రాజోలి: తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకానికి (Thummilla Lift) నీటి విడుదలపై వివాదం ఏర్పడింది. మంగళవారం ఉదయం రాజోలి మండలంలోని తుమ్మిళ్ల లిఫ్టు మోటార్లను స్థానిక ఎమ్మెల్యే విజయుడు ఆన్ చేసి నీళ్లు విడుదల చేశారు. పంప్‌హౌస్ మోటార్లు ఆన్ చేసి ఆర్డీఎస్ కాలువ వద్దకు చేరుకున్నారు. మోటార్లు ఆన్‌చేసి మూడు గంటలైనా నీళ్లు రాకపోవడంతో విస్మయం వ్యక్తంచేశారు.
అయితే తుమ్మిళ్ల నుంచి విజయుడు వెళ్లిన కాసేపటికే అక్కడికి చేరుకున్న మాజీ ఎమ్మెల్యే సంపత్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి పంప్‌లను ఆఫ్ చేశారు. దీంతో ఆర్డీఎస్ కాలువకు నీరు నిలిచిపోయిందని ఎమ్మెల్యే విజయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలంపూర్ నియోజకవర్గంలో సకాలంలో వర్షాలు కురవక పోవడంతో పంటలు ఎండిపోతున్నాయని చెప్పారు. రైతుల సమస్యలను గుర్తించి సాగునీటిని విడుదల చేస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డుకోవడం దురదృష్టకరమని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాగా, రైతులతో కలిసి తుమ్మిళ్లకు లిఫ్ట్ఇరిగేషన్ ప్రాజెక్టు వద్దకు చేరుకున్న ఆయన రోడ్డుపై భైఠాయించారు.