్మ రాజ్యం..? అంటూ ప్రశ్నించారు. క్రమశిక్షణ నేర్పించే పోలీసులు క్రమశిక్షణ తప్పుతుంటే రేవంత్రెడ్డి సర్కారు చోద్యం చూస్తుందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో దళిత మహిళపై ఇంత చూపా ? అంటూ నిలదీశారు. దళితులు మనుషులు కాదా..? అని ప్రశ్నించారు. సమాజం తలదించుకునే సంఘటన ఇదని.. ఈ కాంగ్రెస్ పాలనలో రక్షించాల్సిన పోలీసులతోనే రక్షణ లేని పరిస్థితి ఎదురైందని ఆందోళన వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన పోలీసులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
బాధిత మహిళలకు న్యాయం చేయాలన్నారు. దళిత, మహిళా వ్యతిరేక కాంగ్రెస్ సర్కారును తెలంగాణ సమాజం ఎప్పటికీ క్షమించదన్నారు. అసెంబ్లీ సాక్షిగా స్వయంగా ముఖ్యమంత్రి, మంత్రులు ఆడబిడ్డలను అవమానించారని.. తామేమీ వారికి తీసిపోమని షాద్నగర్లో దళిత మహిళపై పోలీసులు దాడికి పాల్పడ్డారన్నారు. దొంగతనం ఒప్పుకోవాలంటూ థర్డ్ ప్రయోగిస్తారా? అంటూ నిలదీశారు. అప్పనంగా వచ్చే డబ్బుల కోసం ఆశపడుతున్నారని.. దీనికి ఉదాహరణ షాద్నగర్ ఘటన అన్నారు. రికవరీ సొమ్ము కోసం ఆశపడి ఫిర్యాదుదారుడితో కుమ్మక్కై ఓ దళిత మహిళ అని చూడకుండా చిత్రహింసలకు గురి చేశారని ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఈ ఘటన బయటికి జాగ్రత్తపడ్డారన్నారు. ఆడబిడ్డల ఉసురు ప్రభుత్వానికి ఏమాత్రం మంచిది కాదని.. గౌరవించకపోయినా ఫర్వాలేదు కానీ దౌర్జన్యాలు చేయొద్దని సూచించారు.